చిప్స్ ప్యాకెట్ పేలి… చూపు కోల్పోయిన బాలుడు
ఒడిశాలోని బలంగీర్ జిల్లాలో మంగళవారం ఒక బాలుడు చిప్స్ ప్యాకెట్ పేలిపోవడంతో తన కన్ను కోల్పోయిన ఘటన జరిగింది. జిల్లాలోని తితిలాఘర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని షాగద్ఘాట్ లో ఈ సంఘటన జరిగింది.
వివరాల్లోకి వెళితే.. టిట్లాగఢ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సాగర్ ఘాట్ గ్రామానికి చెందిన లబ్ హర్పాల్ కుమారుడు అంకేష్ ట్యూషన్ నుంచి తిరిగి వస్తూ దారిలో ఓ షాపులో చిప్స్ ప్యాకెట్ కొనుక్కున్నాడు. ఇంటికి వచ్చిన తర్వాత ఆ ప్యాకెట్ తిందామని వంటగదిలోకి వెళ్లాడు. ఆ సమయంలో అతని తల్లి భానుమతి హర్పాల్ గ్యాస్ స్టవ్ మీద వంట చేస్తోంది. ఆమె నీళ్ల కోసం బయటకు వెళ్లిన సమయంలో బాలుడి చేతిలో ఉన్న చిప్స్ ప్యాకెట్ ప్రమాదవశాత్తు జారి మండుతున్న గ్యాస్ స్టవ్‌పై పడింది. వేడి తగలగానే ఆ ప్యాకెట్ ఒక్కసారిగా బాంబులా భారీ శబ్దంతో పేలిపోయింది. ఈ పేలుడు తీవ్రత నేరుగా బాలుడి ముఖంపై పడటంతో అతని కన్ను తీవ్రంగా దెబ్బతిని రక్తమోడింది. బాలుడి అరుపులు విని తల్లి పరుగెత్తుకుంటూ వచ్చేసరికి చిన్నారి రక్తపు మడుగులో కనిపించాడు.
కుటుంబ సభ్యులు వెంటనే బాలుడిని ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు ఆ కన్ను పూర్తిగా దెబ్బతిందని నిర్ధారించారు. ఆ కంటికి చూపు వచ్చే అవకాశం లేదని వైద్యులు చెప్పడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. “నేను బిస్కెట్లు తెచ్చుకోమని డబ్బులిస్తే వాడు చిప్స్ ప్యాకెట్ తెచ్చాడు.. ఇంత చిన్న వయసులో వాడికి ఇలా జరుగుతుందని ఊహించలేదు” అని ఆ తల్లి ఆవేదన వ్యక్తం చేస్తోంది. చిప్స్ తయారు చేసిన కంపెనీపై టిట్లాగఢ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్యాకెట్లో నింపిన గ్యాస్ నాణ్యత, అది పేలడానికి గల కారణాలను ఫోరెన్సిక్ నిపుణుల ద్వారా విచారిస్తామని పోలీసులు తెలిపారు.
అయితే, మరో కథనం ప్రకారం ఆ ప్యాకెట్ లోపల ఒక చిన్న బొమ్మ ఉంది. ఆ పిల్లవాడు ఈ చిన్న బొమ్మతో ఆడుకుని, ఆపై దానిని మంటల్లో విసిరాడు. అది మంటలను తాకిన వెంటనే, అది పేలిపోవడంతో అంకేష్ ముఖంలో తీవ్ర కాలిన గాయం అయింది. తీవ్రమైన నొప్పితో అతన్ని ఆసుపత్రిలో చేర్చారు. పేలుడు చాలా శక్తివంతంగా ఉండటంతో అతని ఒక కన్ను దెబ్బతిన్నట్లు వైద్యులు చెప్పారు. ఏది ఏమైనా పిల్లలకు మనం కొనిచ్చే చిప్స్ ప్యాకెట్ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అసలు వాటిని కొనివ్వకుండా ఉంటేనే మంచిదని స్పష్టం చేస్తున్నారు.