సరస్వతి పుష్కరాల పనులు పూర్తి చేయాలి

దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్

Saraswati River Pushkaras:సరస్వతి అంత్య పుష్కరాలకు సంబంధించిన అన్ని పనులు మే మొదటి వారం వరకు పూర్తి చేయాలని దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్(Principal Secretary, Endowments, Shailaja Ramayar) అధికారులను ఆదేశించారు. కాళేశ్వరంలో దేవాలయం, సరస్వతి ఘాట్, కాళేశ్వరం వంతెన, ముక్తి వనం తదితర ప్రాంతాలను ఆమె పరిశీలించారు. అనంతరం దేవాలయ ఈఓ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సరస్వతి అంత్య పుష్కరాల నిర్వహణకు ప్రభుత్వం రూ.30 కోట్ల పనులు చేపట్టిందని తెలిపారు. పనుల పూర్తికి నిరంతర పర్యవేక్షణ అవసరమని, మూడు నెలల సమయం మాత్రమే ఉన్నందున పనులు వేగవంతం చేయాలని సూచించారు.

సరస్వతి ఆది పుష్కరాలకు 40 లక్షల మంది భక్తులు హాజరయ్యారని, అంత్య పుష్కరాలకు సుమారు 60 లక్షల మంది వచ్చే అవకాశం ఉన్నందున అన్ని పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. పనుల పురోగతిని ప్రతి మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షిస్తామని తెలిపారు. కుదురుపల్లి–బీరసాగర్ రహదారి నిర్మాణానికి అంచనాలు సమర్పించాలని, సిరొంచ నుండి గోదావరి ఘాట్ వరకు తాత్కాలిక రహదారి వాహనాల పార్కింగ్ ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. టెంట్ సిటీ, పార్కింగ్, సరస్వతి ఘాట్, గోదావరి ఘాట్ వద్ద జనరేటర్లు ఏర్పాటు చేయాలని, మ్యూజియం ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని తెలిపారు. పనుల పర్యవేక్షణకు నోడల్ అధికారులను నియమించాలని సూచించారు.

జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ(District Collector Rahul Sharma) మాట్లాడుతూ అంచనా ప్రతిపాదనల్లో మార్పులు ఉంటే రెండు రోజుల్లో సమర్పించాలని, టెండర్ ప్రక్రియను పూర్తి చేసి త్వరగా పనులు ప్రారంభించాలని అధికారులకు సూచించారు. సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్ నోడల్ అధికారిగా వ్యవహరిస్తారని తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్(SP Sirisetty Sankeerth) ట్రాఫిక్ పార్కింగ్ రోడ్ మ్యాప్‌ను ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ కి వివరించారు. పుష్కరాల సంద‌ర్భంగా ట్రాఫిక్ జామ్ జరగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like