బంగారం కొనవద్దని మోదీ ఎందుకన్నారు..?
-ఏడాది పాటు బంగారం కొనవద్దని ప్రజలకు పిలుపు
-ఎరువులు, పురుగు మందులు కూడా తగ్గించండి
-ప్రధాని వ్యాఖ్యల వెనకున్న అసలు కారణాలివే..!!
Modi appeals to the people of the country not to buy gold:ఓ ఏడాది పాటు బంగారం కొనకండి.. అంతర్జాతీయ పరిస్థితుల వల్ల బంగారం ధరలు పెరుగుతున్నాయి.. ఏడాది పాటు కొనుగోళ్లకు దూరంగా ఉండండి.. పండుగలు, శుభకార్యాలు ఏవైనా దూరంగా ఉండాలి… ఇదీ ప్రధాని మోదీ చెప్పిన మాట… హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన మోదీ ఈ విజ్ఞప్తి చేశారు. అసలు మోదీ అలా ఎందుకున్నారు..? ఆయన మాటల్లో ఆంతర్యం ఏంటి..?
మన దేశంలో బంగారానికి ఉన్న ప్రాధాన్యత అందరికీ తెలిసిందే. అదంటే అందరికి ఎంతో ప్రాణం. ముఖ్యంగా మహిళలకు పండగైనా, పబ్బమైనా ఏదైనా సరే… బంగారం ఉండాల్సిందే. అందుకే విదేశాల నుంచి బంగారం దిగుమతి చేసుకునే దేశాల్లో మన దేశం ముందు వరుసలో ఉంది. 2024-25లో మనం సుమారు 4. 93లక్షల కోట్ల రూపాయల విలువైన బంగారం దిగుమతి చేసుకున్నాం. 2025-26లో ఏకంగా 6.11 లక్షల కోట్ల రూపాయల విలువైన బంగారం విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నాం. అంటే ఏడాది కాలంలోనే మరో లక్ష కోట్ల రూపాయల అదనంగా డిమాండ్ పెరిగినట్లు అర్థం అవుతోంది.
భారీగా విదేశీ మారక నిల్వల వినియోగం..
మనం ఇతర దేశాల నుంచి బంగారం తెచ్చుకోవాలంటే మన దగ్గర ఉన్న డాలర్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. డిమాండ్ ఎంత ఎక్కువ పెరిగితే అంత ఎక్కువ డాలర్లను ప్రభుత్వం ఖర్చు చేసి కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల విదేశీ మారకద్రవ్య నిల్వలు తగ్గే ప్రమాదం ఉంది. అంతేకాదు ఈ దిగుమతుల వల్ల వాణిజ్య లోటు పెరుగుతుంది. గడిచిన రెండు ఆర్థిక సంవత్సరాల్లో సుమారు 11 లక్షల కోట్ల విలువైన విదేశీ మారక ద్రవ్యం కేవలం బంగారం దిగుమతికే ఖర్చు చేశాం. అంతర్జాతీయంగా బంగారం ధరలు పెరగడంతో గడిచిన ఏడాదితో పోల్చితే కేంద్రం మరో లక్ష కోట్ల రూపాయలు అదనంగా ఖర్చే చేయాల్సి వచ్చింది.
బంగారం కొనడం తగ్గిస్తే..
ప్రజలు బంగారం కొనుగోళ్లు తగ్గించడం ద్వారా దేశ వాణిజ్య లోటు (Trade Deficit) తగ్గుతుంది. రూపాయి విలువ స్థిరంగా ఉంటుంది. దీంతో ఆ సొమ్ము ఇతర ఉత్పాదక రంగాల్లో పెట్టుబడిగా పెట్టవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. మోదీ కేవలం బంగారం గురించే కాకుండా, రైతులు రసాయన ఎరువులు, పురుగుమందుల వాడకాన్ని తగ్గించి సేంద్రీయ వ్యవసాయం (Organic Farming) వైపు మళ్లాలని సూచించారు. ఎరువుల సబ్సిడీ రూపంలో ప్రభుత్వంపై భారీ భారం పడుతోంది. అలాగే వంట నూనె దిగుమతులపై మనం ఇతర దేశాలపై ఆధారపడుతున్నాం… దాని వినియోగం కూడా తగ్గిస్తే ఆరోగ్యం మెరుగుపడుతుంది… విదేశీ మారక ద్రవ్యం ఆదా అవుతుందని ప్రధాని అభిప్రాయం..
ఇలా మోదీ విదేశాల నుంచి దిగుమతి చేసుకునే బంగారం, ఎరువులతో పాటు మధ్యతరగతి ప్రజలకు దుబారా ఖర్చులను తగ్గించుకోవాలని, ఆడంబరాల కోసం అప్పులు చేయవద్దని పిలుపునిచ్చారు. ప్రస్తుత అంతర్జాతీయ అనిశ్చితి పరిస్థితుల్లో (Global Economic Uncertainty), దేశాన్ని ఆర్థికంగా సుస్థిరం చేయడంతో పాటు వ్యక్తిగత పొదుపు ప్రోత్సహించడమే ప్రధాని మోదీ విజ్ఞప్తి వెనుక ఉన్న అసలు రహస్యమని. “పొదుపే ఆయుధం” అనే సూత్రాన్ని ఆయన ప్రజల్లోకి తీసుకెళ్లాలని ప్రయత్నిస్తున్నారని నిపుణులు చెబుతున్నారు.