అష్ట‌దిగ్భందం

Minister Vivek:వాస్త‌వానికి అధికార పార్టీ అన‌గానే ఎన్నో సౌక‌ర్యాలు అందుబాటులో ఉంటాయి. అధికారం వారిదే కావ‌డం, స‌హ‌జంగానే ఆర్థిక వ‌నరులు అందుబాటులో ఉండ‌టం, అధికారులు సైతం వారి మాటే విన‌డం… ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో… దీంతో అధికార ప‌క్షంతో ఢీకొట్టాలంటే స‌హ‌జంగానే ప్ర‌తిప‌క్షం కాస్తా వెన‌క‌డుగు వేస్తూ ఉంటుంది… కానీ, ఇక్క‌డ మాత్రం ప్ర‌తిప‌క్షం ఉత్సాహంతో ముందుకు వెళ్తుంటే అధికార ప‌క్షం వెన‌క‌డుగు వేస్తోంది… అది కూడా సాక్షాత్తూ ఓ మంత్రి నియోజ‌క‌వ‌ర్గంలో…. ఇంత‌కీ ఏంటా నియోజ‌క‌వ‌ర్గం…? ఆ మంత్రి ఎవ‌రు..? ఎందుకు వెన‌క్కి వెళ్తున్నారు..?

అది ఓ మంత్రి నియోజ‌క‌వ‌ర్గం… అంటే అన్ని ర‌కాలుగా అధికార పార్టీకి ఎంతో కొంత ప‌ట్టు ఉంటుంది… కానీ, ఆ ప‌ట్టు జారిపోతోంది… ఆ పార్టీ నుంచి ముఖ్య నేత‌లు బ‌య‌ట‌కు వెళ్తున్నారు. సొంత పార్టీలోనే గొడ‌వ‌లు కామ‌న్ అయ్యాయి. ఇదంతా ఒక్కెత్తు కాగా, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీతో సీపీఐ పొత్తు కొన‌సాగుతుండ‌గా, ఈ నియోజ‌క‌వ‌ర్గంలో మాత్రం అందుకు విరుద్ధంగా బీఆర్ఎస్ పార్టీతో క‌లిసి న‌డుస్తామ‌ని ప్ర‌క‌టించింది. దీంతో కాంగ్రెస్ శ్రేణులు అయోమ‌యంలో ప‌డుతున్నాయి. ఒక‌ర‌కంగా ఇక్క‌డ ఆ పార్టీ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు ఆత్మ‌ర‌క్ష‌ణ ధోర‌ణిలో ముందుకు వెళ్తున్నారంటే ప‌రిస్థితి అర్థం చేసుకోవ‌చ్చు.

కాంగ్రెస్ పార్టీకి మూల రాజిరెడ్డి గుడ్‌బై ..
మున్సిపల్ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌కు పెద్ద దెబ్బ త‌గిలింది. చెన్నూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన ముఖ్య‌ నాయకుడు, జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్‌పర్సన్ మూల రాజిరెడ్డి పార్టీకి రాజీనామా చేసి BRSలో చేరారు. అసెంబ్లీ ఎన్నిక‌ల్లో మంత్రి జి. వివేక్ విజయంలో మూల రాజిరెడ్డి కీలక పాత్ర పోషించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత తనను పక్కన పెట్టినందుకు వివేక్ పట్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. వాస్త‌వానికి ఆయ‌న‌తో మాట్లాడి అసంతృప్తి చ‌ల్లారాల్సిన మంత్రి పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు. అంతేకాకుండా, త‌న‌ను కాద‌ని కొత్తగా చేరిన నాయకులకు ప్రాముఖ్యత ఇవ్వడం, తనకు గుర్తింపు ఇవ్వకపోవడం పట్ల మూల రాజిరెడ్డి అలిగి బీఆర్ఎస్ గూటికి చేరారు.

సీపీఐతో పొత్తుతో కాంగ్రెస్‌కు చెక్‌..
బీఆర్ఎస్ పార్టీ మంచిర్యాల జిల్లా అధ్య‌క్షుడు, చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమ‌న్ మ‌రో ఎత్తుగ‌డ వేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీతో ముందుకు సాగుతున్న సీపీఐని త‌మ‌వైపు తిప్పుకున్నారు. క్యాత‌న్‌ప‌ల్లి మున్సిపాలిటీలో ఈ రెండు పార్టీలు క‌లిసి పోటీ చేయ‌నున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా సీపీఐకి కాంగ్రెస్‌తో పొత్తు ఉన్నప్పటికీ, స్థానిక పరిస్థితులు “మిత్రధర్మం” సరిగా లేని చోట్ల సెక్యులర్ పార్టీలతో కలిసి వెళ్తామని సీపీఐ నాయకులు ఇప్పటికే ప్రకటించారు. ఈ నేప‌థ్యంలోనే క్యాతన్‌పల్లిలో కాంగ్రెస్‌ను ఢీకొట్టేందుకు బీఆర్ఎస్, సీపీఐ చేతులు కలిపాయి. అదే స‌మ‌యంలో మంత్రి వివేక్ వారిని బీఆర్ఎస్ వైపు వెళ్ల‌కుండా క‌ట్ట‌డి చేయ‌డంలో విఫ‌ల‌మ‌య్యార‌ని సొంత పార్టీ నేత‌లే ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

మంత్రి వైఫ‌ల్యాల‌పై విస్తృత ప్ర‌చారం..
చెన్నూరు నియోజ‌క‌వ‌ర్గంలో మంత్రి వివేక్ వైఫ‌ల్యాల‌పై అటు సోష‌ల్ మీడియా, ఇటు క‌ర‌ప‌త్రాల ద్వారా బీఆర్ఎస్ నాయ‌కులు దుమ్మెత్తిపోస్తున్నారు. చెన్నూరు క‌న్నీరు పేరిట నియోజ‌క‌వ‌ర్గం మొత్తం క‌ర‌ప‌త్రాలు పంపిణీ చేశారు. గోదావ‌రి క‌ర‌క‌ట్ట‌ల నిర్మాణం, చెన్నూరు బ‌స్ డిపో నిర్మాణం ఇలా పెద్ద ఎత్తున స‌మ‌స్య‌ల‌పై ప్ర‌జ‌ల్లో చైత‌న్యం ర‌గిలిస్తున్నారు. బీఆర్ఎస్ శ్రేణులు నిత్యం ప్ర‌జ‌ల్లో ఉంటూ మంత్రి వైఫ‌ల్యాల‌పై ఎండ‌గ‌డుతున్నారు. అదే స‌మ‌యంలో, ఆ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్ర‌తిప‌క్షాల‌ను ఎదుర్కోవ‌డంలో పూర్తి స్థాయిలో వైఫ‌ల్యం చెందుతున్నార‌ని ప‌లువురు చెబుతున్నారు.

స్థానికంగా లేక‌పోవ‌డం కూడా కార‌ణమే..
మంత్రి వివేక్ స్థానికంగా లేక‌పోవడం కూడా కాంగ్రెస్ శ్రేణుల నైరాశ్యానికి కార‌ణంగా క‌నిపిస్తోంది. అదే స‌మ‌యంలో ఎమ్మెల్యేగా బాల్క సుమ‌న్ చేసినంత అభివృద్ధి కూడా మంత్రిగా వివేక్ చేయ‌డం లేద‌ని సొంత పార్టీలో వినిపిస్తున్నాయి. ఇక, మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడు పిన్నింటి ర‌ఘునాథ్ రెడ్డి సైతం జిల్లాలో పార్టీని ప‌ట్టించుకోకుండా కేవ‌లం క్యాత‌న్‌ప‌ల్లికి మాత్ర‌మే ప‌రిమితం అవుతున్నారు. అది కూడా పార్టీ శ్రేణుల్లో నైరాశ్యం నింపుతోంది. ఇప్పుడు సింగరేణి ప్రాంతమైన క్యాతన్‌పల్లిలో కార్మిక సంఘాల ప్రభావం ఎక్కువ. ఇక్కడ సీపీఐకి ఉన్న పట్టుతో బీఆర్ఎస్ గెలిస్తే అది ఖ‌చ్చితంగా మంత్రికి ఇబ్బందిక‌రంగా మార‌నుంది.

ఇలా, ఎక్క‌డా లేని విధంగా ప్ర‌తిప‌క్షం దూకుడు మీదుంటే… అధికార‌పక్షం ఆత్మ‌ర‌క్ష‌ణ ధోర‌ణితో ముందుకు సాగుతోంది. మంత్రి వివేక్‌ని అన్ని ర‌కాలుగా దిగ్భందం చేసిన బీఆర్ఎస్ బాల్క సుమ‌న్ ముందుకు సాగుతున్నారు. మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో చెన్నూరు, క్యాత‌న్‌ప‌ల్లి మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ జెండా ఎగుర‌వేసేందుకు పావులు క‌దుపుతున్నారు. మ‌రి మంత్రి ఈ వ్యూహాల‌ను చేధించుకుని ముందుకు సాగుతారా..? లేక చ‌తికిల‌ప‌డ‌తారా..? కొద్ది రోజుల్లో తేల‌నుంది…

 

 

Get real time updates directly on you device, subscribe now.

You might also like