మాట తూలింది… పొత్తు ముగిసింది..
రాజకీయాల్లో ఉన్న వారికి రెండు ధర్మాలు ఖచ్చితంగా ఉండాలి… ఒకటి అధికారంలో ఉన్నప్పుడు అణిగిమణిగి ఉండటం… అదే సమయంలో నోరు అదుపులో ఉండటం… ఈ రెండూ ఉంటేనే రాజకీయ వేత్తగా రాణిస్తారు… నాయకుడిగా ముందుకు సాగుతారు… అధికార బలం చూపినా… నోరు అదుపులో లేకున్నా ఎన్నో అనర్థాలు సంభవిస్తాయి… ఇక్కడ జరిగింది అదే…
మంచిర్యాల జిల్లా క్యాతన్‌పల్లి మున్సిపాలిటీలో సీపీఐ పార్టీ బీఆర్ఎస్‌తో పొత్తు పెట్టుకుంది. తాము మున్సిపల్ ఎన్నికల్లో కారుతో సాగుతామని ఆ పార్టీ, దాని అనుబంధ సంఘమైన ఏఐటీయూసీ నేతలు స్పష్టం చేశారు. ఈ వార్త రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. రాష్ట్రంలో కాంగ్రెస్, సీపీఐ కలిసి నడుస్తుండగా ఇక్కడ మాత్రం అందుకు భిన్నంగా రాజకీయాలు సాగుతున్నాయి. దీనికి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ వేసిన పాచిక ఒక కారణం కాగా, అసలు కారణం ఇంకోటి ఉంది.. ఒక రకంగా చెప్పాలంటే అసలు కారణం కూడా అదే.
మాట జారిన కాంగ్రెస్ నేతలు..
మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్, సీపీఐ రెండు పార్టీలకు సంబంధించి పొత్తుల ఖరారుపై జరిగిన సమావేశంలో సీపీఐ పది సీట్లు డిమాండ్ చేసింది. అదే సమయంలో వైస్ చైర్మన్ కూడా తమకు కావాలని కోరారు. అయితే, మీకు పట్టుమని పది ఓట్లు కూడా లేవు… అవన్నీ కాదు.. మేం ఇచ్చినవి తీసుకోండి అంటూ కాంగ్రెస్ నేతలు పరోక్షంగా మాట్లాడారు. దీంతో సీపీఐ నేతలు అలిగి బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపారు. విషయం తెలిసిన మంత్రి జూపల్లి కాంగ్రెస్ నేతలపై సీరియస్ అయినట్లు తెలుస్తోంది. దీంతో వాళ్లకు నాలుగు సీట్లు ఇచ్చేందుకు సుముఖం వ్యక్తం చేశారు. ఓ నాయకుడికి మధ్యవర్తిత్వం చేయమని చెప్పారు…. నా స్థాయి ఏంటి..? వాళ్ల స్థాయి ఏంటి నేను మాట్లాడను అని చెప్పడంతో కమ్యూనిస్టులు ఇక పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపారు.
భవిష్యత్‌లో సైతం వారితోనే…
కాంగ్రెస్ నేతలు మాట్లాడిన తీరుపై ఏఐటీయూసీ వాసిరెడ్డి సీతారామయ్య పూర్తి స్థాయిలో బాధపడిన విషయం ఆయన విలేకరుల సమావేశంలో తేటతెల్లమైంది.. తాము క్యాతన్‌పల్లి సర్పంచ్‌గా మూడు సార్లు, మండల ప్రెసిడెంట్‌గా చేశామని.. తాము గౌరవ ప్రదమైన సీట్లు అడిగామని సీతారామయ్య చెప్పారు. ఇప్పుడు సీపీఐ ఏం లేదు ఇక్కడ.. కొన్ని సీట్లకే పరిమితం అవుతారని కాంగ్రెస్ నేతలు అన్న మాటలు తమకు బాధ కలిగించాయని ఆయన చెప్పుకొచ్చారు. భవిష్యత్‌లో సైతం వారితో కలిసి పనిచేస్తామనే సంకేతాలు ఇచ్చారు.
అందుకే రాజకీయాల్లో ఎప్పుడు ఎవరితో ఏం మాట్లాడాలి…? ఎలా మాట్లాడాలి..? అనే విషయంలో పూర్తి స్పష్టత ఉండాలి… లేకపోతే ఇలాగే జరుగుతుంది… మరి ఈ నష్టాన్ని పూడ్చుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ఏం వ్యూహం రచిస్తుందో చూడాలి మరి…