అంతరాష్ట్ర గంజాయి ముఠా అరెస్ట్

Interstate marijuana gang arrested:గంజాయి ర‌వాణా చేస్తున్న అంత‌రాష్ట్ర ముఠాను ఆదిలాబాద్ జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. ఇంద్రవెల్లి మండలం శ్మశానవాటిక ప్రాంతం సమీపంలో మూడు ద్విచక్ర వాహనాలపై గంజాయి తరలిస్తున్న వ్య‌క్తులను గుర్తించి అరెస్టు చేశారు. ఈ సంద‌ర్భంగా 5.231 కిలోల డ్రై గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన వివ‌రాలు ఎస్పీ అఖిల్ మ‌హాజ‌న్ (SP Akhil Mahajan)ల్ల‌డించారు.

బస్సీ సంతోష్, శంకర్ గంజాయి విక్రయాల కోసం సిద్ధ‌మ‌య్యారు. దీనికి సంబంధించి సయేద్ సబీర్ గంజాయి కొనుగోలు–విక్రయాలకు మధ్యవర్తిగా వ్యవహరిస్తూ, రవాణా సమయాలు, ప్రదేశాలను ఖరారు చేయడంలో కీలక పాత్ర పోషించాడు. షేక్ ఖాజా అనే వ్య‌క్తి వ్యాపార పరిచయాలను ఉపయోగించి గంజాయి నిల్వలు దాచడం, విక్రయాలకు సహకరించినట్లు విచారణలో తేలింది. అంతర్రాష్ట్రంగా గంజాయి సరఫరా కోసం మహారాష్ట్రకు చెందిన గిరీష్ విట్టల్, షేక్ ఇర్షాద్ షరీఫ్ ముందుగానే స్థానిక నిందితులతో మొబైల్ ఫోన్ల ద్వారా సంప్రదింపులు జరిపి, గంజాయిని విక్రయించే ప్రణాళిక రూపొందించారు.

పోలీసుల తనిఖీల నుంచి తప్పించుకునేందుకు ఈ గ్యాంగ్ ద్విచక్ర వాహనాలపై గంజాయి త‌ర‌లించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. ఇంద్రవెల్లి పోలీసులు కొద్ది రోజులుగా గంజాయి అమ్మ‌కాలు, ర‌వాణాపై దృష్టి పెట్ట‌డంతో అదే స‌మ‌యంలో దాడి చేసి నిందితులను పట్టుకున్నారు.ఈ సంద‌ర్భంగా నిందితుల మొబైల్ ఫోన్లు ప‌రిశీలించిన పోలీసు అధికారుల‌కు మరికొందరు వ్యక్తుల ప్రమేయంపై కీలక ఆధారాలు వెలుగులోకి వచ్చాయి. గంజాయి మూలాలు, డబ్బు లావాదేవీలు, సరఫరా నెట్‌వర్క్‌పై లోతైన దర్యాప్తు కొనసాగుతోందని వారు వెల్ల‌డించారు.

నిందితులు ఏడాది కాలంగా గంజాయిని తక్కువ ధరకు కొనుగోలు చేసి, ఇంద్రవెల్లి మండలంతో పాటు ఇతర ప్రాంతాల్లో అధిక ధరకు విక్రయిస్తూ లాభాలు ఆర్జిస్తున్నట్లు విచారణలో అంగీకరించారు. ఈ గ్యాంగ్‌లో స్థానిక వ్యక్తులతో పాటు మహారాష్ట్రకు చెందిన నిందితులు కూడా ఉండటంతో ఇది అంతర్రాష్ట్ర గంజాయి రవాణా ముఠాగా పోలీసులు నిర్ధారించారు. గంజాయి కొనుగోలు, విక్రయాలకు సంబంధించిన లావాదేవీల్లో నగదు, మొబైల్ ఫోన్ల ద్వారా సంప్రదింపులు సాగుతున్నట్లు ఆధారాలు లభించాయి. ఈ సంద‌ర్భంగా పోలీసులు డ్రై గంజాయి 5.231 కిలోలు, మూడు ద్విచక్ర వాహనాలు, ఆరు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

జిల్లాలో మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయాలు, వినియోగంపై జీరో టాలరెన్స్ విధానం అమలు చేస్తామని పోలీసులు స్పష్టం చేశారు. గంజాయి, ఇతర మాదక ద్రవ్యాలకు సంబంధించిన సమాచారం ఉంటే ప్రజలు పోలీసులకు చెప్పాల‌ని స్ప‌ష్టం చేశారు. సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉట్నూర్ అదనపు ఎస్పీ కాజల్ సింగ్ ఐపీఎస్, ఉట్నూర్ సీఐ ఎం ప్రసాద్, ఎస్ఐ సాయన్న, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like