సర్పంచ్ ఎన్నికల్లో నకిలీ నోట్ల కలకలం.. భయాందోళనలో గ్రామస్థులు
ఎన్నికల్లో ఓట్లేసేందుకు జనం డబ్బులు తీసుకున్నారు… ఓటేశారు.. ఇంత వరకు బాగానే ఉంది. కానీ, కొన్ని చోట్ల నకిలీ వ్యవహారాలు వెలుగు చూస్తుండటంతో గ్రామస్తులు లబోదిబోమంటున్నారు. తాజాగా నిజామాబాద్ (Nizamabad) జిల్లా వర్ని (Varni) మండలంలోని కెనరా బ్యాంకు (Canara Bank)లో నకిలీ నోట్లు కలకలం రేపాయి. శుక్రవారం ఉదయం జలాల్పూర్ గ్రామానికి చెందిన చిన్న సాయిలు అనే రైతు పంట రుణం తిరిగి చెల్లించేందుకు బ్యాంకుకు వెళ్లాడు. అయితే, అతడు తీసుకెళ్లిన నగదులో నకిలీ నోట్లు ఉన్నట్లుగా బ్యాంకు సిబ్బంది గుర్తించారు.
రైతు చెల్లించడానికి తెచ్చిన రూ. 2,08,500 (417 రూ. 500 నోట్లు) నకిలీవిగా గుర్తించారు. ఆ నోట్లను ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఎవరు ఇచ్చారనే విషయాపై పోలీసులు ఆరా తీశారు. ఈ నోట్లను ఓ సర్పంచ్ అభ్యర్థి ఎన్నికల సందర్భంగా పంపిణీ చేసినట్లు తేలడంతో గ్రామస్తులు లబోదిబోమంటున్నారు. దీంతో ఆ అభ్యర్థి దగ్గర డబ్బులు తీసుకున్న వారిలో గుబులు మొదలైంది. ఈ వ్యవహారంపై పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు.