ర‌క్ష‌ణ రంగానికి పెద్ద‌పీట‌

కేంద్ర బ‌డ్జెట్ 2026

Union Budget 2026:కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. వార్షిక బడ్జెట్ లో రక్షణ మంత్రిత్వ శాఖకు పెద్దపీట వేశారు. ఈసారి రక్షణ మంత్రిత్వ శాఖకు ఏకంగా 7.8 లక్షల కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌ను కేటాయించారు. ఇది- 2025-26 ఆర్థిక సంవత్సరంలో కేటాయించిన బడ్జెట్ కంటే చాలా ఎక్కువ. ఆ ఏడాది డిఫెన్స్ కు రూ. 6.81 లక్షల కోట్లను కేటాయించగా.. ఇప్పుడీ మొత్తం సుమారు 14.5 శాతం పెరిగింది. 7.8 లక్షల కోట్లకు చేరింది.

దేశ త్రివిధ దళాలను ప్రపంచంలోనే అత్యంత ఆధునికంగా, ‘మేడ్ ఇన్ ఇండియా’ ఆయుధాలతో సన్నద్ధం చేయడమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశం. ఈ ఏడాది బడ్జెట్‌లో సైనిక ఆధునికీకరణ కోసం ప్రత్యేకంగా 2.19 లక్షల కోట్ల రూపాయలను కేటాయించారు. ఈ నిధులతో కొత్త క్షిపణులు, యుద్ధ విమానాలు, జలాంతర్గాములు, డ్రోన్‌లు కొనుగోలు చేస్తారు. అమ్ముల పొదిలో సరికొత్త అస్త్రాలు వచ్చి చేరబోతున్నాయనే విషయాన్ని కేంద్రం చెప్పకనే చెప్పింది.

గత ఏడాది తేలికపాటి యుద్ధ హెలికాప్టర్ (LCH), రాఫెల్ ఎం, తేజస్ ఎంకే 1 ఏ వంటి ముఖ్యమైన ఒప్పందాలు కుదిరాయి. ఈసారి మరింత భారీ ఒప్పందాలపై దృష్టి సారించారు. ఈ బడ్జెట్ ద్వారా 114 రఫెల్ యుద్ధ విమానాల భారీ కొనుగోలు చేయాలని కేంద్రం నిర్ణయించింది. అదే సమయంలో ఫిఫ్త్ జనరేషన్ కు చెందిన సుఖోయ్-57 స్టెల్త్ ఫైటర్ వంటి కీలక ప్రాజెక్టులకు కొత్త ఊపు వస్తుందని, ఆధునికీకరణ మరింత జోరందుకుంటుందని భావిస్తున్నారు.

సైనిక శక్తిని పెంపొందించడంలో ఎటువంటి లోటుపాట్లకు తావు లేకుండా చూడాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ‘మేక్ ఇన్ ఇండియా’ కింద దేశీయ రక్షణ ఉత్పత్తిని ప్రోత్సహించడానికి భారీ బడ్జెట్‌ను భారతీయ కంపెనీలకే కేటాయించారు. తద్వారా ఆయుధాల విషయంలో ప్రపంచ దేశాలపై ఆధారపడటాన్ని తగ్గించినట్టవుతుంది. 2026-27 రక్షణ బడ్జెట్ గత రికార్డులన్నింటినీ అధిగమించింది. గత ఏడాది మాదిరిగానే, ఈసారి కూడా బడ్జెట్‌లో ఎక్కువ భాగం స్వదేశీ సంస్థల కోసం కేటాయించారు.

గత ఏడాది రక్షణ కొనుగోళ్లలో 75 శాతం వాటా దేశీయ ఆయుధాలకు మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఈసారి ఈ వాటాను మరింత బలోపేతం చేయాలని యోచిస్తున్నారు. ప్రస్తుతం సైన్యాన్ని స్వదేశీ డ్రోన్‌లు (UAVs), మానవరహిత వైమానిక వాహనాలు, ఆధునిక ట్యాంకులతో సన్నద్ధం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ బడ్జెట్ హెచ్ఏఎల్, డీఆర్డీఓ వంటి ప్రభుత్వ సంస్థలతో పాటు ప్రైవేట్ రంగ రక్షణ కంపెనీలకు గణనీయమైన ప్రోత్సాహాన్ని అందించినట్టవుతుంది.

114 మల్టీ-రోల్ ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్ (MRFA) టెండర్ ఈ బడ్జెట్ తర్వాత వేగం పుంజుకోనుంది. ఇందులో రాఫెల్ యుద్ధ విమానం అగ్రస్థానంలో ఉంది. సుఖోయ్-57 స్టెల్త్ ఫైటర్‌, చైనా సవాలును ఎదుర్కోవడానికి కొత్త జలాంతర్గాములు, నిఘా కోసం హై-టెక్ డ్రోన్‌ల కొనుగోలు ప్రక్రియను సైతం వేగవంతం చేస్తున్నారు.

ఆధునీకరణ (Capital Outlay): కొత్త యుద్ధ విమానాలు, జలాంతర్గాములు, అధునాతన ఆయుధాల కొనుగోలు కోసం ₹2.19 లక్షల కోట్లు కేటాయించారు. ఇది గత ఏడాది కంటే 21.8% ఎక్కువ.

పెన్షన్లు: రక్షణ రంగ పెన్షన్ల కోసం ₹1.71 లక్షల కోట్లు కేటాయించబడ్డాయి. రెవెన్యూ వ్యయం: సైనిక దళాల రోజువారీ నిర్వహణ మరియు జీతభత్యాల కోసం ₹5.53 లక్షల కోట్లు (పెన్షన్లతో కలిపి) కేటాయించారు.

దేనికోసం ఎంత? (అంచనాలు)

విభాగం కేటాయింపు (కోట్లలో)
విమానాలు & ఏరో ఇంజన్లు ₹63,733
నౌకాదళం (Naval Fleet) ₹25,023
పరిశోధన & అభివృద్ధి (R&D) నిధుల పెంపు

 

Get real time updates directly on you device, subscribe now.

You might also like