బంధుప్రీతి గురించి మీరు మాట్లాడమా..?
INTUC Janak Prasad:మాజీ మంత్రి హరీశ్ రావ్ సింగరేణి కార్మికులను తప్పుదోవ పట్టించేలా అబద్ధపు ప్రచారం చేస్తున్నారని తెలంగాణ రాష్ట్ర కనీస వేతన సలహా మండలి చైర్మన్ జనక్ ప్రసాద్ తీవ్రంగా విమర్శించారు. శ్రీరాంపూర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలిసిన వారి బంధువులకు కాంట్రాక్టులు ఇచ్చిందన్న హరీశ్ రావ్ ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని తెలిపారు. వాస్తవానికి బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలోనే బంధుప్రీతి ఆధారంగా సింగరేణిలో టెండర్లు కేటాయించారని దుయ్యబట్టారు.
ఇవిగో సాక్ష్యాలు..
VKOC–I, కొత్తగూడెం… సోధా కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కంట్రాక్టు పొందిందని, ఈ కంపెనీ ఎండీ దీప్తి రెడ్డి (మాజీ టీఆర్ఎస్ ఎమ్మెల్యే కండాల ఉపేందర్ రెడ్డి కుమార్తె) అన్నారు. ఇదే సంస్థకు VKOC–II ప్రాజెక్ట్‌ను 2023 నవంబరులో 10% అధిక రేటుతో బీఆర్ఎస్ ప్రభుత్వ కాలంలోనే కేటాయించారని తెలిపారు. ఇక కళ్యాణ ఖని ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్ట్… ఎక్స్‌ప్రెస్‌వే RVSR జేవీకి కంట్రాక్టు కట్టబెట్టారని… ఈ సంస్థ ఎండీలు దిక్సిత్ రావు, ప్రతిమ శ్రీనివాస్ రావు, వినోద్ రావు (మాజీ ఎంపీ టీఆర్ఎస్ మేనల్లుడు) అని తెలిపారు. ఈ సంస్థ ప్రతిమ గ్రూప్‌కు చెందినదన్నారు. RG OC–II ఎక్స్టెన్షన్ ప్రాజెక్ట్… కాంట్రాక్ట్ పొందిన సంస్థ: C5 ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్.. దీనికి డైరెక్టర్లు నిశాంత్ రావు & మదన్ మోహన్ రావు.. నిశాంత్ రావు – మాజీ ఎమ్మెల్సీ సుధాకర్ రావు కుమారుడు. సుధాకర్ రావు, కేసీఆర్, హరీశ్ రావు బంధువు తెలిపారు. SRP – OC–II ప్రాజెక్ట్… కాంట్రాక్ట్ పొందిన సంస్థ: హర్షా కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ఈ సంస్థ బీఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో అనేక సాగునీటి ప్రాజెక్టులను నిర్వహించింది. మాజీ ఈఎన్సీ ఇరిగేషన్ మురళీధర్ రావుతో డబ్బుల లావాదేవీల ఆరోపణలపై విచారణ ఎదుర్కొంటున్న ఈ సంస్థకు హరీశ్ రావుతో సంబంధాలున్నాయనే ఆరోపణలు కూడా ఉన్నాయని జనక్ ప్రసాద్ పేర్కొన్నారు.
అప్పుల ఊబిలో నెట్టి మీరు మాట్లాడుతున్నారా..?
పదేండ్లలో సింగరేణిని అప్పుల ఊబిలోకి నెట్టిన బీఆర్ఎస్ పార్టీకి సింగరేణి కార్మికుల గురించి మాట్లాడే నైతిక అర్హత లేదని జనక్ ప్రసాద్ స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం సింగరేణికి చెల్లించాల్సిన రూ.35 వేల కోట్ల బకాయిల విషయమై అప్పట్లో ఎందుకు ప్రశ్నించలేదని హరీశ్ రావును నిలదీశారు. అలాగే AITUC (CPI) అధికారంలో ఎవరు ఉంటే వారితో పొత్తు పెట్టుకుని రాజకీయ లాభాలు పొందడం, ఇప్పుడు మళ్లీ మున్సిపాలిటీ ఎన్నికల్లో బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకోవడం కార్మికుల ప్రయోజనాలకు విరుద్ధమన్నారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో, ఇప్పుడు మున్సిపాలిటీ ఎన్నికల్లో బీఆర్ఎస్తో, కొన్ని చోట్ల టీడీపీతో పొత్తులు పెట్టుకున్నారని ఆరోపించారు. గుర్తింపు సంఘంగా ఉన్నా సింగరేణి కార్మికులకు ఒక్క హక్కు కూడా సాధించలేకపోయారని AITUCపై తీవ్ర విమర్శలు చేశారు.
ఎన్నికలయ్యాక సొంత ఇంటి పథకాన్ని అమలు చేస్తాం..
కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేనివిధంగా సింగరేణి కాంట్రాక్టు కార్మికులకు బోనస్ ఇచ్చిందని, త్వరలో రూ.1 కోటి ప్రమాద బీమాను అమలు చేస్తామని తెలిపారు. ఎన్నికలు పూర్తయ్యాక సొంత ఇంటి పథకాన్ని కూడా అమలు చేస్తామని ప్రకటించారు. సింగరేణి వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో బీఆర్ఎస్కు బుద్ధి చెప్పి కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని కార్మికులు, ప్రజలకు విజ్ఞప్తి చేశారు. శ్రీరాంపూర్ వైస్ ప్రెసిడెంట్ జెట్టి శంకర్ రావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశంలో సెంట్రల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్లు ధర్మపురి, సమ్మయ్య, జనరల్ సెక్రటరీలు వికాస్ కుమార్ యాదవ్, రవీందర్ రెడ్డి, జీవన్ జోయల్, చీఫ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ నరేందర్, సెంట్రల్ డిప్యూటీ జనరల్ సెక్రటరీ స్వామి, సెంట్రల్ నాయకులు తిరుపతి రాజు, మనోజ్, రాపర్తి శ్రీనివాస్, శంకర్ రావు, సత్యనారాయణ, మహేష్ పాల్గొన్నారు.