పండ‌గ‌కు ఊరెళ్తున్నారా..?

-ఇండ్ల‌కు తాళాలు వేసి వెళ్లే వారు అప్రమత్తంగా ఉండాలి
-సీసీటీవీ కెమెరాల పనితీరు తప్పనిసరిగా పరిశీలించాలి
-ప్రజల సహకారంతోనే నేరాల నివారణ సాధ్యం
-రామ‌గుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా

పండుగలు, సెలవులు, వివాహాలు తదితర సందర్భాల్లో ఇండ్ల‌కు తాళాలు వేసి బయటకు వెళ్లే సమయంలో అప్రమత్తంగా ఉండాలని,చోరీలు ఇతర నేరాలు జరగకుండా స్వీయ రక్షణ చర్యలు తప్పనిసరిగా పాటించాలని పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా సూచించారు. ముఖ్యంగా ఈ సంక్రాంతి పండ‌గకు వెళ్లే వారి కోసం ప‌లు స‌ల‌హాలు, సూచ‌న‌లు అందించారు.

ఇళ్లకు తాళాలు వేసి వెళ్లే ముందు తలుపులు,కిటికీలు, గేట్లు సక్రమంగా మూసి ఉన్నాయా లేదా అన్న విషయాన్ని పూర్తిగా పరిశీలించుకోవాలని తెలిపారు. ఇండ్లు పరిసర ప్రాంతాల్లో అమర్చిన సీసీటీవీ కెమెరాలు సరిగా పనిచేస్తున్నాయా..? రికార్డింగ్ జరుగుతోందా…? నైట్ విజన్ సదుపాయం సక్రమంగా ఉందా..? అనే అంశాలను తప్పనిసరిగా తనిఖీ చేసుకోవాలని సూచించారు. సీసీ టీవీ కెమెరాలు సక్రమంగా పనిచేస్తే నేరాలకు పాల్పడే వ్యక్తుల్లో భయాన్ని కలిగించడంతో పాటు, ఏదైనా అనుకోని ఘటన జరిగినా నిందితులను గుర్తించేందుకు ఉపయోగపడుతాయన్నారు. ఇంటర్నెట్ సదుపాయం కలిగిన సీసీటీవీ కెమెరాలైతే మొబైల్ ఫోన్ యాప్ ద్వారా లైవ్ ఫుటేజ్ వీక్షించే విధంగా ముందుగానే సెటప్ చేసుకోవాలని సూచించారు.

ఇండ్ల‌కు తాళాలు వేసి వెళ్లే విషయాన్ని పొరుగువారు, నమ్మకమైన వ్యక్తికి ముందుగా చెప్పాలని స్ప‌ష్టం చేశారు. అవసరమైతే సంప్రదింపు ఫోన్ నంబర్ ఇవ్వడం భద్రతకు మరింత దోహదపడుతుందని తెలిపారు. రాత్రి సమయాల్లో ఇంటి వెలుపల లైట్లు వెలిగేలా టైమర్ ఏర్పాటు చేసుకోవడం వల్ల ఇల్లు ఖాళీగా ఉందనే అనుమానం కలగకుండా ఉంటుందని వివరించారు. ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలు, కదలికలు గమనిస్తే వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌,లేదా డయల్ 100 లేదా 112కు ఫోన్ చేయాలని పోలీస్ కమిషనర్ ప్రజలను కోరారు. ప్రజల సహకారంతోనే నేరాల నివారణ సాధ్యమవుతుందని, ప్రతి పౌరుడు భద్రత విషయంలో బాధ్యతగా వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like