సింగరేణి డే వేడులకు అత్తెసరు నిధులా..?
Singareni Day:సింగరేణి నిధులను ఇతర ప్రాంతాల్లో విచ్చలవిడిగా ఖర్చు చేస్తూ సింగరేణి డేకు అత్తెసరుగా డబ్బులు విదిలించడం ఏమిటని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేతిరెడ్డి సురేందర్ రెడ్డి విమర్శించారు. ఆయన శుక్రవారం మాట్లాడుతూ సింగరేణి డే వేడుకలు దశాబ్దాలుగా ఆనవాయితీగా వస్తున్నాయని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మరింత ఉత్సాహంగా ఈ వేడుకలు నిర్వహించినట్లు తెలిపారు. ఏరియాల వారీగా ఈ వేడుకల కోసం యాజమాన్యం రెండు లక్షల నుంచి మూడు లక్షల వరకు ఖర్చు చేసేవారని ఆయన గుర్తు చేశారు. సింగరేణి సంస్థ ఆవశ్యకత తెలియజేస్తూ ఘనంగా ఉత్సవాలను జరిగేవన్నారు.
సింగరేణి సంస్థ కొత్త నిబంధనలు పెట్టి ఖర్చును పూర్తిగా తగ్గిందన్నారు. కేవలం 50 వేల రూపాయల నుండి 80 వేలకు మాత్రమే పరిమితం చేసిందన్నారు. ఉత్సవాలను సైతం కార్యాలయాల వరకే పరిమితం చేసిందని దుయ్యబట్టారు. ఇలాంటివి చాలా దారుణమని, దీనిని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం తీవ్రంగా వ్యతిరేకిస్తోందన్నారు. సింగరేణి సంస్థ తనకు సంబంధం లేని ప్రభుత్వ కార్యక్రమాలకు కోట్లాది రూపాయలను దారాదత్తం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సింగరేణి ఉత్సవాలకు బడ్జెట్ కేటాయించకుండా సింగరేణి కార్మికుల మనోభావాలను దెబ్బతీయడం ఏ మేరకు సమంజసమని ప్రశ్నించారు.
సంస్థ ప్రతిష్టను అవమానిస్తూ సింగరేణిలో మళ్లీ బ్రిటిష్ కాలం నాటి, ఆంధ్ర పెత్తందారుల పద్ధతులను యాజమాన్యం అవలంబిస్తూ పారిశ్రామిక అశాంతికి గురి చేస్తున్నదన్నారు. ఈ విషయంలో గుర్తింపు ప్రాతినిథ్య కార్మిక సంఘాల నాయకుల వైఖరి ఏంటో కూడా స్పష్టంగా తెలియజేయాలని కేతిరెడ్డి నిలదీశారు. ఏదైనా సర్కులర్ విడుదల కాగానే అది మా ఘనతే అని చెప్పుకునే ఈ సర్కారు సంఘాలు సింగరేణి డే కూడా చేసుకునే పరిస్థితి లేకుండా చేస్తున్నారని దుయ్యబట్టారు. సింగరేణి ఎన్నికల మేనిఫెస్టోలో సింగరేణి డేకు వేతనంతో కూడిన సెలవు ఇప్పిస్తామని చెప్పి ఇప్పుడు ఇంత దారుణంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. వెంటనే యాజమాన్యం ఈ సర్కులర్ ఉపసంహరించుకొని ఘనంగా ఉత్సవాలు జరుపుకోవడానికి పూర్తిస్థాయిలో బడ్జెట్ కేటాయించాలని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం డిమాండ్ చేస్తోందని ఆయన స్పష్టం చేశారు.