ఏ పోరాటానికైనా సిద్ధం
ప్రభుత్వ విప్ బాల్క సుమన్
మంచిర్యాల – సింగరేణి కార్మికుల కోసం ఎంత దూరమైనా వెళ్తామని వారి కోసం పోరాటం చేస్తామని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ స్పష్టం చేశారు. సింగరేణి బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికులు ఇచ్చిన బంద్ పిలుపు మేరకు మందమర్రి KK 1 గనిపై తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధర్నా కార్యక్రమానికి హాజరై సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు వ్యతిరేకంగా కక్ష సాధింపు చర్యలకు దిగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. బిజెపి పాలిత ప్రాంతాల్లో కోల్ ఇండియా, గుజరాత్ బ్లాకులను వేలం వేయకుండా తెలంగాణ బొగ్గు బ్లాకులను మాత్రమే వేలం వేయడం దుర్మార్గమైన చర్య అని మండిపడ్డారు. మోడీ, అమిత్ షా తెలంగాణ అంధకారంలో నెట్టివేయడానికి కుట్ర చేస్తున్నారని అన్నారు. అందులో భాగంగా జెన్కో, సింగరేణి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న విద్యుత్ సంస్థలకు బొగ్గు సరఫరా కాకుండా కుట్ర చేస్తున్నారని దుయ్యబట్టారు. స్వయంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేంద్రానికి లేఖ రాసినా, TRS ఎంపీలు, కార్మికులు పోరాటం చేసిన కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. తెలంగాణ పచ్చబడుతుంటే మోడీ అమిత్ షా కళ్ళు ఎర్రబడుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణకు రావలసిన న్యాయమైన డిమాండ్లు, హక్కులను మోడీ అమిత్ షా కాలరాస్తున్నారని అన్నారు. ఏడేళ్లలో ఇంతవరకూ తెలంగాణలో ఏ ఒక్క ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించడం లేదన్నారు. రైతు, కార్మిక, వ్యవసాయానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న బీజేపీ ప్రభుత్వ భరతం పట్టాలని పిలుపునిచ్చారు. 750 మంది రైతులను పొట్టన పెట్టుకుని రైతు వ్యతిరేఖ నల్ల చట్టాలను మోడీ ప్రభుత్వం వెనక్కి తీసుకుందని అన్నారు. ఏడేళ్లుగా సింగరేణి కార్మికులకు ఆదాయ పన్ను మినహాయింపు ఇవ్వాలని పోరాటం చేసినా కేంద్రం పెడచెవిన పెట్టిందని దుయ్యబట్టారు. బీజేపీ ఎంపీలు, కేంద్ర మంత్రి తెలంగాణ బొగ్గు బ్లాకుల వేలానికి వ్యతిరేకంగా మాట్లాడకపోవడం వారి చేత కాని తనానికి నిదర్శనమన్నారు. తెలంగాణ ప్రజలు, కార్మికులు ఢిల్లీకి బానిసలు కారు. గుజరాతీలకు గులాం చేయరని అన్నారు. అవసరమైతే కెసిఆర్ నాయకత్వంలో, నాటి ఉద్యమస్ఫూర్తితో కార్మికుల పక్షాన ఎంతటి పోరాటానికైనా సిద్ధమన్నారు. అవసరమైతే ఢిల్లీలో పోరాటం చేస్తాం. టీబీజీకేఎస్ తీసుకున్న సాహసోపేతమైన బందు నిర్ణయాన్ని సమర్థిస్తున్నామని స్పష్టం చేశారు. కేంద్రం కార్మిక వ్యతిరేక నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే కార్మికుల తరపున పోరాటాన్ని ఉధృతం చేస్తామని మరోసారి హెచ్చరించారు. కార్యక్రమంలో టీబీజీకేఎస్ నేతలు కెంగర్ల మల్లయ్య, ఏరియా ఉపాధ్యక్షుడు మేడిపల్లి సంపత్, జే.రవీందర్, బడికెల సంపత్‌కుమార్, శంకర్ రావు, కొండల్ రావు, యుగంధర్, మాధవరెడ్డి, రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.