నకిలీ ఆర్ఎంపీ డాక్టర్ అరెస్ట్

-వైద్యం పేరుతో వృద్ధ మహిళ మృతికి కారణమైన నకిలీ ఆర్.ఎం.పి డాక్టర్
-చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు
-జైనథ్ సిఐ జి శ్రావణ్

అర్హత లేకుండా RMP డాక్టర్‌గా చలామణి అవుతూ, హైడోస్ ఇంజక్షన్ తో వృద్ధ మహిళ మృతికి కార‌ణ‌మైన వ్య‌క్తిని పోలీసులు అరెస్టు చేశారు. వివ‌రాల్లోకి వెళితే.. ఆదిలాబాద్ జిల్లా బేల మండలం ఇందిరానగర్‌కు చెందిన ఊరవేత శాంతాబాయి (65) అనే వృద్ధ మహిళకు ఛాతి నొప్పి, తల తిరుగుతోంద‌ని డాక్ట‌ర్ లక్ష్మణ్ వ‌ద్ద‌కు వెళ్లింది. దీంతో అర్హత లేకున్నా నిందితుడు ఆమెకు ఇంజక్షన్లు, గోలీలు ఇచ్చినట్లు విచారణలో వెల్లడైంది. అనంతరం ఆమె అస్వస్థతకు గురై కింద పడిపోవడం, 108 అంబులెన్స్ ద్వారా అదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

ఈ ఘటనపై కేసు న‌మోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. లక్ష్మణ్ అర్హత లేకుండా గత 15 సంవత్సరాలుగా RMP డాక్టర్‌గా చలామణి అవుతున్నాడ‌ని, అమాయక ప్రజలకు హైడోస్ ఇంజక్షన్లు ఇస్తూ అక్రమంగా డబ్బులు సంపాదిస్తున్నట్లు గుర్తించారు. విచారణలో నిందితుడి వద్ద నుంచి సిరంజీలు, ఇంజక్షన్లు, గోలీలను స్వాధీనం చేసుకున్నారు. గతంలో కూడా ఇతనిపై ఇలాంటి కేసులు నమోదు అయినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ల‌క్ష‌ణ్‌ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ అక్రమ చర్యలకు పాల్పడుతున్నాడని, అర్హతలేని వైద్యులపై కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.

ఈ సంద‌ర్భంగా పోలీసులు ప్ర‌జ‌ల‌కు ప‌లు సూచ‌న‌లు చేశారు. ప్రజలు ఆరోగ్య సమస్యల విషయంలో తప్పనిసరిగా ప్రభుత్వ, గుర్తింపు పొందిన అర్హత కలిగిన వైద్యుల వద్ద మాత్రమే చికిత్స పొందాలని స్ప‌ష్టం చేశారు. అర్హతలు లేని వ్యక్తుల వద్ద ఇంజక్షన్లు.. మందులు తీసుకోవద్దని పోలీసులు తెలిపారు. అనధికార వైద్యచర్యలు గమనిస్తే వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కేసులో నిందితుడిని అరెస్ట్ చేసిన జైనథ్ సీఐ, బేల పోలీస్ సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు.

 

Get real time updates directly on you device, subscribe now.

You might also like