ఎమ్మెల్యే అనుచరుడిపై కేసు నమోదు
జర్నలిస్టును పరుషపదజాలంతో దూషించిన బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ అనుచరుడు కారుకూరి రాంచందర్ పై బెల్లంపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. 296(బీ), 351(2) బీఎన్ఎస్, 67 ఐటీఏ సెక్షన్ల ప్రకారం ఈ కేసు నమోదు అయ్యింది. నాపై కబ్జాల వార్తలు రాస్తావా అంటూ బెల్లంపల్లి ఎన్టీవీ రిపోర్టర్ రమేష్‌ను చంపేస్తానంటూ బెదిరింపులకు దిగాడు. ఫోన్ చేసి ఇష్టం వచ్చినట్లు తిట్టాడు రాంచందర్.. కుటుంబ సభ్యులను ప్రస్తావిస్తూ తిట్టూ అంతు చూస్తానంటూ బెదిరించాడు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన జర్నలిస్టులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
బట్టలిప్పి రోడ్డు మీద తంతా.. అంటూ పత్రికల్లో రాయలేని విధంగా మాట్లాడాడు. ఈ నేపథ్యంలో జర్నలిస్టు సంఘాలు భగ్గుమన్నాయి. బెల్లంపల్లిలో జర్నలిస్టులు పోలీసులకు ఫిర్యాదు చేయడమే కాకుండా, నల్లబ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు. మిగతా పార్టీలు సైతం ఈ ఘటనపై స్పందించాయి. కారుకూరి రాంచందర్‌పై వెంటనే కేసు నమోదు చేయాలని అతనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి.