అదిగో పులి.. వామ్మో దెయ్యం..

అదిగో తోక‌.. అంటే ఇదిగో పులి అనేది పాత సామెత‌… అదిగో పులి అంటే.. ఇదిగో దెయ్యం అనేది కొత్త సామెత‌లా త‌య్యార‌య్యింది ప‌రిస్థితి. సోష‌ల్ మీడియా ప్ర‌భావంతో ఏది అస‌లు వీడియోనో..? ఏది న‌కిలీదో తెలుసుకోలేక జ‌నం గంద‌ర‌గోళానికి గుర‌వుతున్నారు. తాజాగా మంచిర్యాల జిల్లాలో ఓ పులి, దెయ్యానికి సంబంధించిన వీడియోలు ప్ర‌జ‌ల‌ను భయ‌భ్రాంతుల‌కు గురి చేస్తున్నాయి…

మంచిర్యాల జిల్లా సింగరేణి ప్రాంతంలో ఈ నెల 11న మందమర్రి మండలం నుంచి ఆర్కే 5 న్యూ టెక్ కాలనీ, ఆర్కే 8, శ్రీరాంపూర్ జీఎం కార్యాలయం సమీపంలో పులి కంట‌ప‌డింది. ఓ వాహనదారుడు పులి వీడియోలను చిత్రీకరించి అటవీ శాఖకు సమాచారం ఇవ్వడంతో అలర్ట్ అయిన అటవీశాఖ అధికారులు రంగంలోకి దిగి పులి పాదముద్రలు సేకరించారు. అటవీశాఖ అదికారులు సమీప ప్రాంత ప్రజలను, సింగరేణి కార్మికులను అలర్ట్ చేశారు. పులి అదే రాత్రి శ్రీరాంపూర్ ఓపెన్ కాస్ట్ గుండా గోదావరి వైపు ప్రయాణం సాగించినట్టు గుర్తించారు.. ఇదే అదునుగా భావించిన కొందరు ఆకతాయిలు.. నస్పూర్ పట్టణంలోకి పులి వ‌చ్చిందంటూ ప్ర‌చారం చేశారు. ఓ ఫోటో సైతం వాట్స‌ప్ గ్రూప్‌లో షేర్ చేశారు. దీంతో అట‌వీశాఖ అధికారులు మ‌ళ్లీ రంగంలోకి దిగారు.

ఈ నేప‌థ్యంలోనే పులి కోసం గాలింపు చ‌ర్య‌లు చేప‌ట్టి ఎలాంటి ఆధారాలు లేక‌పోవ‌డంతో పోలీసుల‌ను ఆశ్ర‌యించారు. చివ‌ర‌కు ఆ ఫొటో ఫేక్ అని తేలింది. న‌స్పూర్‌కు చెందిన సాయికిర‌ణ్ అనే వ్య‌క్తిని అదుపులోకి తీసుకున్నారు. తీరా అది ఏఐ సాయంతో తీసిన ఫొటో అని తాను స‌ర‌దా కోస‌మే అలా చేశాన‌ని చెప్పుకొచ్చాడు. దీంతో నస్పూర్ లో పులి ప్రచారానికి తెర పడింది. అట‌వీ శాఖ అధికారులు ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని ఇలాంటి వ‌దంతులు న‌మ్మ‌వ‌ద్దంటూ స్ప‌ష్టం చేశారు.

ఇక మ‌రోవైపు దెయ్యానికి సంబంధించి సైతం వీడియో వైర‌ల్ కావ‌డంతో జ‌నం తీవ్ర భ‌యాందోళ‌న‌ల‌కు గుర‌య్యారు. ఇది కూడా మంచిర్యాల జిల్లా కేంద్రానికి సంబంధించి కావ‌డం ప్ర‌జ‌ల‌ను మ‌రింత ఆందోళ‌న‌కు గురి చేసింది. మంచిర్యాల ప్ర‌భుత్వ ఆసుప‌త్రి(జీజీహెచ్‌)లో దెయ్యం తిరుగుతోంద‌ని, సీసీ కెమెరాలో రికార్డు అయ్యింద‌ని ఓ వీడియో వైర‌ల్ అయ్యింది. దీంతో జ‌నం ఆందోళ‌న‌కు గుర‌య్యారు. దీనిపై ఆసుప‌త్రి సూప‌రిండెంట్ వేద‌వ్యాస్ మాట్లాడుతూ ఎవ‌రో గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు ఈ వీడియో పోస్టు చేశార‌ని చెప్పారు. వారిపై పోలీసుల‌కు ఫిర్యాదు చేస్తామ‌ని స్ప‌ష్టం చేశారు.

 

 

 

\

Get real time updates directly on you device, subscribe now.

You might also like