అడ‌విలో అద్భుతం..

Medaram 2026: అడ‌విలో అద్భుత ఘ‌ట్టం ఆవిష్కృత‌మైంది.. మేడారం జ‌నార‌ణ్యమైంది.. అమ్మ‌లొచ్చే వేళ ఆనంద‌ప‌ర‌వ‌శంగా మారింది… నేటి నుంచి నాలుగు రోజుల పాటు భ‌క్తితో ఊగితూగ‌నుంది.. కోట్లాది మంది భక్తుల కొంగు బంగారాలైన సమ్మక్క, సారలమ్మ తల్లులు దర్శనం ఇచ్చే సమయం ఆసన్నమైంది. రెండేళ్లకోసారి జరిగే ఈ మహాజాతరలో కోట్లాది భక్తులు సమ్మక్క, సారలమ్మ తల్లులను దర్శించేందుకు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

ఆదివాసీ పూజారులు, డప్పు శబ్దాలు, డోలు వాద్యాల నడుమ సారలమ్మ, పగిడిద్ద రాజు, గోవిందరాజులు ఇవాళ సాయంత్రం గద్దెలపైకి రానున్నారు. మహబూబాబాద్‌ జిల్లా గంగారం మండలం పూనుగుండ్ల నుంచి బయలుదేరిన పగిడిద్దరాజు మంగళవారం రాత్రి గోవిందరావుపేట మండలం లక్ష్మీపురంలో బస చేశారు. అక్కడి నుంచి కాలినడకన ఇవాళ్టి రాత్రికి జంపన్నవాగుకు చేరుకుంటారు. ఇదే సమయంలో కన్నెపల్లి నుంచి సారలమ్మ, ఏటూరునాగారం మండలం కొండాయ్ నుంచి గోవిందరాజు సైతం జంపన్నవాగు వద్దకు చేరుకుంటారు. భక్తుల జయధ్వానాల మధ్య గద్దెలపైకి చేరుకుంటారు.

సమ్మక్క ఆగమనం – ప్రధాన ఘట్టం
జాతరలో అత్యంత ముఖ్య ఘట్టం సమ్మక్క ఆగమనం. ఈ వనదేవతను గురువారం కొక్కెర కృష్ణయ్య నేతృత్వంలో మేడారం సమీప చిలుకల గుట్ట నుండి తీసుకురాబడుతుంది. కుంకుమభరిణ రూపంలోని సమ్మక్కను తీసుకొస్తున్న సమయంలో ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ గౌరవార్థక కాల్పులు చేస్తారు. అనంతరం సమ్మక్కను గద్దెలపై ప్రతిష్టిస్తారు. శుక్రవారం భక్తులు దర్శనం చేసుకుని బంగారాలను సమర్పిస్తారు. శనివారం దేవతల వనప్రవేశంతో జాతర ముగుస్తుంది.

మేడారం మహాజాతరలో కీలకమైన నాలుగు రోజులు లక్షలాదిగా భక్తులు తరలిరానుండగా… వారికి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం జారతను 8 జోన్లు, 42 సెక్టర్లుగా విభజించి విస్తృతంగా ఏర్పాట్లు చేసింది. 21 శాఖలకు చెందిన 42,027 మందికి పైగా ఉద్యోగులు, సిబ్బందిని మేడారం విధుల్లో మోహరించింది. మేడారం జాతర ముగిసేవరకు ఎలాంటి శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. జాతరలో 13వేల మంది పోలీసు సిబ్బంది విధులు నిర్వర్తించనున్నారు. అలాగే భక్తుల రద్దీ నేపథ్యంలో ఆర్టీసీ రాష్ట్రంలోని 51 పాయింట్ల నుంచి 4 వేల ప్రత్యేక బస్సులను మేడారంకు నడపనుంది. మొత్తంగా 20 లక్షల మంది భక్తులను సురక్షితంగా జాతరకు చేర్చేందుకు ఆర్టీసీ ప్రణాళికలను రచించింది.

ఏఐ సాంకేతికతతో ఆధునిక మేడారం
ఈ సంవత్సరం మేడారం జాతరలో ఏఐ సాంకేతికతను వినియోగించి భక్తులకు అనేక సౌకర్యాలను అందించారు. తప్పిపోయిన చిన్నారులను గుర్తించడం, రహదారులు, భవనాలు, విద్యుత్, నీటిపారుదల, గిరిజన సంక్షేమం, దేవాదాయ, ఆర్టీసీ, పోలీస్, వైద్య, అగ్నిమాపక తదితర 21 శాఖల సమన్వయంతో ఏర్పాట్లు పూర్తయ్యాయి.

Get real time updates directly on you device, subscribe now.

You might also like