దిగుమతులు తగ్గిస్తాం… సింగరేణికి ప్రాధాన్యమిస్తాం..
-ప్రస్తుతం సింగరేణి పరిస్థితి బాగోలేదు
-లక్షలాది కుటుంబాలకు ఉపాధి కల్పిస్తున్న సింగరేణిని కాపాడుకోవాలి
-సింగరేణిలో దుబారా ఖర్చు తగ్గించాలి
-ఢిల్లీ బోర్డు మీటింగ్ లో చర్చించుకోవడం కాదు, కార్మికులకు ప్రతి విషయం తెలియాలి
-సింగరేణి కార్మికులతో కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ముఖాముఖి
Singareni:విదేశాల నుంచి బొగ్గు దిగుమతి తగ్గించి… సింగరేణి బొగ్గుకు ప్రాధాన్యం ఇస్తామని కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి(Union Minister for Coal, Kishan Reddy) తెలిపారు. ఆదివారం ఆయన కొత్తగూడెం(Kothagudem)లోని పద్మావతి ఖని 5-ఇంక్లయిన్ (Padmavati 5-incline) పర్యటించారు. ఈ సందర్భంగా కార్మికులతో మాట్లాడి వారి సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన కార్మికుల ముఖాముఖిలో మాట్లాడారు. విదేశాల నుంచి బొగ్గు దిగుమతిని తగ్గిస్తామని చెప్పారు. గతేడాది రూ.60 వేల కోట్ల దిగుమతుల్ని తగ్గించామని, ఈ ఏడాది కూడా బొగ్గు దిగుమతుల్ని తగ్గించి, సింగరేణి బొగ్గుగు ప్రాధాన్యమిస్తామని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.
సింగరేణిలో దుబారా ఖర్చులు పెరుగుతున్నాయని, వాటిని తగ్గించుకోవాలని ఆయన స్పష్టం చేశ ఆరు. ఢిల్లీ బోర్డు మీటింగుల్లో సింగరేణిపై తీసుకునే ప్రతీ నిర్ణయం, చర్చించిన విషయాలన్నీ కార్మికులకు తెలియాలని స్పష్టం చేశారు. లక్షలాది కుటుంబాలకు ఉపాధిని ఇస్తోన్న సింగరేణిని కాపాడుకోవాలని… ఇందుకు కేంద్ర నుంచి వీలైనంత సహాయ సహకారాలను అందిస్తామన్నారు. ప్రస్తుతం సింగరేణి పరిస్థితి బాగాలేదని, దానిని సరైన గాడిలో పెడతామని భరోసా ఇచ్చారు. నాణ్యమైన ఉత్పత్తిని పెంచాలని, అందుకు అవసరమయ్యే కార్యాచరణ మరింత మెరుగుపరుచుకోవాలని సూచించారు. సంస్థ బాగుంటే కార్మిక సంఘాలు, నాయకత్వం బాగుంటుందని హితవు పలికారు.
సింగరేణి ఉద్యోగులు, కార్మికులతో జరిగిన ఈ ఆత్మీయ సమ్మేళనంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డితో పాటు సింగరేణి చైర్మన్ & ఎండీ కృష్ణభాస్కర్, కేంద్ర బొగ్గుగనుల మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి రూపేందర్, బీఎంఎస్ అధ్యక్షుడు యాదగిరి సత్తయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ అప్పని శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి యతిపతి సారంగపాణి, కోశాధికారి హరిన్ పాల్గొన్నారు.