పారిశుధ్య నిర్వహణ ప్రతి ఒక్కరికి బాధ్యత

జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

పారిశుద్ధ్య నిర్వహణ ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని క‌లెక్టర్ కుమార్ దీపక్ కోరారు. గురువారం మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ 32వ డివిజన్ లో మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అన్వేష్, మేయర్ ధర్ని మధుకర్ డిప్యూటీ మేయర్ చల్లా రమ్యతో కలిసి మంచిర్యాల శుభ్రత – ప్రతి ఒక్కరి ఆరోగ్య భద్రత కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పారిశుద్ధ్యం ప్రతి ఒక్కరి బాధ్యత అని, పరిశుభ్రత పాటించడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని తెలిపారు. వచ్చే 99 రోజులలో కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేసే విధంగా కార్యచరణ రూపొందించిన‌ట్లు చెప్పారు. మున్సిపాలిటీలు, గ్రామపంచాయతీల్లో మాత్రమే కాకుండా అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో పారిశుధ్య‌ కార్యక్రమాలు చేపట్టనున్న‌ట్లు వెల్ల‌డించారు. కార్యాలయాలలో పెండింగ్ లో ఉన్న జనన, మరణ, భవన నిర్మాణ, ఇతర ధ్రువపత్రాలకు సంబంధించి ఫైళ్ళ క్లియరెన్స్ కోసం చ‌ర్య‌లు చేప‌ట్ట‌నున్న‌ట్లు తెలిపారు.

మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్ మాట్లాడుతూ శుభ్రత కార్యక్రమంలో భాగంగా మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 60 డివిజన్లలో ప్రత్యేక డ్రైవ్ చేపట్టనున్న‌ట్లు చెప్పారు. మున్సిపల్, విద్యుత్, తాగునీరు సంబంధిత శాఖల సమన్వయంతో చర్యలు చేపడ‌తామ‌న్నారు. ముందు రోజు డివిజన్లో పర్యటించి సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. మంచిర్యాల పట్టణంలోని ఫంక్షన్ హాళ్లు, హాస్పిటళ్లు, వ్యాపార సముదాయాలు, మద్యం దుకాణాల నిర్వాహకులు శుభ్రత విషయంలో నిబంధనలు పాటించాలని కోరారు.

ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ కుమార్ దీపక్ నస్పూర్ మండలం తీగల్ పహాడ్ పరిధిలోని మండల పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాల భవన నిర్మాణ పనులను పరిశీలించి త్వరగా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అనంతరం నస్పూర్ మండల కేంద్రంలో గల ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల గోదామును జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) శ్రీనివాస్ రావు, ఎన్నికల విభాగం పర్యవేక్షకులు శ్రీనివాసరావు దేశ్ పాండే, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి త్రైమాసిక పరిశీలనలో భాగంగా సందర్శించారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like