లాగులు ఊడదీసి కొట్టండి
బాల్క సుమన్ ప్రభుత్వ విప్
తెలంగాణకు కొంగు బంగారమైన సింగరేణిని ప్రైవేటు పరం చేసేందుకు కేంద్రం కుట్ర చేస్తోందని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాద్ టీఆర్ ఎస్ ఎల్పీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ తెలంగాణపై కావాలనే కుట్రలు చేస్తోందని దుయ్యబట్టారు. బీజేపీ నేతలు సింగరేణి విషయంలో ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు.సింగరేణి దేశప్రభుత్వ రంగసంస్థల్లో మొదటి సంస్థ అని ఆయన స్పష్టం చేశారు. కేంద్రప్రభుత్వం సింగరేణి కార్మిక వ్యతిరేక నిర్ణయాలకు నిరసనగా కార్మికులు ఆందోళనలు చేస్తున్నారని చెప్పారు. బొగ్గు బ్లాక్‌ల వేలానికి సంబంధించి బీజేపీ పాలిత ప్రాంతాల్లో ఒక నీతి, తెలంగాణకు ఒక నీతిలాగా వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. గుజరాత్ మినరల్ డెవలప్మెంట్కు మినరల్ బ్లాక్ లను వేలం వేయకుండా అప్పగించిందన్నారు. గుజరాత్ తరహాలో తెలంగాణ రాష్ట్రంలో వేలం వేయకుండా కేటాయింపు చేయాలంటే కేంద్రం ఒప్పుకోవడం లేదన్నారు. దేశ వ్యాప్తంగా ప్రభుత్వరంగ బొగ్గు బ్లాక్ లను ఆధానికి కట్టబెట్టే కుట్ర బీజేపీ చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువైన అద్వానీనే ముంచిన మోడీ- షా అదానిని పెంచే కుట్రలు రోజురోజుకూ పెరుగుతున్నాయని అన్నారు. కర్ణాటక, ఏపీ నీటి ప్రాజెక్టులకు జాతీయహోదా ఇచ్చారు…తెలంగాణ కు ఎందుకు ఇవ్వరని…? ఆయన ఈ సందర్భంగా ప్రశ్నించారు. తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే కేంద్రమంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి ఉలుకు పలుకు లేదన్నారు. తెలంగాణ బిజెపి నేతలకు తొలమందం అయిందని అన్నారు. బీజేపీ నేతలు ఢిల్లీలో దావత్ లు బంద్ చేసి సింగరేణి కార్మికులతో మాట్లాడాలన్నారు. మోడీతో కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఎందుకు మాట్లాడరని అన్నారు. సింగరేణి పై మాట్లాడకుంటె బీజేపీ భరతం పడతామన్నారు. క్రమ పద్దతిలో కేంద్రప్రభుత్వం తెలంగాణ ప్రతీ రంగాన్ని నిర్వీర్యం చేస్తున్నకుట్రలను తెలంగాణ సమాజం చేధించాలని పిలుపునిచ్చారు. పంజాబ్ లో రైతులు బీజేపీ ని గ్రామాల్లోకి రానివ్వడం లేదని, తన్ని తరి మేస్తున్నారని తెలిపారు. బొగ్గు బ్లాక్ ల వేలం ఆపకుంటే తెలంగాణ గ్రామాల్లో కూడా బీజేపీ కి అదే పరిస్థితి ఎదురవుతుందన్నారు. సింగరేణి కార్మికుల వెంటే టీఆర్ఎస్ ఉంటుందని. సమ్మె ముగిసిన తర్వాత భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. సింగరేణి కోసం మా ప్రభుత్వం చేసిన పనులు మరెవ్వరూ చేయలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నపుడు సింగరేణికి ఏం చేయలేదన్నారు. ఇపుడు మాయ మాటలు చెబుతోందన్నారు. తెలంగాణకు బొగ్గు దక్కకుండా చేసి విద్యుత్ రంగాన్ని దెబ్బ తీయాలన్నది బీజేపీ కుట్ర అని విరుచుకుపడ్డారు.