విద్యార్థులు భవిష్యత్ నాశనం చేసుకోవద్దు
షీ టీమ్ నియోజకవర్గ ఇన్‌చార్జి మానస
విద్యార్థులు చెడు వ్యసనాలకు అలవాటు పడి భవిష్యత్ నాశనం చేసుకోవద్దని షీ టీమ్ నియోజకవర్గ ఇన్‌చార్జి మాలోతు మానస అన్నారు. సోమవారం తాండూరు ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. సైబర్ నేరాలు పెరిగిపోవడం వల్ల ఇంట్లో తల్లిదండ్రులకు బంధువులకు సైబర్ నేరాల పై అవగాహన కల్పించాలని విద్యార్థులకు సూచించారు. ఆన్లైన్ ఆర్థిక మోసానికి గురైన బాధితులు ఆలస్యం చేయకుండా 155260 లేదా డయల్ 100 కి కాల్ చేసి పోలీసువారికి సమాచారం ఇవ్వాలన్నారు. పోగొట్టుకున్న డబ్బులను తిరిగి పొందే అవకాశం ఉందని, చుట్టుపక్కల బంధువులకు మిత్రులకు ఎవరికైనా మోసం జరిగితే వెంటనే టోల్ ఫ్రీ నెంబర్ లకు కాల్ చేసి సమాచారం ఇవ్వాలని తెలిపారు. విద్యార్థులు ఒక గోల్ ఏర్పాటు చేసుకొని దానికి అనుగుణంగా చదువుకోవాలన్నారు. విద్యార్థులు అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎవరైనా కొత్త వ్యక్తులు చెప్పే మాయమాటలకు మోసపోవద్దన్నారు. ఎవరి పైన అయినా అనుమానం ఉంటే వెంటనే డయల్100 కి కాల్ చేయాలని కోరారు. షీ టీమ్ వాట్సప్ నంబర్ 6303923700 కి తమ ఇబ్బందులను మెసేజ్ ద్వారా చెప్పవచ్చన్నారు. ఈ సందర్భంగా సైబర్ అవేర్‌నెస్, క్రమశిక్షణ, గోల్ ఏర్పాటు , లీడర్ షిప్ లక్షణాలు, సెల్ ఫోన్ వినియోగం వల్ల అనర్ధాలు, ర్యాగింగ్, ఈవ్ టీజింగ్, ఆన్లైన్ మోసాల గురించి, బాల్య వివాహాలు,షీ టీమ్ ఇంపార్టెన్స్, డయల్ 100 మొదలయిన విషయాలపై విద్యార్థులకు అవగాహన నిర్వహించారు.