వివాదాలు వ‌ద్దు

CM Revanth Reddy:నదీ జలాల విషయంలో పక్క రాష్ట్రాలతో వివాదాలు కోరుకోవడం లేదని, చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) స్పష్టం చేశారు. నదీ జలాలకు సంబంధించి పంచాయతీ కావాలా..! నీళ్లు కావాలా..! అని అడిగితే తెలంగాణ రాష్ట్రానికి నీళ్లు కావాలని కోరుకుంటామని చెప్పారు. నదీ జలాలపై రాజకీయ ప్రయోజనం పొందాలని ప్రభుత్వం భావించడం లేదని, రాజకీయాలకు అతీతంగా చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని కోరుకుంటున్నామని అన్నారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం రావిర్యాలలోని ఈ-సిటీలో నెలకొల్పిన సుజెన్ మెడికేర్ (Suzen Medicare) ఫ్లూయిడ్స్ తయారీ యూనిట్ ముఖ్యమంత్రి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో తెలంగాణ జల వివాదాలను ప్రస్తావించారు. “పక్క రాష్ట్రాలతో తెలంగాణ వివాదాలను కోరుకోవడం లేదు. న్యాయస్థానాల ముందుకు లేదా మరెవరి వద్దనో పంచాయతీ పెట్టుకునే కన్నా సమస్యపై కూర్చొని చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని రేవంత్ స్ప‌ష్టం చేశారు. నీటి వివాదాల విషయంలో తెలంగాణ శాశ్వత పరిష్కారం కోరుకుంటోంది. అభివృద్ధి సాధించాలంటే పక్క రాష్ట్రాల సహకారం, సయోధ్య ఉండాలి. రాజకీయాలకు అతీతంగా పరిష్కారం కోసం అందరూ సహకరించాల”ని పక్క రాష్ట్ర ప్రజా ప్రతినిధులకు విజ్ఞప్తి చేశారు. కృష్ణా నదిపై ఉమ్మడి రాష్ట్రంలో మంజూరైన ప్రాజెక్టులకు అడ్డంకులు సృష్టించ వ‌ద్ద‌ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(Andhra Pradesh Chief Minister Nara Chandrababu Naidu)కి విజ్ఞప్తి చేశారు.

ఉమ్మడి రాష్ట్రంలో మంజూరైన పాలమూరు – రంగారెడ్డి, కల్వకుర్తి, డిండి, ఎస్ఎల్బీసీ, బీమా, నెట్టెంపాడు వంటి ప్రాజెక్టులకు ఆంధ్రప్రదేశ్ అభ్యంతరాల వల్ల పర్యావరణం, సీడబ్ల్యూసీ నుంచి సమస్యలు తలెత్తుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి రావలసిన నిధులు, అనుమతులు కూడా రావడం లేదని, తద్వారా రాష్ట్రంపై ఆర్థిక భారం పడుతోందని చెప్పారు. రాజకీయ ప్రయోజనాలకన్నా ప్రజలు, రైతుల ప్రయోజనాల కోసం ఆలోచన చేస్తున్నామని స్ప‌ష్టం చేశారు రేవంత్‌. ఏపీ రాజధాని అమరావతి అభివృద్ధి చెందాలంటే తెలంగాణ సహకారం అవసరం ఉంటుందని, పరస్పరం సహకరించుకుంటేనే సమస్యలు పరిష్కారమవుతాయని అన్నారు.

ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాలతో పరస్పర సహకారాన్ని మాత్రమే కోరుకుంటున్నామని చెప్పారు. రాష్ట్రాలు ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో వెళ్లాలని, చర్చల ద్వారా సమస్యల సంపూర్ణ పరిష్కారం కోసం ముందుంటామని అన్నారు. తెలంగాణ సమగ్రాభివృద్ధి కోసం రాష్ట్రాన్ని క్యూర్(#CURE), ప్యూర్(#PURE), రేర్(#RARE) మూడు భాగాలుగా అభివృద్ధి లక్ష్యాలను నిర్దేశిస్తూ గ్లోబల్ సమ్మిట్ లో తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ విడుదల చేశామని వివరించారు. సుజెన్ మెడికేర్ ఐవీ ఫ్లూయిడ్స్ ఉత్పత్తి యూనిట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి, శాసనమండలి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like