కొత్త సర్పంచ్‌లకు ముఖ్యమంత్రి తీపి కబురు
CM Revanth Reddy:కొత్త సర్పంచ్‌లకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) తీపి కబురు అందించారు. కొత్త ఏడాదిలో పెద్ద గ్రామ పంచాయతీలకు రూ.10 లక్షలు, చిన్న గ్రామ పంచాయతీలకు రూ.5 లక్షల చొప్పున ప్రత్యేక అభివృద్ధి నిధులు ఇస్తామని ఆయన స్పష్టం చేశారు. గ్రామాల అభివృద్ధి కోసం సర్పంచ్‌లకు నేరుగా నిధులు అందిస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు. కొడంగల్ నియోజకవర్గం పరిధిలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్‌లకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం.. సర్పంచ్‌లకు తీపి కబురు చెప్పారు.
మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులకు సంబంధం లేకుండా ఈ ప్రత్యేక నిధులు ఇస్తామని తెలిపారాయన. అలాగే గ్రామాల్లో అర్హులందరికీ రేషన్ కార్డులు జారీ చేస్తాని సీఎం ప్రకటించారు. ఈ నిధులతో గ్రామంలో ఉన్న సమస్యలు పరిష్కరించుకోవాలని సూచించారు. పార్టీలకతీతంగా గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలని పిలుపునిచ్చారు. ప్రజా సేవ చేసేందకు ఇంతకన్నా మంచి అవకాశం రాదని తెలిపారు. తెలంగాణ అంటేనే నీళ్లు. ఉమ్మడి రాష్ట్రంలో నీటి పంపకాల్లో అన్యాయం చేశారు. తెలంగాణ వస్తే నీటి సమస్య తీరుతుందని అందరూ అనుకున్నారు. కానీ కేసీఆర్ పాలనలో ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి కాలేదు. పదేళ్ల పాలనలో పాలమూరును ఎండబెట్టారు. కేసీఆర్ వలస వచ్చి పాలమూరు ఎంపీ అయ్యారు. ఆ తర్వాత సీఎం అయ్యారు. అయినా కూడా పాలమూరుకు నీళ్లు రాలేదు. వేసుకోవడానికి బట్టలు, తిరగడానికి చెప్పులు లేని వాళ్లకి పదేళ్లలో వేల కోట్ల ఆస్తులు, ఫామ్‌హౌస్‌లు వచ్చాయి.
మీ సహకారం వల్లే నేను ఇంతటివాడిని అయ్యాను. 2009 నుంచి నన్ను మీ భుజాలపై మోశారు. కొడంగల్‌ను దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతా. గ్రామాలు బాగుంటేనే దేశం బాగుంటుంది. గ్రామాల్లో వివక్ష లేకుండా పరిపాలన సాగాలి. పార్టీలు.. పంతాలకు పోకుండా కలిసికట్టుగా పనిచేయాలి. గ్రామాల అభివృద్ధికి పాటుపడేలా సర్పంచ్‌లు ఉండాలి. ప్రజలకు ఉన్నతమైన, నాణ్యమైన సేవలు అందించాలి. పార్టీలకు అతీతంగా గ్రామాలు అభివృద్ధి కావాలని నూతన సర్పంచ్‌లకు సూచించారు సీఎం రేవంత్.