తప్పుల నుంచి పాఠాలు.. విజయం వైపు అడుగులు..
-గత ఎన్నికల తప్పిదాలపై బీఆర్ఎస్ సమీక్ష
-పార్టీలో కార్యకర్తలకే ప్రాధాన్యత ఇచ్చేలా నిర్ణయం
-త్వరలోనే పార్టీ కమిటీల ఏర్పాటు
-టీబీజీకేఎస్ నాయకత్వం మార్పుకు సిద్ధం
-అవసరమైన చోట్ల ఎమ్మెల్యేలను సైతం మార్చుడే
-తన మనోగతాన్ని ఆవిష్కరించిన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
BRS Party: అది తెలంగాణ ఉద్యమ పార్టీ… ప్రత్యేక రాష్ట్రం తెచ్చిన పార్టీగా ప్రజలు గుర్తించారు… రెండుమార్లు పట్టం కట్టారు. ఇక, మూడోసారి ఎన్నికల్లో మాత్రం ప్రజలు ఆ పార్టీని దూరం పెట్టారు. ఎందుకు అలా జరిగింది… చేసిన తప్పులేంటి…? చేయాల్సిన పనులేంటి..? వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం ఏం చేయాలి..? ఇలా పార్టీలో అంతర్మథనం కొనసాగుతోంది..? మార్పులు, చేర్పులు చేసుకుంటూ ముందుకు పోవాలని పార్టీ నిర్ణయం తీసుకుంది. ఇంతకీ ఆ మార్పు ఉద్యమ పార్టీ బీఆర్ఎస్ ను విజయ తీరాలకు చేర్చుతుందా..? నాంది న్యూస్ ప్రత్యేక కథనం..
బీఆర్ఎస్ పార్టీలో పలు మార్పులు, చేర్పులు చోటు చేసుకోనున్నాయి. ఒకరకంగా చెప్పాలంటే గతంలో చూడని కొత్త పార్టీని మనం చూడవచ్చన్నమాట. ఇదే విషయాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. ఎన్నడూ లేని విధంగా దాదాపు మూడు గంటల పాటు మీడియాతో చిట్‌చాట్‌లో తన అంతరంగాన్ని ఆవిష్కరించారు. కొన్ని తప్పులు చేశామని, వాటిని సవరించుకుంటామని చెప్పిన ఆయన పార్టీలో మార్పులు చేర్పులు తథ్యమంటూ సంకేతాలు ఇచ్చారు. ఆయన చెప్పిన విషయాలు వరుసగా చూసుకుంటూ వెళితే ఖచ్చితంగా పార్టీలో పెనుమార్పులు చోటు చేసుకోనున్నాయి.
కార్యకర్తలకే ప్రాధాన్యత..
వాస్తవానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే సెంట్రిక్ పార్టీ. అంటే నియోజకవర్గం మొత్తం ఆయనదే బాధ్యత.. అధినేతకు ఏం కావాలన్నా…? పార్టీ నిర్ణయాలు తీసుకోవాలన్నా అది ఖచ్చితంగా ఎమ్మెల్యే ద్వారానే జరగాలి. ఇప్పటి వరకు అలాగే జరిగింది. అయితే, ఆ ఎమ్మెల్యే తప్పులు చేస్తే.. ఆయనే పార్టీ మారితే. ఆ నియోజకవర్గం మొత్తం పార్టీకి ఇబ్బందులు తప్పడం లేదు. అలా కాకుండా, బూత్ స్థాయిలో కార్యకర్తలను బలోపేతం చేసుకుంటూ రావాలని… కమిటీలు ఏర్పాటు చేసి అధినేతతోనే నేరుగా కార్యకర్తలను సైతం మాట్లాడే స్థాయికి తీసుకోవాలని పార్టీ భావిస్తోంది. సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీలతో పార్టీ నాయకత్వం సమన్వయం చేసుకునేలా చర్యలు తీసుకోనున్నారు. తెలుగుదేశం లాంటి పార్టీలో అలాంటి పరిస్థితులు ఉంటాయి. ఇదే విషయాన్ని కేటీఆర్ సైతం స్పష్టం చేశారు.
తెలంగాణ బొగ్గు గని నాయకత్వ మార్పు..
తెలంగాణకు గుండెకాయలాంటి సంస్థ సింగరేణి. దాదాపు ఆరు జిల్లాల్లో వ్యాపించి ఉన్న ఈ సంస్థలో బీఆర్ఎస్ అనుబంధ సంఘమైన తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం(TBGKS) సరైన పాత్ర పోషించడంలో పూర్తి స్థాయిలో విఫలమైంది. అది కాస్తా బీఆర్ఎస్ ఓటమికి కారణమైందని అధిష్టానం భావిస్తోంది. గతంలో ఎన్నోమార్లు నాయకత్వం మార్పు చేయాలని భావించినా అప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో యూనియన్‌ను సంస్కరించడం సాధ్యం కాలేదు. ఇప్పుడు ఖచ్చితంగా టీబీజీకేఎస్ ప్రక్షాళన చేయాల్సిందేనని అధిష్టానం ముందుకు సాగుతోంది. తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘానికి పార్టీకి మధ్య ఉన్న గ్యాప్ లేకుండా ఉండేలా పార్టీ ప్రణాళికలు రూపొందిస్తోంది.
నాయకత్వాన్ని మార్చాల్సి వస్తే మార్చుడే..
అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమికి పార్టీ చేసిన తప్పుల కంటే స్థానిక నాయకత్వం(ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర నాయకులు) చేసి తప్పులే కారణమని భావిస్తున్నారు. ఎన్నికల తర్వాత జరిగిన కొన్ని సర్వేల్లో ఇది స్పష్టమైంది కూడా. కేసీఆర్ సారు గెలవాలి.. కానీ, మా ఎమ్మెల్యే ఓడిపోవాలి.. ఇలా చాలా చోట్ల ప్రజలు భావించడం వల్లనే సీట్లు కోల్పోయారని ఆ సర్వేలు స్పష్టం చేశాయి. వాస్తవానికి చాలా చోట్ల అభ్యర్థులను మార్చాల్సి ఉండగా, చివరి నిమిషంలో అధినేత ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నారు. అది కాస్తా పార్టీ ఓటమికి కారణమైంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో 12 మందిని మారిస్తే 10 చోట్ల గెలిచారు… కూడా ఇదే విషయాన్ని పార్టీ అధిష్టానం గుర్తించింది. అంటే కేసీఆర్‌పై వ్యతిరేకత లేదని… చాలా చోట్ల స్థానిక ఎమ్మెల్యేలపై ఉన్న వ్యతిరేకత కాస్తా తమ పార్టీ ఓడిపోయిందని అధిష్టానం చెబుతోంది. ఈసారి అలా కాకుండా ఎట్టి పరిస్థితుల్లో గెలుపు గుర్రాలకే టిక్కెట్లు ఇవ్వాలని పార్టీ నిర్ణయం తీసుకుంది.
ఇలా తప్పుల నుంచి గుణపాఠాలు నేర్చుకుని ముందుకు సాగాలని బీఆర్ఎస్ భావిస్తోంది. అటు అధికార పార్టీపై పోరాటం చేస్తూనే ఇటు పార్టీ పునర్వస్థీకరణ చేసేందుకు ముందుకు సాగుతోంది. వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం ఇప్పటి నుంచే సమాయత్తం అవుతోంది.