మున్సిపల్ ఎన్నికలపై సీఎం మీటింగ్
CM Revanth Reddy:తెలంగాణ మున్సిపల్ ఎన్నికలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అమెరికా నుంచి జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఈ సమావేశంలో టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, ఇన్ఛార్జ్ మీనాక్షి సహా పలువురు మంత్రులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ 90 శాతం స్థానాలను కైవసం చేసుకోవాలని రేవంత్ రెడ్డి దిశా నిర్దేశం చేశారు. రెబెల్స్ లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సూచించారు. ఈ సందర్భంగా మున్సిపల్ ఎన్నికల సర్వే నివేదికలను టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సీఎంకు వివరించారు.
తెలంగాణలో 7 మున్సిపల్ కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 2,996 వార్డులకు పోటీ జరగనుంది. ఈనెల 28 నుంచి ప్రారంభమైన నామినేషన్ల ప్రక్రియ శుక్రవారంతో(జనవరి 30) ముగిసింది. శనివారం నామినేషన్ల పరిశీలన జరుగనుంది. ఫిబ్రవరి మూడున నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ. ఫిబ్రవరి 11న పోలింగ్ జరగనుంది. ఆ రోజు ఉదయం 7:00 గంటల నుంచి సాయంత్రం 5:00 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. ఫిబ్రవరి 13న ఫలితాలు వెలువడనున్నాయి.
ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి.. ఫిబ్రవరి 1న హైదరాబాద్కు రానున్నారు. ఆయన వచ్చాక పార్టీ ముఖ్య నేతలతో కీలక సమావేశం నిర్వహించి మున్సిపల్ ఎన్నికలు, ప్రస్తుత రాజకీయ పరిణామాలపై చర్చించనున్నట్లు సమాచారం. ఫిబ్రవరి 3 నుంచి విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించనున్న సీఎం.. పలు జిల్లాల్లో నిర్వహించే ప్రచార సభల్లో పాల్గొననున్నారు. ఫిబ్రవరి 3న నల్గొండ జిల్లా మిర్యాల గూడ, 4న కరీంనగర్ జిల్లా జగిత్యాల, 5న రంగారెడ్డి జిల్లా చేవెళ్ల, 6న భూపాలపల్లి, 7న మెదక్, 8న నిజామాబాద్లో సీఎం రేవంత్ పర్యటిస్తారు.