బ్యాంకుల దేశవ్యాప్త సమ్మె
తమ డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ బ్యాంక్ యూనియన్ల ఐక్య వేదిక దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చింది. దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకుల్లో 5 రోజుల పని విధానాన్ని వెంటనే అమలు చేయడంతో పాటు మరికొన్ని డిమాండ్లను ప్రభుత్వం ముందుంచారు. ఆదివారం జరిగిన సమావేశంలో యూనియన్ నేతలు ఈ నిర్ణయం తీసుకున్నారు.
దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న ఐదు రోజుల పనిదినాల డిమాండ్ నెరవేర్చుకునేందుకు సెప్టెంబర్ 11న దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చారు. ఆ రోజున సమ్మె జరిగితే.. బ్యాంకు కార్యకలాపాలకు వరుసగా నాలుగురోజుల పాటు అంతరాయం కలగనుంది. సెప్టెంబర్ 11న శుక్రవారం. తర్వాత రెండో శనివారం, ఆదివారం ప్రభుత్వ సెలవులు. ఇక సోమవారం 14న వినాయక చవితి కావడంతో బ్యాంకు కార్యకలాపాలు నడవవు.
అలా నాలుగురోజుల పాటు బ్యాంక్ సేవలు అందక ప్రజలు ఇబ్బందులు పడాల్సి వస్తుంది. 11వ తేదీతో పాటు సెప్టెంబర్ 28 నుంచి మూడురోజుల పాటు మరోసారి సమ్మె (Nationwide strike) చేస్తామని యూనియన్ హెచ్చరించింది. వారానికి ఐదు రోజుల పని దినాలు, పనితీరు ఆధారిత ప్రోత్సాహకాల పథకం, పింఛను విషయంలో ఉన్న సమస్యలను పరిష్కరించాలని బ్యాంక్ సిబ్బంది కోరుతున్నారు. తమ డిమాండ్లను పట్టించుకోకపోతే.. అక్టోబర్ 26 నుంచి నిరవధిక సమ్మెకు దిగుతామని ప్రకటించారు.