భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
Gold Rate today: కొద్దిరోజులుగా ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్న పసిడి ధరలకు ఒక్కసారిగా బ్రేక్ పడింది. చరిత్రలో కనీవిని ఎరగని స్థాయిలో బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా భారీగా పతనం అయ్యాయి. ఇటీవల అంతర్జాతీయంగా ఉద్రిక్తతల నేపథ్యంలో బంగారం, వెండి రేట్లు అదే పనిగా దూసుకెళ్తూ ఆల్ టైమ్ గరిష్ఠ స్థాయిల్ని తాకిన సంగతి తెలిసిందే. అటు బంగారం, ఇటు వెండి ధరలు రికార్డు స్థాయిలో పడిపోయాయి. గత 11 ఏళ్లలో ఎప్పుడూ లేని విధంగా కేవలం ఒక్క రోజులోనే ధరలు కుప్పకూలడం బులియన్ మార్కెట్‌లో సంచలనంగా మారింది.
రెండు రోజులుగా బంగారం, వెండి ధరలు భారీ స్థాయిలో పతనం అవుతున్నాయి. ఈ క్రమంలో గురువారం రాత్రి మొదలైన పతనం.. శనివారం ఉదయం వరకు కొనసాగింది. అంతర్జాతీయ మార్కెట్లో ఆల్ టైమ్ హై నుంచి బంగారం ధర 15 శాతం, వెండి రికార్డు స్థాయిలో 30 శాతం వరకు పతనం కావడంతో.. దేశీయంగా కూడా అదే స్థాయిలో దిగొస్తున్నాయి. ఇప్పటివరకు ఒక్కరోజులో బంగారం, వెండి ధరలు ఈ స్థాయిలో పతనం అయినట్లు చరిత్రలోనే లేదు. ఇవాళ ఒక్కరోజే హైదరాబాద్ మార్కెట్లో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 8 వేలకుపైగా.. 24 క్యారెట్స్ గోల్డ్ రేటు రూ. 9 వేలకుపైగా దిగొచ్చింది. వెండి మరింత భారీగా తగ్గింది.
ఒకవైపు యూఎస్ డాలర్ పుంజుకోవడం సహా ఇదే సమయంలో గరిష్ఠ స్థాయిల వద్ద ఇన్వెస్టర్లు ప్రాఫిట్ బుకింగ్‌కు దిగడం.. తీవ్ర ఒత్తిడి సృష్టించింది. ఈ క్రమంలోనే.. బంగారం, వెండి రేట్లు భారీ స్థాయిలో కుదేలయ్యాయి. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,59,867 (దాదాపు 20 వేల వరకు తగ్గింది). కిలో వెండి: రూ. 2,85,156 (రెండు రోజుల్లోనే లక్ష రూపాయల వరకు తగ్గింది). గత 11 ఏళ్ల చరిత్రలో ఒక్కరోజులో ఇంతలా రేట్లు పడిపోవడం ఇదే మొదటిసారి కావడం విశేషం. ఇంటర్నేషనల్ మార్కెట్లో స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు కిందటి రోజు ఉదయం 5,250 డాలర్ల స్థాయిలో ఉండగా.. ప్రస్తుతం అది 4,885 డాలర్ల స్థాయికి పడిపోయింది. ఈ క్రమంలో దాదాపు 8 శాతం పతనంతో.. 350-400 డాలర్ల వరకు ఒక్కరోజులోనే దిగొచ్చిందని చెప్పొచ్చు. అంతకుముందు ఇది గురువారం సాయంత్రం (జనవరి 29) 5600 డాలర్ల స్థాయి నుంచి 5100 డాలర్లకు పడిపోయి.. మళ్లీ 5,250 డాలర్ల మార్కుకు చేరింది.
ఇంటర్నేషనల్ మార్కెట్ ధరలకు అనుగుణంగా దేశీయంగా ఇంకా పూర్తి స్థాయిలో ధరలు దిగిరాలేదు. శనివారం (జనవరి 31) ఉదయం ఈ స్థాయిలో ధరలు దిగొస్తాయని చెప్పొచ్చు. ప్రస్తుతానికి చూస్తే దేశీయంగా బంగారం ధర హైదరాబాద్ నగరంలో 22 క్యారెట్లపై ఒక్కరోజులో రూ. 8850 తగ్గడంతో తులం రూ. 1,55,100 కు చేరింది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 9,650 తగ్గడంతో 10 గ్రాములకు ఇప్పుడు రూ. 1,69,200 వద్ద కొనసాగుతోంది. ఇక వెండి ధర ఇవాళ రూ. 20 వేలు తగ్గడంతో ప్రస్తుతం కిలోకు రూ. 4.05 లక్షల వద్ద ఉంది. వాస్తవానికి వెండి ధర జనవరి 30న ఒక్కరోజులోనే రూ. 60 వేలకుపైగా తగ్గినట్లు తెలుస్తోంది. ఇది ఉదయం 10 గంటల తర్వాత మనకు దేశీయంగా కనిపిస్తుందని చెప్పొచ్చు.
మార్కెట్ విశ్లేషకుల ప్రకారం.. రానున్న రోజుల్లో బంగారం ధరలు ఇంకా తగ్గే అవకాశం ఉందని సమాచారం. పెళ్లిళ్ల సీజన్ సమీపిస్తున్న వేళ ధరలు ఇలా ఒక్కసారిగా దిగిరావడం కొనుగోలుదారులకు పెద్ద ఊరటనిస్తోంది.