మస్టరేసి… ఇంటికి పంపి…
మణుగూరులో సింగరేణి అధికారుల నిర్వాకం
మణుగూరు సీహెచ్‌పీలో అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. తాజాగా ఆదివారం జరిగిన సంఘటన ఇందుకు అద్దం పడుతోంది. ఒక్క కార్మికుడు సమయానికి రాకున్నా అధికారులు మస్టర్ వేయరు. ముందు వెళ్లిపోయినా గైర్హాజర్ వేస్తారు. మరి అలాంటింది ఏకంగా 16 మంది కార్మికులకు మస్టర్ వేసి వారిని ఇంటికి పంపించారు. ఆదివారం ఉదయం షిస్ట్లో జరిగిన ఈ ఘటనపై కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ అధికారులు ఇలా ఎందుకు చేశారనే దానిపై పలు అనుమానాలకు తావిస్తోంది. 16 మందికి మస్టరేసి ఇంటికి పంపడం అది కూడా ప్లేడే రోజున పంపడం అధికారుల తీరుకు అద్దం పడుతోందని పలువురు చెబుతున్నారు. సమ్మె విచ్ఛినానికి పాల్పడ్డ అధికారులు వారికి సహకరించిన కార్మికులకు ఈ విధంగా బహుమతి ఇచ్చారని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సింగరేణి తమ జేబు సంస్థ అనుకుంటున్నరు – పతెం. రాజబాబు, హెచ్ఎంఎస్ తెలంగాణా రాష్ట్ర ఉపాధ్యక్షుడు
ఇక్కడ అధికారులు ఆడింది ఆట… పాడింది పాటగా మారింది. 16 మంది కార్మికులకు మస్టర్లు వేసి ఇంటికి పంపడం అంటే సింగరేణి తమ జేబు సంస్థ అనుకుంటున్నరు. సింగరేణి బొగ్గు బ్లాక్‌ల ప్రైవేటీకరణ అంశంలో కార్మికులు అందరూ ఒక్కటై సమ్మె చేశారు. ఇది నచ్చని అధికారులు సమ్మె విచ్ఛినం చేసేందుకు ప్రయత్నాలు చేశారు. వారికి సహకరించిన వారికి ఈ విధంగా గిఫ్ట్ ఇచ్చారు. అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలి.