వాళ్ల‌కి టిక్కెట్లు లేవు..

Congress:బెల్లంప‌ల్లి రాజ‌కీయం ర‌స‌వ‌త్త‌రంగా మారుతోంది. మ‌రీ ముఖ్యంగా అధికార కాంగ్రెస్ పార్టీలో రోజుకో ర‌కంగా మ‌లుపులు తిరుగుతోంది. మున్సిప‌ల్ ఎన్నిక‌ల వేళ పార్టీలో ఈ ప‌రిణామాలు ఆందోళ‌న క‌లిగిస్తున్నాయి. బెల్లంప‌ల్లి ఎమ్మెల్యే వినోద్ అనుస‌రిస్తున్న క‌ఠిన వైఖ‌రి కాంగ్రెస్‌లోనే ఒక వ‌ర్గానికి మింగుడు ప‌డ‌టం లేదు. తాము టిక్కెట్లు తెచ్చుకుని మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో హ‌వా కొన‌సాగిద్దామ‌నుకుంటే దానికి ఎమ్మెల్యే చెక్ పెడుతున్నారు… ఇంత‌కీ ఎమ్మెల్యే మ‌దిలో ఏముంది..? ఎందుకు ఆయ‌న క‌ఠిన వైఖ‌రి అవ‌లంబిస్తున్నారు…? ‘నాంది న్యూస్’ ప్ర‌త్యేక క‌థ‌నం…

మున్సిప‌ల్ ఎన్నిక‌ల నేప‌థ్యంలో బెల్లంప‌ల్లి రాజ‌కీయాల్లో అనూహ్య ప‌రిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కాంగ్రెస్ పార్టీలో ఎవ‌రూ ఊహించ‌ని విధంగా టిక్కెట్ల కేటాయింపు జ‌రుగుతోంది. ఇప్ప‌టికే దీనిపై పూర్తి స్థాయిలో క‌స‌ర‌త్తు చేసిన ఎమ్మెల్యే గ‌డ్డం వినోద్ టిక్కెట్ల కేటాయింపు విష‌యంలో పూర్తి క్లారిటీతో ఉన్నారు. పార్టీ జెండా మోసిన వారు, ఎమ్మెల్యే ఎన్నిక‌ల్లో త‌న వెంట న‌డిచిన వారు, త‌న వ‌ర్గం వారు, ఎన్నిక‌ల వ‌ర‌కు బీఆర్ఎస్‌, బీజేపీలో ఉండి పార్టీ మారిన ఇలా అన్ని ర‌కాలైన అంశాల‌ను ప‌రిగ‌ణిలోకి తీసుకుని టిక్కెట్ల కేటాయింపు చేసేందుకు రంగం సిద్ధం చేశారు. వారికే బీఫాంలు ఇచ్చేందుకు ఆయ‌న అన్ని ర‌కాలుగా సిద్ధ‌మ‌య్యారు..

మాకు టిక్కెట్లు కావాలి…
అయితే, త‌మ‌కు కూడా టిక్కెట్లు ఇవ్వాల‌ని మంత్రి వివేక్‌, ఎంపీ వంశీకృష్ణ వ‌ర్గం ఆయ‌న మీద ఒత్తిడి తెస్తోంది. త‌మ‌కు ఐదు నుంచి ఏడు టిక్కెట్లు అడుగుతున్నారు. బెల్లంప‌ల్లిలో మునిమంద ర‌మేష్ ఎంపీ, మంత్రి వివేక్ వ‌ర్గానికి ముఖ్య అనుచ‌రుడుగా కొన‌సాగుతున్నాడు. వివేక్ ఏ పార్టీలో ఉంటే ఆయ‌న ఆ పార్టీలోకి వెళ‌తాడు. ఆయ‌న త‌న వారికి టిక్కెట్లు కావాల‌ని ప‌ట్టుప‌డుతున్నాడు. ఇక, చిట్యాల మ‌ధు, భూపెళ్లి రాజేశ్వ‌ర్‌, దూడ‌పాక బ‌ల‌రాం, కుప్పు స్వామి వీరంతా వివేక్ వ‌ర్గంగా కొన‌సాగుతున్నారు. వారు కూడా త‌మ‌కు టిక్కెట్లు కావాల‌ని ఎమ్మెల్యేపై ఒత్తిడి తెస్తున్నారు.

వివేక్ వ‌ర్గం ఆలోచ‌న ఏంటంటే…
కాంగ్రెస్ పార్టీ నుంచి టిక్కెట్లు సంపాదిస్తే తాము చైర్మ‌న్ రేసులో ఉండి చ‌క్రం తిప్ప‌వ‌చ్చ‌ని వివేక్ వ‌ర్గం ఆలోచ‌న‌గా క‌నిపిస్తోంది. క‌నీసం వైస్ చైర్మ‌న్‌గా అయినా తాము ఉండ‌వ‌చ్చని భావిస్తున్నారు. ఎమ్మెల్యే వినోద్ అటు మంత్రి వివేక్‌ను కానీ, ఇటు ఎంపీ వంశీని కానీ, బెల్లంప‌ల్లిలో అడుగుపెట్ట‌నీయ‌డం లేదు. తాము గెలిచి వారిద్ద‌రినీ బెల్లంప‌ల్లికి తీసుకురావొచ్చ‌ని వివేక్ వ‌ర్గం ప్లాన్ చేస్తోంది. ఎట్ట ప‌రిస్థితుల్లో త‌మ‌కు టిక్కెట్లు వ‌చ్చేలా కృషి చేయాలని ఆ వ‌ర్గం నేత‌లంతా విప‌రీతంగా ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.

ఎమ్మెల్యే ఏం చేస్తున్నారంటే…
ఇక బెల్లంప‌ల్లి ఎమ్మెల్యే గ‌డ్డం వినోద్ ఆలోచ‌న వేరేలా ఉంది. ఎంపీ, మంత్రి వ‌ర్గానికి టిక్కెట్లు ఇస్తే వారి వ‌ర్గం భావిస్తున్నారు. వీళ్లు ఐదుగురు గెలిస్తే నిర్ణ‌యం వాళ్లే తీసుకునేలా చ‌క్రం తిప్పుతార‌ని చెబుతున్నారు. ఎమ్మెల్యే త‌ర‌చూ ఒక మాట చెబుతుంటారు.. వాళ్ల బాస్ ఎప్పటికీ చిన్న‌బాబు(మంత్రి వివేక్)ను కానీ, ఎంపీ సాబ్(వంశీకృష్ణ‌)ను కానీ వాళ్ల బాస్‌గా చూసుకుంటారు త‌ప్ప… న‌న్ను బాస్‌గా ఎప్ప‌టికీ చూడ‌రు… అని ఆయ‌న ఇప్పుడు కూడా అదే ఆలోచ‌న‌తో సాగుతున్నారు. ఒక‌వేళ వారికి టిక్కెట్టు ఇచ్చే త‌న వ‌ర్గాన్ని పెంచి పోషించుకోవాల‌ని ఎమ్మెల్యే భావిస్తున్నారు.

వాళ్ల‌కి టిక్కెట్లు ఇవ్వ‌ను..
ఎమ్మెల్యే వినోద్ కేవ‌లం మ‌న‌సులో మాట‌నే కాదు… ఇదే విష‌యాన్ని మంత్రి వివేక్‌తో సైతం ఖ‌రాఖండిగా ఇదే అంశాన్ని కుండ‌బ‌ద్ద‌లు కొట్టారు. మంత్రి వివేక్‌, వినోద్ మ‌ధ్య హైద‌రాబాద్‌లో సుదీర్ఘంగా చ‌ర్చ‌లు సాగాయి… నేను ఏ కార్యక్ర‌మం నిర్వ‌హించినా వాళ్లు నా ద‌గ్గ‌ర‌కు రారు.. వాళ్ల‌కు టిక్కెట్లు ఇచ్చేది లేదంటూ తేల్చి చెప్పిన‌ట్లు స‌మాచారం. నా మంత్రి ప‌ద‌వి పోయింది… నాకంటూ గుర్తింపు లేకుండా పోయింది… క‌నీసం బెల్లంప‌ల్లిలో త‌న ఉనికిని కాపాడుకోవాల‌ని వినోద్ భావిస్తున్నారు. ఈ నేప‌థ్యంలోనే త‌న నియోజ‌క‌వ‌ర్గంలో త‌మ్ముడు వివేక్‌, ఆయ‌న కొడుకు వంశీకృష్ణ వేలు పెట్ట‌వ‌ద్ద‌నేది ఆయ‌న ఆలోచ‌నగా చెబుతున్నారు.

ఈ నేప‌థ్యంలోనే మున్సిప‌ల్ ఎన్నిక‌లు ర‌స‌వ‌త్త‌రంగా మారాయి… సొంత పార్టీలోనే చుక్కెదురు కావ‌డంతో కాంగ్రెస్‌లోని మంత్రి, ఎంపీ వ‌ర్గం చేయాలో అర్థం కాని ప‌రిస్థితిలో ఉన్నారు. టిక్కెట్ల కేటాయింపు విష‌యంలో ఎమ్మెల్యే అనుస‌రిస్తున్న క‌ఠిన వైఖ‌రితో వారు ఆందోళ‌న‌తో ఉన్నారు… చూడాలి మ‌రి రాజ‌కీయం ఇంకా ఎన్ని మ‌లుపులు తిరుగుతుందో…

Get real time updates directly on you device, subscribe now.

You might also like