అధికారులు, పోలీసులు మంత్రి తొత్తులు..
Balka Suman:చెన్నూరులో అధికారులు, పోలీసులు మంత్రికి తొత్తులుగా మారారని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ దుయ్యబట్టారు. ఇక్కడ ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందన్నారు. చెన్నూరులో బీఆర్ఎస్ పార్టీ లీగల్ సెల్ న్యాయవాది మల్లేశం గౌడ్ ఇంట్లో పోలీసుల తనిఖీలు నిర్వహించారు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఉండగా ఈ తనిఖీలు చేపట్టడం హాట్ టాపిక్ గా మారింది. ఈ వ్యవహారంపైబాల్క సుమన్ మంత్రి వివేక్ పై ఘాటుగా స్పందించారు. పోలీసులు అధికారులు మంత్రి వివేక్ కి తొత్తులుగా మారి ఆయనకు సహకరిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు..
చెన్నూర్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ నాయకులకు ఓటమి భయం పట్టుకుందని, కావాలనే మా కార్యకర్తలు,నాయకుల ఇళ్లపై మంత్రి దాడులు చేయిస్తున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంత్రి వివేక్ పీఏ రమణారావు పెద్ద మొత్తంలో డబ్బు, మద్యం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు పంపిణీ చేస్తున్నారని క్యాంపు కార్యాలయంపై అధికారులు సోదాలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా మంత్రి వివేక్ ప్రజాస్వామ్యాన్ని ఖునీ చేసి ఓటర్లను ప్రలోభపెట్టే విధంగా చూస్తున్నారని ఆయన మండిపడ్డారు…
తాము వచ్చిన అధికారులకు పూర్తిగా సహకరించామని అలాగే కాంగ్రెస్ నాయకుల ఇళ్ళ పై సోదాలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కేవలం బీ ఆర్ ఎస్ నాయకులనే టార్గెట్ చేస్తూ దాడులకు పాల్పడుతున్నారని దుయ్యబట్టిన బాల్క సుమన్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో, ఇతర కాంగ్రెస్ నాయకుల ఇళ్లలో ఎందుకు సోదాలు చేయలేదని ప్రశ్నించారు.