తన్నుకున్న కాంగ్రెస్ నాయకులు
గోదావరిఖని జూనియర్ కళాశాల గ్రౌండ్ లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన డిప్యూటీ సీఎం, మంత్రుల బహిరంగ సభ అనంతరం ఇద్దరు నేతలు ఘర్షణకు దిగారు. మంత్రుల ప్రసంగాలు ముగిసిన వెంటనే వేదికపైనే ఇద్దరు కాంగ్రెస్ నాయకుల మధ్య వాగ్వాదం ఘర్షణకు దారితీసింది. రామగుండం కార్పొరేషన్ 11వ డివిజన్‌కు చెందిన మాజీ కార్పొరేటర్ పెద్దెల్లి తేజస్విని ప్రకాష్, NSUI నాయకుడు దాసరి విజయ్ మధ్య గత కొంతకాలంగా వర్గ పోరు నడుస్తోంది. తాజాగ బహిరంగ సభ వేదికపై ఇండ్ల పట్టాల విషయంలో ఇద్దరి మద్య వాగ్వివాదం చోటు చేసుకొని ఘర్షణకు దారి తీసింది.
పోలీసులతో దురుసు ప్రవర్తన
సభా వేదికపై గొడవ పడుతున్న నాయకులను వారించేందుకు ప్రయత్నించిన పోలీసులతో కూడా సదరు జూనియర్ నేత దురుసుగా వ్యవహరించడం గమనార్హం. సీనియర్ నాయకుల పట్ల జూనియర్ నేత ప్రవర్తించిన తీరుపై పార్టీ వర్గాల్లో అసహనం వ్యక్తమవుతోంది. ఇద్దరు నేతలు సభా వేదికపై ఘర్షణ పడటంతో స్థానిక నేతలు అసహనం వ్యక్తం చేశారు. మంత్రులు, ప్రజాప్రతినిధులు హాజరైన వేదికపై నాయకుల ఘర్షణ చర్చనీయాంశంగా మారింది. తరుచూ వివాదాస్పదంగా మారుతున్న జూనియర్ నాయకుడి వ్యవహారం పై నేతలు తలలు పట్టుకుంటున్నారు.
షొకాజ్ నోటీస్ జారీ …
బహిరంగ సభ అనంతరం NSUI నాయకుడు దాసరి విజయ్ తీరుపై రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బొంతల రాజేష్ షోకాస్ నోటీస్ జారీ చేశారు. రెండు రోజుల్లో సంజాయిషీ ఇవ్వాలని గడువు విధించారు. సంజాయిషీ ఇవ్వకపోతే కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయనున్నట్లు పేర్కొన్నారు.