56 వేల కోట్ల బకాయిలు వెంటనే చెల్లించాలి
టీబీజీకేస్ అధ్యక్షులు మిర్యాల రాజిరెడ్డి
Singareni: సింగరేణి సంస్థకు 56 వేల కోట్ల బకాయిలు రావాల్సి ఉందని, దీంతో సంస్థ రోజువారి నిర్వహణ కూడా కష్టమవుతోందనీ టీబీజీకేస్ అధ్యక్షులు మిర్యాల రాజిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే బకాయిల చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు.
8 ఇంక్లైన్ కాలనీ టీబీజీకేఎస్ కార్యాలయంలో జరిగిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నిధులు లేకపోవడం వల్ల డీజిల్ చెల్లింపులు, బ్లాస్టింగ్ మెటీరియల్ చెల్లింపులకు ఇబ్బందికరమైన పరిస్థితులు తలెత్తాయని స్పష్టం చేశారు. దీనివల్ల సరఫరా నిలిపివేస్తామని ఆ సంస్థలు అన్నాయంటే సంస్థ ఆర్థిక పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చని అవేదన వ్యక్తం చేశారు. గత సంవత్సరం సింగరేణి బాండ్ల రూపంలో వివిధ బ్యాంకుల నుండి తీసుకున్న ఓడీలకు చార్జిల రూపంలో చెల్లింపులే 220 కోట్ల రూపాయలను సంస్థ భరించాల్సి వచ్చిందన్నారు . రోజువారి యంత్రాల నిర్వహణకు కూడా విడిభాగాల్ని కొనలేని పరిస్థితులలో ఎన్నో వందల కోట్లు పెట్టి వెచ్చించిన మిషనరీని పక్కన ఉంచాల్సిన పరిస్థితి ఉందన్నారు.
గత సంవత్సరం ఉత్పత్తి నెమ్మదించిందని ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం త్వరలోనే సింగరేణి వ్యాప్తంగా ఉద్యమ కార్యాచరణ రూపొందించి పోరాటం చేస్తుందన్నారు. ఇది ఏ ఒక్కరి బాధ్యత కాదని ఈ సంస్థను కాపాడుకోవడానికి అన్ని సంఘాలు కలిసి పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు . కలిసి వచ్చే సంఘాలతో ముందుకెళ్తామని అన్నారు. కార్యక్రమంలో టీబీజీకేస్ RG2 ఉపాధ్యక్షులు ఆయిలి శ్రీనివాస్, మందమర్రి ఉపాధ్యక్షులు మేడిపల్లి సంపత్, నాయకులు దాసరి శ్రీనివాస్, రామచంద్రారెడ్డి, శంకర్, రవి, రామ్ చరణ్, జీవన్, నారాయణరెడ్డి, కుమారస్వామి, సంజీవరెడ్డి, రాజ్ కిరణ్, వెంకటేష్, నక్క శ్రీనివాస్,, నాయకులు పాల్గొన్నారు