డాన్సింగ్ మిస్సైల్ ప్రయోగించిన ఇరాన్..
Dancing Missile:రెండు, మూడు రోజుల్లో ఇరాన్‌ను లొంగదీసుకోవచ్చు అనుకున్న అమెరికా, ఇజ్రాయిల్‌కు ఆ దేశం చుక్కలు చూపిస్తోంది. తన అమ్ముల పొదిలో ఉన్న కొత్త కొత్త అస్త్రాలను బయటకు తీస్తోంది. దీంతో అమెరికా, ఇజ్రాయిల్ తలలు పట్టుకుంటున్నాయి….
ఇరాన్ మీద యుద్ధం ప్రకటించిన ఆ దేశాన్ని లొంగదీసుకోవాలని కలలు కన్న అమెరికా కలలు కల్లలవుతున్నాయి. అటు అమెరికా, ఇటు ఇజ్రాయిల్ ఏకకాలంలో ఇరాన్‌పై దాడులు చేసినా ఆ దేశం అదరడం లేదు… బెదరడం లేదు… పైగా అమెరికా దాని మిత్ర దేశాలకు దడ పుట్టిస్తోంది. డ్రోన్లు, వివిధ మిస్సైళ్లతో ఎడతెగని దాడులు చేస్తోంది. ఇప్పుడు కొత్తగా ఒక మిస్సైల్‌తో దాడి చేసి కలకలం సృష్టించింది. హర్మూజ్ జల సంధిని నియంత్రిస్తూ… అమెరికా స్థావరాలే లక్ష్యంగా ఇరాన్ క్షిపణులు, డ్రోన్లతో ఇరాన్ విరుచుకుపడుతోంది. ఇరాన్ సెజ్జిల్ అనే అత్యాధునిక క్షిపణులతో దాడులు చేసింది. యుద్ధం మొదలైన తర్వాత సెజ్జిల్ క్షిపణులను టెహ్రాన్ ఉపయోగించడం ఇదే తొలిసారి. సెజ్జిల్ అనేది స్వదేశీయంగా రూపొందించి, అభివృద్ధి చేసిన, ఘన ఇంధనంతో పనిచేసే రెండు దశల బాలిస్టిక్ క్షిపణి. దీనిని సజ్జిల్, అషౌరా, అషురా వంటి ఇతర పేర్లతో కూడా పిలుస్తారు.
జిగ్‌జాగ్‌గా.. డాన్స్ చేస్తూ…
ఇరాన్ స్వయంగా తయారుచేసిన రెండు-దశల సాలిడ్ ఫ్యూయల్ బాలిస్టిక్ మిస్సైల్ ఇది. 2000-2500 కిలోమీటర్ల రేంజ్‌తో వెళ్లే మధ్య-రేంజ్ మిస్సైల్ ఇది. 700 కేజీ వరకు పేలుడు పదార్థాలను మోసుకెళ్లగలదు. ఈ మిస్సైల్.. ఎక్కడో దూరంలో ఉన్న ఇజ్రాయెల్ దాటి కూడా వెళ్లగలదు. ఇది ఆకాశంలో నేరుగా వెళ్లకుండా జిగ్‌జాగ్ వెళ్తుంది. అంటే డాన్స్ చేస్తున్న మాదిరిగా అన్నమాట. అందుకే దానికి డాన్సింగ్ మిసైల్ అనే పేరుంది. అది ‘డాన్స్’ చేస్తూ ఇజ్రాయిల్ ఐరన్ డోమ్‌ను కూడా మోసం చేస్తుందట. ఈ మిస్సైల్ పొడవు 18 మీటర్లు, వ్యాసం 1.25 మీటర్లు, బరువు సుమారు 23,600 కేజీలు. 1990లలో డెవలప్ చేశారు, 2008లో మొదటిసారి ప్రయోగించారు. లిక్విడ్ ఫ్యూయల్ మిస్సైల్స్ లాంచ్‌కి గంటల కొద్దీ టైమ్ పడితే, ఈ మిస్సైల్ నిమిషాల్లో లాంచ్ అవుతుంది. శత్రువులు దీన్ని గుర్తించే ముందే దాడి చేస్తుంది. చాలా వేగంగా దూసుకెళ్లే రకం.
సాంకేతిక పరంగా ఎంతో అద్భుతం..
ఈ క్షిపణి అంతరిక్షంలో వెళ్లేటప్పుడు దిశ మార్చుకోగలదు. సెర్పెంటైన్ మోషన్‌తో రాడార్‌లను మోసం చేయగలదు. ఇజ్రాయిల్ ఐరన్ డోమ్, అమెరికా రక్షణ వ్యవస్థలను కూడా దాటి వెళ్తుంది. అందుకే ‘డాన్సింగ్ మిస్సైల్’ అని పేరు వచ్చింది. ఆయా దేశాల రక్షణ వ్యవస్థలు దానిని గుర్తించేలోపే దాడి చేస్తుంది. ఈ మిస్సైల్ కారణంగా ఇరాన్‌కు వేగంగా దాడి సామర్థ్యం సమకూరింది. ఇజ్రాయిల్ ఎయిర్ ఆపరేషన్స్ సెంటర్లు, గల్ఫ్‌లో అమెరికా బేసులే లక్ష్యంగా దీనిని ప్రయోగించింది.