మేడారం జాత‌ర‌లో త‌ప్పిన ప్ర‌మాదం

Medaram Jathara:మేడారం జాత‌రలో మునిగిపోతున్న ముగ్గురు భ‌క్తుల‌ను ఎస్‌డీఆర్‌ఎఫ్ (రాష్ట్ర విపత్తు స్పందన దళం) 5వ బెటాలియన్, తెలంగాణ ప్రత్యేక పోలీస్ పోలీస్ సిబ్బంది శుక్రవారం రక్షించారు. భూపాలపల్లికి చెందిన మేకల జంపయ్య (36), మేకల సరిత ( 14) మేకల శిరీష (13) స్నానాలు చేసేందుకు జంప‌న్న వాగులో దిగారు. అయితే, ముగ్గురు అకస్మాత్తుగా నీటిలో మునిగిపోవ‌డంతో… అక్కడ విధుల్లో ఉన్న ఎస్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది, కానిస్టేబుళ్లు రాందాస్, ప్రవీణ్, రాజశేఖర్, రవి, రాజు, హరీష్ వెంట‌నే స్పందించారు.

వాగులోకి దిగి, మునిగిపోతున్న వారిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులు ఎస్ డి ఆర్ ఎఫ్ రక్షక బృందానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ, తమ కుటుంబ సభ్యుల ప్రాణాలను కాపాడినందుకు ధన్యవాదాలు తెలిపారు. మేడారం జాతర వంటి కార్యక్రమంలో ప్రజల ప్రాణ భద్రత కోసం ఎస్‌డీఆర్‌ఎఫ్ ఎలాంటి అత్యవసర పరిస్థితుల్లోనైనా ప్రజలకు సహాయం అందించేందుకు సిద్ధంగా ఉంటుందని 5వ బెటాలియన్ కమాండెంట్ కె.సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. భక్తులను కాపాడినటువంటి సిబ్బందికి కమాండెంట్ అభినందనలు తెలిపారు.

ఈ సంద‌ర్భంగా అధికారుల‌కు భక్తులకు ప‌లు సూచనలు చేశారు. జంపన్న వాగు వద్ద జాగ్రత్తలు పాటించాలని కోరారు. లోతైన నీటిలోకి వెళ్లకుండా, అధికారుల సూచనలను తప్పనిసరిగా అనుసరించాలని విజ్ఞ‌ప్తి చేశారు.

You might also like