బంగ్లాదేశ్‌లో దారుణం… హిందూ యువ‌కుడి స‌జీవ ద‌హ‌నం

Atrocity in Bangladesh… Hindu youth burned alive:బంగ్లాదేశ్‌లో మరో హిందూ యువ‌కుడిని స‌జీవ ద‌హనం చేశారు. ఈ భ‌యంక‌ర ఘ‌ట‌న నార్సింగ్డి ప్రాంతంలో చోటుచేసుకుంది. అర్ధరాత్రి సమయంలో అల్లరిమూకలు ఓ దుకాణంపై దాడికి దిగాయి. షట్టర్‌ పూర్తిగా మూసివేసి, లోపల పెట్రోల్‌ పోసి నిప్పు అంటించారు. ఆ సమయంలో దుకాణంలోనే నిద్రిస్తున్న చంచల్‌ భౌమిక్‌ (23) అనే హిందూ యువకుడు బయటకు వచ్చే అవకాశం లేకుండా సజీవ దహనం అయ్యాడు. చంచల్‌ మృతి చెందినట్లు నిర్ధారించుకున్న తర్వాతే దుండగులు అక్కడి నుంచి పారిపోయినట్లు ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. మృతుడు చంచల్‌కు తల్లి, ఇద్దరు సోదరులు ఉన్నారు. వారిలో ఒకరు దివ్యాంగుడని కుటుంబ సభ్యులు తెలిపారు.

మైనారిటీల భద్రతపై తీవ్రమైన ఆందోళనలు..
తండ్రి చాలా ఏళ్ల క్రితమే మృతి చెందడంతో, కుటుంబ బాధ్యతలన్నీ చంచల్‌పైనే ఉన్నాయి. కుటుంబ పోషణ కోసం అతడు నార్సింగ్డి ప్రాంతంలోని ఓ గ్యారేజీలో ఆరేళ్లుగా పనిచేస్తూ, అదే దుకాణంలో నివసిస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ హత్య పథకం ప్రకారమే జరిగిందని చంచల్‌ కుటుంబ సభ్యులు, అతడి యజమాని ఆరోపిస్తున్నారు. ఇది యాదృచ్ఛిక ఘటన కాదని, ఉద్దేశపూర్వకంగానే దుకాణాన్ని లక్ష్యంగా చేసుకుని దాడి చేశారని పేర్కొన్నారు. గతంలో కూడా బంగ్లాదేశ్‌లో దీపు చంద్రదాస్‌, ఖోకొన్‌ చంద్రదాస్‌ అనే వ్యక్తులను ఇదే తరహాలో అల్లరిమూకలు సజీవ దహనం చేసిన ఘటనలు చోటుచేసుకున్నాయని గుర్తు చేస్తున్నారు. ఈ తాజా ఘటనతో బంగ్లాదేశ్‌లో మైనారిటీల భద్రతపై మళ్లీ తీవ్రమైన ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

మైనారిటీలనే లక్ష్యంగా చేసుకుని..
బంగ్లాదేశ్‌లో గత కొన్ని నెలలుగా మైనారిటీలనే లక్ష్యంగా చేసుకుని అల్లరి మూకలు దాడులకు తెగిస్తున్నాయి. గత డిసెంబర్‌లో దీపు చంద్ర దాస్ అనే వ్యక్తిని కొట్టి చంపిన అల్లరి మూకలు, ఆ తర్వాత అతని మృతదేహానికి నిప్పంటించారు. గత వారం కూడా లిటన్ చంద్ర దాస్ అనే వ్యాపారి మూకదాడిలో మరణించగా, తాజాగా చంచల్ మృతి ఈ ఆందోళనలను మరింత పెంచింది. ఈ దారుణాన్ని స్థానిక హిందూ నాయకులు తీవ్రంగా ఖండించారు. నిందితులను వెంటనే గుర్తించి కఠినంగా శిక్షించాలని, మైనారిటీలకు రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు సీసీటీవీ ఫుటేజీని సేకరించి దర్యాప్తు ప్రారంభించారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like