ఎలుగుబంటి అవ‌తారంలో కొత్త స‌ర్పంచ్…

స‌ర్పంచ్ ఎన్నిక‌ల్లో చాలా చోట్ల తాము కోతుల బెడ‌ద‌ను తొల‌గిస్తామ‌ని.. ఎన్నిక కాగానే మొద‌ట అదే అంశంపై దృష్టి పెడ‌తామ‌ని అభ్య‌ర్థులు వాగ్థానాలు గుప్పించారు. త‌మ‌కు డ‌బ్బులు వ‌ద్ద‌ని కోతుల బెడ‌ద తొల‌గిస్తే చాలాని చాలా మంది ప్ర‌జ‌లు సైతం అభ్య‌ర్థుల‌ను వేడుకున్నారు. ఇలా ఈ ఎన్నిక‌ల్లో చాలా చోట్ల కోతుల బెడ‌దపైనే దృష్టి ప‌డింది. అయితే, గ్రామంలో కోతుల బెడ‌ద తొల‌గించేందుకు కొత్త‌గా ఎన్నికైన స‌ర్పంచ్ ఓ ప్లాన్ వేసి మ‌రీ దానిని అమ‌లు చేశాడు.

కోతుల బెడదను తప్పించేందుకు కొత్తగా ఎన్నికైన సర్పంచ్‌ వినూత్న ఆలోచన చేయ‌డ‌మే కాకుండా స్వ‌యంగా తానే రంగంలోకి దిగాడు. నిర్మల్‌ జిల్లా కడెం మండలం లింగాపూర్‌ గ్రామ సర్పంచ్ చేసిన ప‌నికి అంద‌రూ ఫిదా అవుతున్నారు. లింగాపూర్‌ గ్రామ ప్రజలు మూడేండ్లుగా కోతుల బెడదతో ఇబ్బందులు పడుతున్నారు. కోతులను తరిమికొట్టేందుకు గతంలో ఎన్ని ప్ర‌య‌త్నాలు చేసినా అవి ఫ‌లించ‌లేదు. గ్రామ‌మంతా చందాలు వేసుకుని మ‌రీ బోనులు ఏర్పాటు చేశారు. కొన్ని కోతులు ప‌డ్డా.. పూర్తిస్థాయిలో ఆ ఇబ్బంది తొల‌గ‌లేదు.

దీంతో ఈ కోతుల బెడదను తప్పించేందుకు కొత్తగా ఎన్నికైన సర్పంచ్‌ కుమ్మరి రంజిత్‌ వినూత్న ఆలోచన చేశాడు. ఎలుగుబంటి వేషం వేసుకుని గ్రామంలో తిరిగాడు. అలా ఎలుగుబంటి కనిపించడంతో కోతులు పరారయ్యాయి. ఇలా వినూత్న ఆలోచనతో కోతుల బెడదను తగ్గించిన యువ సర్పంచ్‌ను గ్రామస్తులు మెచ్చుకుంటున్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like