చ‌రిత్ర‌లో తొలిసారి…

తెలంగాణ చ‌రిత్ర‌లోనే మొద‌టి సారిగా హైద‌రాబాద్ బ‌య‌ట మంత్రి వ‌ర్గ స‌మావేశం నిర్వ‌హించ‌నున్నారు. సచివాలయపు గోడల మధ్య జరగాల్సిన కేబినెట్ భేటీ.. వనదేవతలు కొలువైన మేడారం గడ్డపై జరగనుంది. ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు మేడారం చేరుకోనున్నారు. ఆయ‌న‌తో పాటు మంత్రి వ‌ర్గ స‌హ‌చరులు, అధికారులు అంద‌రూ మేడారం వ‌స్తారు. ఇక్క‌డే మంత్రివ‌ర్గ స‌మావేశం నిర్వ‌హిస్తారు. మంత్రి సీతక్క శనివారం ఉదయం నుంచి ఇక్కడే మకాం వేసి ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నారు.

మంత్రివ‌ర్గంలో ఏం చ‌ర్చిస్తారంటే..?
ఆదివారం మేడారంలోని హరిత హోటల్‌లో సాయంత్రం 5 గంటలకు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నిర్వ‌హించ‌నున్నారు. మునిసిపాలిటీలు, కార్పొరేషన్లకు ఎన్నికల నిర్వహణపై ఈ భేటీలో తీర్మానం చేయనున్నారు. కేంద్ర బడ్జెట్‌లో కేటాయింపులకు అనుగుణంగా రాష్ట్ర బడ్జెట్‌ను రూపొందించే అంశంపై సీఎం రేవంత్‌ రెడ్డి దిశానిర్దేశం చేయనున్నారు. రైతు భరోసా నిధుల విడుదల, హ్యమ్‌రోడ్ల నిర్మాణం, పట్టణాభివృద్ధి పథకాలపైనా చర్చించే అవకాశముంది. సీఎం, మంత్రులు, వివిధ శాఖల కార్యదర్శులు, ఉన్నతాధికారులు.. మొత్తం కలిపి దాదాపు 3 వందల మంది బస చేసేందుకు వీలుగా ఏర్పాట్లు జరిగాయి. తెలంగాణ‌ చరిత్రలో తొలిసారిగా హైదరాబాద్‌ అవతల జరుగుతున్న తొలి మంత్రివర్గ సమావేశంగా ఇది చరిత్రకు ఎక్కనుంది.

రేపు ఉద‌యం ఏడు గంట‌ల‌కు..
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని మూడు నెలల్లోనే పునర్నిర్మాణం పూర్తి చేసిన గద్దెల ప్రాంగణాన్ని సీఎం రేవంత్‌రెడ్డి సోమవారం ఉదయం 7 గంటలకు ప్రారంభించి, వనదేవతలకు మొక్కులు చెల్లించుకుంటారు. మంత్రులు పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి, సీతక్క, కొండా సురేఖ, అడ్లూరి లక్ష్మణ్‌ తదితరులతో కలిసి గద్దెలు, నూతన రోడ్లు, కూడళ్లలో నిర్మించిన ఆదివాసీల జీవన చిత్రాలను ప్రారంభించనున్నారు. తర్వాత జరిగే సభలో సీఎం ప్రసంగిస్తారు. ఉదయం 10 గంటలకు హెలికాప్టర్‌లో హైదరాబాద్‌కు బయలుదేరతారు.

ప‌టిష్ట బందోబ‌స్తు.. ప్రత్యేక ఏర్పాట్లు
సీఎంతోపాటు పలువురు మంత్రులు, సీనియర్‌ ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులు కూడా ఆదివారం రాత్రి మేడారంలోని హరిత హోటల్‌లోనే బస చేయనున్నారు. వారి కోసం సుమారు 300 గదులను సిద్ధం చేశారు. మేడారం హరిత హోటల్‌తోపాటు తాడ్వాయి, లక్నవరం, రామప్ప, ములుగులో ఉన్న ప్రభుత్వ అతిథిగృహాలు, హరిత హోటళ్లను వారి కోసం కేటాయించారు. మేడారం హరిత హోటల్‌ సమీపంలో టెంట్‌ సిటీ ఏర్పాటు చేశారు. అందులో కొందరికి బస ఏర్పాటు చేస్తున్నారు. అటవీ, మావోయిస్టు ప్రభావిత ప్రాంతం కావడంతో సుమారు 2వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

 

Get real time updates directly on you device, subscribe now.

You might also like