ఉప సర్పంచ్‌లకు చెక్ పవర్ రద్దు.. క్లారిటీ ఇచ్చిన ప్రభుత్వం
Telangana:తెలంగాణలో ఉప సర్పంచ్‌లకు చెక్ పవర్ రద్దు.. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. రెండు రోజుల కిందటే కొత్త పాలక వర్గాలు కొలువుదీరాయి. చాలా మంది వార్డు సభ్యులు తమకు ఉపసర్పంచ్ పదవి కోసం పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేశారు. ఖర్చు కూడా పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఉప సర్పంచ్ లకు చెక్ పవర్ రద్దయ్యిందంటూ వార్తలు వెలువడటంతో వీరి నెత్తిన పెద్ద బండ పడినట్లయ్యింది. అయితే, ఈ కథనాలపై ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది.
ప్రభుత్వం ఇటీవల 15వ ఆర్థిక సంఘం నిధుల కోసం ప్రతి పంచాయతీలో ప్రత్యేక ఖాతా తెరవాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ నిధుల చెల్లింపులకు సర్పంచ్ , పంచాయతీ కార్యదర్శుల డిజిటల్ సంతకాలు తప్పనిసరి అని పేర్కొంది. ఈ ప్రక్రియలో ఉప సర్పంచ్ పేరు ప్రస్తావించకపోవడంతో ఉపసర్పంచ్‌కు సంబంధించి జాయింట్ చెక్ పవర్ రద్దయిందనే ప్రచారం జరిగింది. ఈ డిజిటల్ సంతకాలకు సంబంధించిన అంశం కేవలం కేంద్ర నిధుల నిర్వహణకు సంబంధించిన సాంకేతిక మార్పు మాత్రమే. గ్రామ పంచాయతీ సాధారణ నిధుల వినియోగంలో ఉప సర్పంచులకు ఉండే పాత అధికారాలు ప్రస్తుతానికి యథాతథంగా కొనసాగుతాయి.
రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన అధికారిక మెమోలో 15వ ఆర్థిక సంఘం నిధుల నిర్వహణకు సంబంధించిన అంశాలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చే 15వ ఆర్థిక సంఘం నిధులను జమ చేయడానికి ప్రతి పంచాయతీలో ఒక ప్రత్యేక ఖాతాను తెరవాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ ప్రత్యేక ఖాతా నుండి నగదు ఉపసంహరణ లేదా చెల్లింపులు జరపాలంటే.. పంచాయతీ కార్యదర్శి (లేదా ఎంపీడీఓ)… సర్పంచ్ (లేదా ఎంపీపీ) డిజిటల్ సంతకాలు తప్పనిసరి అని పేర్కొంది. ఈ మెమోలో ఎక్కడా ‘ఉప సర్పంచ్’ పేరు ప్రస్తావించకపోవడంతో.. అది వారి అధికారాన్ని రద్దు చేసినట్లుగా అధికారుల మధ్య , మీడియాలో ప్రచారమైంది. వాస్తవానికి.. తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం 2018 ప్రకారం సాధారణ నిధుల వినియోగంలో ఉప సర్పంచ్‌కు ఉన్న ఉమ్మడి సంతక అధికారం ఇంకా అమలులోనే ఉంది. ప్రభుత్వం ఇప్పుడు చేసిన మార్పు కేవలం కేంద్ర నిధుల నిర్వహణ , డిజిటల్ చెల్లింపుల ప్రక్రియను సరళీకృతం చేయడం కోసం మాత్రమే.
ప్రతి పనికి ఆన్లైన్ ద్వారా డిజిటల్ సంతకం చేయాల్సి ఉంటుంది. దీనివల్ల పారదర్శకత పెరుగుతుంది. 15వ ఆర్థిక సంఘం నిధులు నేరుగా ఢిల్లీ నుండి గ్రామాలకు అందుతాయి. వీటిని వినియోగించడానికి కేంద్రం నిర్దేశించిన కొన్ని సాఫ్ట్వేర్ పద్ధతులు పాటించాలి. ఇందులో ప్రధానంగా ‘సర్పంచ్ – కార్యదర్శి’ ద్వయాన్ని కీలక బాధ్యులుగా పరిగణిస్తారు. గ్రామ పంచాయతీకి వచ్చే పన్నులు, ఇతర ఆదాయాలకు సంబంధించి పాత పద్ధతిలోనే జాయింట్ చెక్ పవర్ కొనసాగనుంది. ఉప సర్పంచ్‌లకు ఉన్న జాయింట్ చెక్ పవర్ రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందనే ప్రచారం నేపథ్యంలో పలువురు నాయకులు, ఉపసర్పంచ్లు ఇది నిజమేనా..? అంటూ ఆరా తీస్తున్నారు.