డిపో ఎదుట డ్రైవర్ల ఆందోళన

Drivers protest with family members in front of RTC depot:తాము విధులకు హాజరయ్యే ముందు నిర్వహించే ఆల్కహాల్ పరీక్షల్లో లోపాలు ఉన్నాయని ఆరోపిస్తూ ఆర్టీసీ డిపో ఎదుట డ్రైవ‌ర్లు కుటుంబ సభ్యులతో కలిసి నిరసన చేపట్టారు. త‌మ‌ను అధికారులు ఇబ్బందుల‌కు గురిచేస్తున్నార‌ని ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు.

మంచిర్యాల డిపో ఎదుట డ్రైవ‌ర్లు త‌మ కుటుంబ స‌భ్యుల‌తో కలిసి నిర‌స‌న వ్య‌క్తం చేశారు. డ్రైవర్ రాయమల్లు మద్యం సేవించినట్లు అధికారులు బ్రీత్ ఎనలైజర్ పరీక్షలో నిర్ధారించగా, తాను మద్యం సేవించలేదని ఆయన స్పష్టం చేశారు. బ్రీత్ ఎనలైజర్ మిషన్లు సరిగా పనిచేయకపోవడం వల్లే తప్పుడు ఫలితాలు వస్తున్నాయని అధికారులకు విన్నవించారు. రాయ‌మ‌ల్లు 2సార్లు ఉత్త‌మ డ్రైవ‌ర్ అవార్డు తీసుకున్నార‌ని అలాంటి వ్య‌క్తి తాగి విధుల‌కు ఎలా వ‌స్తార‌ని ప‌లువురు ప్ర‌శ్నిస్తున్నారు. ఇదే తరహాలో మరో డ్రైవర్‌కు కూడా మొదట మద్యం సేవించినట్లు రిపోర్టు రాగా, రెండోసారి పరీక్షించగా మద్యం సేవించలేదని నివేదిక‌ రావడంతో మిషన్ల పనితీరుపై అనుమానాలు వ్యక్తమ‌వుతున్నాయి.

గ‌తంలో 73 పాయింట్లు వ‌చ్చిన డ్రైవ‌ర్‌ను పంపించార‌ని అధికారులు ఏం చేస్తున్నార‌ని ప్ర‌శ్నిస్తున్నారు. ఒక యూనిట్ అధికారిగా మీరేం చేస్తున్నార‌ని… దీనికి సెక్యూరిటీ త‌ప్పా..? అధికారుల త‌ప్పా..? అని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఒక్కొక్క‌రిని ఒక్కోలా చూస్తున్నార‌ని దుయ్య‌బ‌ట్టారు. ఆల్కహాల్ పరీక్షించే యంత్రాలు సరిగా పనిచేయడం లేదని తాము పలుమార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని, పైగా సస్పెన్షన్‌లతో బెదిరింపులకు గురిచేస్తున్నారని ఆర్టీసీ కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్య పరిష్కారం అయ్యే వరకు బస్సులు నడపబోమని డ్రైవర్లు స్పష్టం చేశారు. వారు ఆందోళ‌న‌కు దిగ‌డంతో డిపోలో బస్సులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

 

 

Get real time updates directly on you device, subscribe now.

You might also like