నాగోబా మహాపూజలకు శ్రీకారం

గిరిజ‌న కుంభ‌మేళా నాగోబా జాత‌ర ప్రారంభ‌మైంది. త‌మ‌ ఆరాధ్య దైవమైన నాగోబా మహా పూజలకు మెస్రం వంశీయులు శ్రీకారం చుట్టారు. పుష్యమాస అమవాస్యను పురస్కరించుకొని 2026 జనవరి 18న కేస్లాపూర్ నాగోబా జాతర నిర్వహించనున్నారు. సోమవారం రాత్రి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని మెస్రం వంశీయులు ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్ చేరుకొని నాగోబా మురాడి దేవస్థానంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. మెస్రం వంశీయుల పటేల్ కేస్లాపూర్ నాగోబా ఆలయ పీఠాధిపతి మెస్రం వెంకట్ రావ్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించి సాంప్రదాయం ప్రకారం నెలవంక దర్శించుకుని, నాగోబాకు పూజలు నిర్వహించారు.

ఆదివాసీలకు పవిత్ర మాసం ఈ పుష్యమాసం.. కాళ్లకు చెప్పులు ధరించకుండ, మధ్య మాంసాలకు దూరంగా ఉంటూ నెలరోజుల పాటు అత్యంత పవిత్రంగా పుష్యమాసంలో అడవి బిడ్డలు తమ ఆరాధ్య దైవాలను కొలుస్తుంటారు. పుష్యమాసం ప్రారంభంతో నెల రోజుల పాటు భక్తి శ్రద్ధలతో తమ దైవాలను కొలుచుకుంటారు. జనవరి18న నాగోబాకు పవిత్ర గంగాజలంతో అభిషేకం నిర్వహించి మహాపూజ చేయనున్నారు. నాగోబాకు అభిషేకం కోసం కావలసిన పవిత్ర గంగాజలం సేకరణ, నాగోబా మహాపూజ, జాతర గురించి 7 గ్రామాల్లో, 7 రోజుల పాటు ప్రచారం నిర్వహించే (ఛకడ) ఎడ్లబండి నాగోబా ప్రచార రథయాత్ర మంగళవారం ప్రారంభించారు.

మరోసారి అందరూ మెస్రం వంశీయులు సమావేశమై ఈ నాగోబా ప్రచార రథయాత్ర గురించి రూట్ మ్యాప్ ను తయారు చేసి నాగోబాకు పూజలు చేసి ఛకడ వాహనం ఎడ్లబండిపై నాగోబా ప్రచార రథయాత్ర ప్రయాణం చేస్తారు. ఏడు రోజుల పాటు ఆయా గ్రామాల గుండా ఈ రథయాత్ర కొనసాగుతుంది. ఏడు గ్రామాలలో ఏడు రోజుల పాటు నాగోబా జాతర ప్రారంభం గురించి మహాపూజకు కావాల్సిన కుండలు ఇతర వాటి సేకరణ గురించి కార్యాచరణ మొదలుపెడతారు.

ఏడు రోజుల తర్వాత తిరిగి కేస్లాపూర్ కు చేరుకొని, నాగోబా అభిషేకం మహాపూజ కోసం కావలసిన పవిత్ర గంగాజలం కోసం మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని గోదావరిలోని హస్తలమడుగు వద్దకు పాదయాత్రగా బయలుదేరతారు. ఈ కార్యక్రమంలో మెస్రం వంశీయులు, మెస్రం చిన్నుపటేల్, బాజీరావు పటేల్, లింబారావ్ పటేల్, కోసు కటోడ, కటోడ హనుమంతరావ్, కోసేరావ్ కటోడ, మెస్రం మనోహర్, గణపతి, దాదారావ్, తిరుపతి, దేవ్ రావ్, సోనేరావ్, నాగనాథ్ లు పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like