వెంట వెంట‌నే పైస‌లు

ప‌ని చేస్తే డ‌బ్బులు ఎప్పుడు వ‌స్తాయో తెలియ‌దు… నెల‌ల త‌ర‌బ‌డి వాటి కోసం ఎదురు చూడాల్సిన దుస్థితి. కానీ ఇక నుంచి ఆ దుస్థితికి తెర‌ప‌డ‌నుంది. ఉపాధి హామీ పథకం కూలీలు పైసల కోసం ఇకపై నెలల తరబడి ఎదురుచూడాల్సిన పనిలేదు. పనిచేసిన వెంట వెంట‌నే డ‌బ్బులు ప‌డ‌నున్నాయి. ఈ మేర‌కు కేంద్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. ఈ మేర‌కు ఉత్త‌ర్వులు సైతం రాష్ట్ర ప్ర‌భుత్వ అధికారుల‌కు పంపించింది. కొత్త విధానం వ‌ల్ల నిధుల చెల్లింపుల్లో పారదర్శకత పెరగడమే కాకుండా, అనవసర ఆలస్యానికి చెక్ పడనుంది.

ఉపాధి హామీ నిధులు గ‌తంలో కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చి అక్కడి నుంచి జిల్లాల‌కు తర్వాత కూలీల ఖాతాల్లోకి వ‌చ్చేవి. దీనికి చాలా సమయం పట్టేది. ఒక్కోసారి ఉపాధి నిధులు వేరే అవసరాలకు కూడా వినియోగించినట్లు ఆరోపణలొచ్చాయి. అయితే, అలా కాకుండా కూలీల‌కు నిధులు త్వ‌ర‌గా అందేలా కేంద్రం నిర్ణ‌యం తీసుకుంది. సింగిల్ నోడల్ అకౌంట్.. స్పర్స్’ అనే కొత్త విధానం అమల్లోకి తీసుకొచ్చింది. దీని ద్వారా ఖాతాలో ఎంత డబ్బు ఉంది.? ఎంత ఖర్చు అయ్యింది? అనేది కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో పర్యవేక్షిస్తుంది. ఈ విధానంతో ఉపాధి హామీ సాఫ్ట్‌వేర్‌, కేంద్రం సీఎఫ్ఎంఎస్ (పబ్లిక్ ఫైనాన్షియల్ మేనేజ్ మెంట్ సిస్టమ్), రాష్ట్ర ఖజానా, రిజర్వ్ బ్యాంక్ (ఈ-కుబేర్) వంటి నాలుగు ఆన్లైన్ వ్యవస్థలు లింక్ అవుతాయి.

గ్రామంలో పని చేసిన‌ వెంటనే అధికారులు బిల్లులు అప్ లోడ్ చేస్తే కేంద్రం, రాష్ట్ర వాటాలు విడుద‌ల అవుతాయి. నేరుగా కూలీల అకౌంట్లలో జమ అవుతాయి. దీనివల్ల క్షేత్రస్థాయిలో కూలీలకు ఆర్థిక భద్రత పెరగడమే కాకుండా, అవినీతికి తావులేకుండా నిధులు సద్వినియోగం అవుతాయి. కొత్త విధానంతో ఉపాధి హామీ నిధులను రాష్ట్ర ప్రభుత్వం పీడీ అకౌంట్లలోకి గానీ, ఇతర అవసరాలకు గానీ మళ్లించడానికి వీలుండదు. బిల్లులు పాస్ అయిన వెంటనే ఆర్బీఐ ఈ-కుబేర్ ద్వారా నేరుగా కూలీల ఖాతాల్లో నిధులు జమకానున్నాయి. ఈ నిధులు కూడా సింగిల్ నోడల్ అకౌంట్ (ఎస్ఎన్ఏ) ద్వారానే కంట్రోల్ అవుతాయి. ఈ కొత్త విధానంలో డీఆర్డీవోలను జిల్లా నోడల్ ఆఫీసర్లుగా, కమిషనరల్ రూరల్ డెవలప్మెంట్ ను స్టేట్ నోడల్ ఆఫీసర్ గా నియమించారు.

కేంద్రం తీసుకున్న ఈ నిర్ణ‌యం వ‌ల్ల ఉపాధి హామీ కూలీల‌కు ఎంతో మేలు జ‌ర‌గ‌నుంది. దీంతో వారు ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like