వడ్డీ వ్యాపారులపై పోలీసుల కొర‌డా

-ఆదిలాబాద్ జిల్లాలో 15 కేసులు న‌మోదు
-జిల్లావ్యాప్తంగా ఏకకాలంలో 45 బృందాలు..
-15 పోలీస్ స్టేషన్ల పరిధిలో ఆకస్మిక దాడులు
-పెద్ద ఎత్తున ప్రామిసరీ నోట్లు, చెక్కులు, పాస్ బుక్కులు, బాండ్ పేపర్స్, సేల్ డీడ్స్‌ స్వాధీనం

రైతులు, అమాయక ప్రజల నడ్డి విరుస్తూ వారి రక్తాన్ని పిండి పీడిస్తున్న వడ్డీ వ్యాపారులపై జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ కొర‌డా ఝ‌ళిపించారు. గురువారం ఆదిలాబాద్ జిల్లాలో ఏకకాలంలో 16 మండలాలలో 45 బృందాలుగా ఏర్ప‌డి దాదాపు వందమంది వడ్డీ వ్యాపారులపై ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా 7 మండలాలలో దాదాపు 15 కేసులు నమోదు చేసిన‌ట్లు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. కొంద‌రు వ‌డ్డీ వ్యాపారులు వ్యవసాయ భూములు తాకట్టు పెట్టుకుని, ఆ భూములు తమ పేర్లపై రాయించుకొని వడ్డీ నిర్వహిస్తున్నార‌ని త‌మ దృష్టికి వ‌చ్చింద‌న్నారు. తాము చేసిన దాడుల్లో వడ్డీ వ్యాపారుల‌ వద్ద నుండి ప్రామిసరీ నోట్లు, బాండ్లు, చెక్కుబుక్కులు, ఖాళీ పేపర్లు, స్టాంప్ పేపర్లు, సేల్ డీడ్స్‌ లాంటివి స్వాధీనం చేసుకున్నామ‌ని అన్నారు. ప్రజలను మోసం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామ‌ని, అక్రమార్కుల ఆటలు క‌ట్టిస్తామ‌న్నారు.

గ‌త ఏడాది 18 కేసులు న‌మోదు…
గ‌త ఏడాది సెప్టెంబ‌ర్‌లో ఏక‌కాలంలో వ‌డ్డీ వ్యాపారుల‌పై దాడులు చేయించిన ఎస్పీ 18 కేసులు నమోదు చేశారు. ఏకకాలంలో 43 బృందాలతో 13 మండలాలలో దాడులు నిర్వహించారు. అదే స‌మ‌యంలో నార్నూరు మండలంలో బంగారం కుదువ పెట్టుకొని అధిక వడ్డీకి డబ్బులను ఇస్తూ ప్రజలను మోసం చేస్తున్న వ్యక్తి వద్ద నుంచి 12 గ్రాముల బంగారం 235 గ్రాముల వెండి స్వాధీనం చేసుకొన్నారు. నిందితుడు ఉట్ల రవి, లక్ష్మీ ప్రసన్న జ్యువెలర్స్ పై కేసు నమోదు చేశారు. ఇలా ఎస్పీ వ‌రుస‌గా వ‌డ్డీ వ్యాపారుల‌పై దాడులు చేస్తుండ‌టంతో వారిలో వ‌ణుకు మొద‌లైంది.

Get real time updates directly on you device, subscribe now.

You might also like