కాంగ్రెస్‌లో మార్కెట్ క‌మిటీ చిచ్చు..

-పదేండ్లుగా ఎలాంటి ప‌ద‌వి లేని ద్వితీయ శ్రేణి నేత‌లు
-త‌మ‌కు మార్కెట్ క‌మిటీ చైర్మ‌న్ కావాల‌ని బెల్లంప‌ల్లి నేత‌ల ప‌ట్టు
-కాసిపేటలో ఓ నేత‌కు క‌ట్ట‌బెట్టేందుకు ఎమ్మెల్యే ప్ర‌య‌త్నాలు
-అక్క‌డ ప‌ద‌వి ఇచ్చి ప్రేంసాగ‌ర్ రావుకు చెక్‌పెట్టాల‌ని ఆలోచ‌న‌లు
-అలాంటి ఆలోచ‌న‌లు స‌రికావంటున్న హ‌స్తం పార్టీ నేత‌లు
-ఎట్టి ప‌రిస్థితుల్లో బెల్లంప‌ల్లి వారికే ఇవ్వాలంటూ ప‌ట్టు

స్థానిక సంస్థ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ నేత మ‌ధ్య గ్రూప్ వార్ ఇంకా త‌గ్గ‌నే లేదు.. ఇక ఇప్పుడు మార్కెట్ క‌మిటీ చైర్మ‌న్ ప‌ద‌వి కాంగ్రెస్ పార్టీలో చిచ్చు పెడుతోంది… ఆ ప‌ద‌వి ఇంకా ఎవ‌రికి ఇవ్వ‌కున్నా ఎమ్మెల్యే కొంద‌రికి ఇచ్చే ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయ‌ని తెల‌య‌డంతోనే అస‌మ్మ‌తి రాజుకుంటోంది. ఎవ‌రికైనా కేటాయిస్తే ప‌రిస్థితి ఏంట‌నేది అర్థం కావ‌డం లేదు… ఇంత‌కీ ఎవ‌రా ఎమ్మెల్యే…? ఆయ‌న ఆలోచ‌నేంటి..? నేతల ప‌రిస్థితి ఏంటి..? నాంది న్యూస్ ప్ర‌త్యేక క‌థ‌నం…

వ్యవసాయ మార్కెట్‌ కమిటీ పాలకవర్గాలను ఎప్పుడు నియమిస్తారా అని కాంగ్రెస్‌ పార్టీ నాయకులు ఎదురుచూస్తున్నారు. రిజర్వేషన్ల ప్రాతిపదికన‌ రొటేషన్‌ పద్ధతిలో ఆయా కమిటీల చైర్మన్‌ పదవుల కోసం పలువురు ఆశావహులు పోటాపోటీగా ప్రయత్నాలు చేస్తున్నారు. మార్కెట్‌ కమిటీల పాలక వర్గాలను నియమించాలని ఎమ్మెల్యేలు భావిస్తున్నారు. ఈ నేప‌థ్యంలోనే మార్కెట్ క‌మిటీ చైర్మ‌న్‌, డైరెక్ట‌ర్ ప‌ద‌వులు ఎవ‌రికి క‌ట్ట‌బెట్టాల‌నే విష‌యంలో క‌స‌ర‌త్తులు చేస్తున్నారు. మొద‌టి నుంచి పార్టీని అంటిపెట్టుకుని ఉన్నది ఎవ‌రు..? ఎన్నిక‌ల్లో త‌మ కోసం ప‌ని చేసింది ఎవ‌రు..? ప్ర‌జ‌ల్లో ప‌ట్టున్న నాయ‌కుడు ఎవ‌రు..? ఇలా అన్ని ర‌కాలుగా క‌స‌ర‌త్తు చేస్తున్నారు. సామాజిక వ‌ర్గాల స‌మ‌తూకంతో పాటు అన్ని అంశాల‌ను ప‌రిగ‌ణిలోకి తీసుకుంటున్నారు. నియోజ‌క‌వ‌ర్గం మొత్తం ప‌ట్టుండే ప‌ద‌వి కావ‌డంతో దానిపై పెద్ద ఎత్తున క‌స‌ర‌త్తు చేస్తున్నారు ఎమ్మెల్యేలు.

చైర్మ‌న్ ప‌ద‌వి త‌మ‌కు ద‌క్కేలా…
బెల్లంప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గానికి సంబంధించి అదే విధంగా క‌స‌ర‌త్తు జ‌ర‌గుతోంది. ఆ ప‌ద‌విపై చాలా మంది నేత‌లు సైతం క‌న్నేశారు. బెల్లంప‌ల్లి మార్కెట్ క‌మిటీ చైర్మ‌న్ ప‌ద‌వి ఈసారి ఎస్సీ మ‌హిళ‌కు కేటాయించారు. ప‌దేండ్లుగా ద్వితీయ శ్రేణి నాయ‌కుల‌కు ఎలాంటి ప‌ద‌వులు లేక‌పోవ‌డంతో ఎట్టి ప‌రిస్థితుల్లోనూ త‌మ‌కే ద‌క్కేలా వ్యూహాలు ర‌చిస్తున్నారు. త‌మ సీనియారిటీ, పార్టీ కోసం చేసిన సేవ‌లు, ఎమ్మెల్యే ఎన్నిక‌ల్లో తాము చేసిన కృషి ఇలా అన్ని ర‌కాలుగా ఎమ్మెల్యే ముందుకు తీసుకువెళ్తున్నారు. త‌మ‌కు మార్కెట్ క‌మిటీ చైర్మ‌న్ ప‌ద‌వి ఇస్తే రైతుల‌కు సేవ చేయ‌డంతో పాటు పార్టీ ప‌టిష్ట‌త‌కు సైతం పాటు ప‌డ‌తామ‌ని అన్ని ర‌కాలుగా స‌మ‌తూకంగా ఉంటుంద‌ని చెప్పుకొస్తున్నారు.

క్యూలో ఎంతో మంది నేత‌లు..
బెల్లంపల్లిలో మ‌హిళా కాంగ్రెస్ నేత రొడ్డ శార‌ద ఆ ప‌ద‌వి కోసం ఆశిస్తున్నారు. అదే స‌మ‌యంలో ముడిమ‌డుగుల మ‌హేంద‌ర్ సైతం త‌న భార్య‌కు చైర్మ‌న్ ప‌ద‌వికి క‌స‌ర‌త్తు చేస్తున్నారు. ఇక నేతకాని సామాజిక వ‌ర్గానికి చెందిన ముడిమ‌డుగుల శంక‌ర్ భార్య సైతం ఆ ప‌ద‌వి ఆశిస్తున్నారు. ఆయ‌న నేత‌కాని సామాజిక వ‌ర్గ‌మైనా గ‌త ఎన్నిక‌ల్లో దుర్గం చిన్న‌య్య‌కు స‌పోర్టు చేయ‌కుండా కాంగ్రెస్ వైపే ఉండి గ‌డ్డం వినోద్ గెలుపు కోసం తీవ్రంగా శ్ర‌మించారు. ఇక చిలుముల శంక‌ర్ భార్య‌, పోచంప‌ల్లి హ‌రీష్‌, జ‌మ్మికుంట విజ‌య్ వంటి నేత‌లంతా త‌మ‌కు ప‌ద‌వి ద‌క్కేందుకు తీవ్ర ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. తాము పార్టీకి చేసిన సేవ‌లు… ప‌ద‌వి ఇస్తే తాము ఏం చేయ‌ల‌గ‌మంటూ అన్ని ర‌కాలుగా ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్తున్నారు.

ఎమ్మెల్యే ఆలోచ‌న వేరే ఉంది…
అయితే, ఈ విష‌యంలో ఎమ్మెల్యే గ‌డ్డం వినోద్ మాత్రం వేరే ర‌కంగా ఆలోచిస్తున్నారు. ఈ ప‌ద‌వి ద్వారా త‌న‌కు ప‌ట్టుతో పాటు మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేంసాగ‌ర్ రావుకు చెక్ పెట్టేలా పావులు క‌దుపుతున్నారు. కాసిపేట మండ‌లం ప్రేంసాగ‌ర్ రావు సొంత మండ‌లం కావ‌డంతో త‌న ప‌ట్టు నిలుపుకునేందుకు ప్రేంసాగ‌ర్ రావు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఎమ్మెల్యే వినోద్‌ను నిత్యం చికాకుప‌రుస్తున్నారు. ఈ నేప‌థ్యంలోనే కాసిపేట మండ‌లానికి మార్కెట్ క‌మిటీ చైర్మ‌న్ ప‌ద‌వి ఇస్తే త‌న వ‌ర్గం బ‌లోపేతం అవుతుంద‌ని భావిస్తున్న ఎమ్మెల్యే అటు మొగ్గు చూపుతున్నారు. ర‌త్నం ప్ర‌దీప్ వ‌ర్గానికి ఆ ప‌ద‌వి క‌ట్ట‌బెట్టేందుకు నిర్ణ‌యం తీసుకుంటున్న‌ట్లు స‌మాచారం. దీనికి కాంగ్రెస్ సీనియ‌ర్ నేత కార్కూరి రాంచంద‌ర్ పూర్తి స్థాయిలో మ‌ద్ద‌తు చెబుతున్నారు. రాబోయే ఎన్నిక‌ల్లో ఆయ‌న జ‌డ్పీటీసీగా పోటీ చేసేందుకు సిద్ధమ‌వుతున్న నేప‌థ్యంలో ఈ మండ‌లానికి ప‌ద‌వి వ‌స్తే త‌న‌కు లాభం చేకూరుతుంద‌ని ఆయన భావిస్తున్నారు.

గుర్రుగా బెల్లంప‌ల్లి కాంగ్రెస్ నేత‌లు..
ఈ విష‌యం కాస్తా బ‌య‌ట‌కు పొక్క‌డంతో బెల్లంప‌ల్లి ప‌ట్ట‌ణ కాంగ్రెస్ పార్టీ నేత‌లంతా గుర్రుగా ఉన్నారు. ఎమ్మెల్యే ఇలాంటి నిర్ణ‌యం తీసుకోవ‌డం ఏమిట‌ని మండిప‌డుతున్నారు. బ‌య‌ట‌కు చెప్ప‌క‌పోయినా నేత‌లంతా ఈ విష‌యంలో స‌రైన నిర్ణ‌యం తీసుకోవాల‌ని కోరుతున్నారు. ఎమ్మెల్యే ఎన్నిక‌ల్లో తాము ఎంత‌గానో క‌ష్ట‌ప‌డ్డామ‌ని ఇలాంటి నిర్ణ‌యం తీసుకుంటే త‌మ క‌ష్టానికి ఫ‌లితం ఏమిట‌ని వారు ప్ర‌శ్నిస్తున్నారు. త‌మ‌కు ప‌ద‌వి ఉన్నా లేకున్నా ఇన్నేండ్లు క‌ష్ట‌ప‌డితే ఎమ్మెల్యే త‌మ‌ను ప‌ట్టించుకోక‌పోవ‌డం ఏమిటినే ఆవేద‌న వ్య‌క్తం అవుతోంది. ఎంతో మంది సీనియ‌ర్లు, క‌రుడుగ‌ట్టిన కాంగ్రెస్ వాదుల‌ను కాద‌ని మార్కెట్ క‌మిటీ చైర్మ‌న్ ప‌ద‌వి కాసిపేట మండ‌లానికి ఇవ్వ‌డం ఏమిట‌ని ప్ర‌శ్నిస్తున్నారు.

అయితే, ఇప్ప‌టికే ఓ నిర్ణ‌యానికి వ‌చ్చిన ఎమ్మెల్యే గ‌డ్డం వినోద్ రెండు, మూడు రోజుల్లో విష‌యం ప్ర‌క‌టించి అమెరికా ప‌ర్య‌ట‌న‌కు వెళ్ల‌నున్న‌ట్లు స‌మాచారం. దీంతో ఏం చేయాలో దిక్కుతోచ‌ని ప‌రిస్థితుల్లో కాంగ్రెస్ నాయ‌కులు ఆలోచ‌న‌లో ప‌డ్డారు. మ‌రి ఎమ్మెల్యే త‌న నిర్ణ‌యాన్ని మార్చుకుని బెల్లంప‌ల్లి నేత‌ల‌కే మార్కెట్ క‌మిటీ చైర్మ‌న్ ప్ర‌క‌టిస్తారా..? లేక ప్రేంసాగ‌ర్ రావుకు చెక్ పెట్టేందుకు ఇదే స‌రైన మార్గ‌మని భావించి త‌ను అనుకున్న నిర్ణ‌యానికే క‌ట్టుబ‌డి ఉంటారా..? వేచి చూడాల్సిందే..

 

 

 

 

 

 

Get real time updates directly on you device, subscribe now.

You might also like