కొత్త స‌ర్పంచ్‌లు త‌స్మాత్ జాగ్ర‌త్త‌

తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. కొత్త సర్పంచులు, వార్డు సభ్యులు ఈ నెల 22న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే, ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులకు ఎన్నిక‌ల సంఘం కీలక హెచ్చరిక చేసింది. 45 రోజుల్లోగా ఖర్చుల వివరాలు ఇవ్వకపోతే పదవులు కోల్పోవడమే కాకుండా, మూడేళ్లపాటు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉండదని హెచ్చ‌రించింది. అభ్యర్థులు వెంటనే ఎంపీడీవోలకు వివరాలు సమర్పించాల్సిందిగా రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది.

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థులు 45 రోజుల్లో తమ ఖర్చుల వివరాలను సమర్పించాలని, లేక‌పోతే కఠిన చర్యలుంటాయని రాష్ట్ర ఎన్నికల సంఘం హెచ్చరించింది. సరైన వివరాలివ్వకపోతే పదవులు కోల్పోతారని స్పష్టం చేసింది. అభ్యర్థులందరూ ఎన్నికల ఖర్చు వివరాలను సంబంధిత ఎంపీడీవోలకు సమర్పించాలని సూచించింది. అభ్యర్థులు సమర్పించిన వివరాలను పరిశీలించి, టీఈ -పోల్‌ వెబ్‌ పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేయాలని ఎన్నిక‌ల సంఘం అధికారులు ఎంపీడీవీల‌కు సూచించారు. నివేదికలను ఫిబ్రవరి 15లోపు ఎస్‌ఈసీకి పంపాలని స్పష్టం చేశారు. ఎస్‌ఈసీ నిబంధనల ప్రకారం 5వేల లోపు జనాభా ఉన్న పంచాయతీల్లోని సర్పంచ్‌ అభ్యర్థి గరిష్ఠంగా రూ.1,50,000, వార్డు అభ్యర్థి రూ.30 వేల వరకు ఖర్చుచేయాలని పేర్కొంది. 5 వేలకు పైగా జనాభాఉన్న పంచాయతీల్లో సర్పంచ్‌ అభ్యర్థి గరిష్ఠంగా రూ.2,50,000, వార్డు అభ్యర్థి రూ.50వేల వరకు ఖర్చుచేయాలని నిర్ణయించింది.

సర్పంచ్‌, వార్డుల స్థానాల్లో పోటీచేసిన అభ్యర్థులు తమ ఎన్నికల ఖర్చు వివరాలను వెల్ల‌డించారు. తొలివిడత ఎన్నికల్లో పాల్గొన్నవారు 2026 జనవరి 24లోపు, రెండో విడతలో పాల్గొన్నవారు జనవరి 27లోపు, మూడో విడతలో పాల్గొన్నవారు జనవరి 30లోపు ఎంపీడీవోలకు సమర్పించాలి. గడువులోగా ఖర్చు వివరాలు ఇవ్వకున్నా.., తప్పుడు సమాచారం ఇచ్చినా తెలంగాణ పంచాయతీరాజ్‌ చట్టం-2018లోని సెక్షన్‌ 23ప్రకారం.. గెలిచిన అభ్యర్థులు తమ పదవి కోల్పోవాల్సి ఉంటుంది. మరో మూడేళ్లవరకు ఏ ఎన్నికల్లోనూ పోటీచేయకుండా నిషేధం కూడా విధిస్తామని వెల్లడించారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like