ప్రాణం పోస్తారా…? కాల‌క్షేపం చేస్తారా…?

-ప్రాణ‌హిత ప్రాజెక్టు డిజైన్ మార్చ‌నున్న కాంగ్రెస్ ప్ర‌భుత్వం
-అధికారంలోకి వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి ప్రాజెక్టు నిర్మిస్తామంటున్న ప్ర‌భుత్వం
-ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క అడుగు కూడా ముందుకు ప‌డ‌లేదు
-ప్ర‌భుత్వం రెండేళ్ల‌లో పూర్తి చేస్తుందా..?
-ఆర్థిక ఇబ్బంది ప‌రిస్థితుల్లో ప్ర‌జ‌ల్లో అనుమానాలు..
-ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుని పూర్తి చేస్తే ఉమ్మ‌డి ఆదిలాబాద్ స‌స్య‌శ్యామ‌లం

Dr. B.R. Ambedkar Pranahita-Chevella Project:ప్రాణ‌హిత‌కు ప్రాణం పోయడం సాధ్య‌మేనా..? ప్ర‌భుత్వం చెబుతున్న‌ట్లు ఆ ప్రాజెక్టుకు జీవ‌మోస్తుందా..? మ‌హారాష్ట్ర స‌ర్కార్ అనుమ‌తిస్తుందా…? గ‌తంలో 148 మీట‌ర్ల అనుమ‌తిచ్చిన మ‌హారాష్ట్ర స‌ర్కార్ తెలంగాణ ప్ర‌తిపాద‌న‌ల‌కు లైన్ క్లియ‌ర్ చేస్తుందా..? ఆదిలాబాద్ ఉమ్మ‌డి జిల్లా క‌ల‌ల ప్రాజెక్టు సాకార‌మ‌య్యేందుకు అడ్డంకులు తొల‌గేనా…? తుమ్మ‌డిహెట్టి క‌ట్టి తీరుతామ‌ని చెబుతున్న ప్ర‌భుత్వం మాటలు కార్య‌రూపం దాల్చుతాయా..? ఆ ప్రాజెక్టు నిర్మాణానికి ముందున్న స‌వాళ్లు, ఆర్థికాంశాలు ఏంటి…?

కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండ‌లం తుమ్మ‌డిహెట్టి వ‌ద్ద ప్రాజెక్టు నిర్మించి ఆదిలాబాద్ ఉమ్మ‌డి జిల్లాను స‌స్య‌శ్యామ‌లం చేయాల‌ని… ఆ త‌ర్వాత ఆ నీటిని చేవెళ్ల‌కు తీసుకుపోవాల‌నే కాంగ్రెస్ ప్ర‌భుత్వ ఆలోచ‌న‌. ఉమ్మ‌డి రాష్ట్రంలో వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి హ‌యాంలో ప్రాణహిత – చేవెళ్ల ప్రాజెక్టును 2008లో నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించింది. రూ. 38,500 కోట్ల అంచ‌నా వ్య‌యంతో దాదాపు 16 ల‌క్ష‌ల ఎక‌రాల‌కు సాగు నీరు, 106 కిలోమీట‌ర్ల మేర కాల్వ‌లు త‌వ్వేలా ప్ర‌ణాళిక‌లు రూపొందించారు. దీనికి సంబంధించి 71.05 కిలోమీట‌ర్ల మేర భూ సేక‌ర‌ణ పూర్తి కాగా, 46 కిలోమీట‌ర్ల మేర ప‌నులు సైతం పూర్త‌య్యాయి.

ఉమ్మ‌డి ఆదిలాబాద్‌కు తీర‌ని అన్యాయం..
మహారాష్ట్ర ప్రభుత్వం బ్యారేజీ ఎత్తు 148 మీటర్లకు తగ్గించాలని సూచన చేసింది. దీంతో కేసీఆర్ ప్రభుత్వం ప్రాజెక్టు రీ డిజైన్ చేసింది. తుమ్మిడిహట్టి బ్యారేజీని పక్కన పెట్టి మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం వద్ద మూడు బ్యారేజీలను కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించారు. దీంతో ఉమ్మ‌డి ఆదిలాబాద్ కు తీరని అన్యాయం జ‌రిగింది. త‌లాపునే గోదారి… మ‌న చేను చెల‌క ఎడారి అన్న‌చందంగా అటు గోదావ‌రి, ఇటు ప్రాణ‌హిత ప్ర‌వ‌హిస్తున్నా ఉమ్మ‌డి ఆదిలాబాద్ జిల్లాలో ఒక్క‌టి స‌రైన ప్రాజెక్టు లేక చాలా చోట్ల రైతులు వ‌ర్షాధారంపై ఆధార‌ప‌డుతున్నారు.

తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు నిర్మాణంలో మార్పులు..
ఈ ప్రాజెక్టు నిర్మించి తీరాల‌ని ప‌ట్టుద‌ల‌తో ఉన్న కాంగ్రెస్ ప్ర‌భుత్వం ప్రాజెక్టు నిర్మాణంలో మార్పులు, చేర్పులు చేసింది. ఒక్క చోట కాకుండా, రెండు చోట్ల బ్యారేజీలు నిర్మించాల‌ని డిజైన్ చేశారు. గ‌తంలో ప్ర‌తిపాదించిన ప్రాంతానికి ఎగువ‌న వార్దా, వైన్‌గంగ న‌దుల సంగమం వ‌ద్ద బ్యారేజీ వంపులు వ‌చ్చేలా నిర్మించ‌నున్నారు. 6.5 కిలోమీట‌ర్ల మేర వార్దా న‌దిపై ఒక‌టి, వైన్‌గంగ‌పై ఒక‌టి బ్యారేజీలు నిర్మిస్తారు. ఈ రెండింటిని క‌లుపుతూ భారీ కాంక్రీట్ బండ్ నిర్మించ‌నున్నారు. ఇప్పుడున్న 71.5 కిలోమీట‌ర్ల పాయింట్ వ‌ద్ద నుంచి సుందిళ్ల‌కు నీటిని త‌ర‌లించి అక్క‌డ నుంచి ఎల్లంప‌ల్లికి నీరు లిఫ్ట్ చేయ‌నున్నారు.

ప్రాజెక్టు వెన‌క‌ రాజ‌కీయ కార‌ణాలు కూడా…
కాళేశ్వ‌రం ప్రాజెక్టు నిర్మాణం కేవ‌లం బీఆర్ఎస్ పార్టీకే ల‌బ్ధి చేకూరింద‌ని ఆరోపిస్తున్న కాంగ్రెస్… కాళేశ్వరం ప్రాజెక్టు సాంకేతిక లోపాలే తుమ్మిడిహట్టి ప్రాజెక్టు నిర్మాణానికి ముఖ్య కారణమని చెబుతోంది. కుంగిన మేడిగడ్డ బ్యారేజీ మరమ్మతులు ఎప్పటికి పూర్తవుతాయో చెప్పలేమని, ఎట్టి ప‌రిస్థితుల్లో తుమ్మ‌డిహెట్టి పూర్తి చేస్తామ‌ని కాంగ్రెస్ నేత‌లు చెబుతున్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన తప్పులను ప్రభుత్వం ప్రజల్లో చర్చకు పెడుతోంది. తుమ్మిడిహెట్టి నిర్మించడం ద్వారా బీఆర్‌ఎస్ తప్పులను సరిచేస్తున్నామని చెప్పుకునే అవకాశంతో పాటు.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పట్టు పెంచుకునే వ్యూహం కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

నయా నాట‌కం అంటూ బీఆర్ఎస్ ఆగ్ర‌హం..
తుమ్మిడిహెట్టిపై కాంగ్రెస్ పార్టీ కొత్త నాట‌కాలు ఆడుతోందంటూ బీఆర్ఎస్ దుయ్య‌బడుతోంది. కేవ‌లం రైతుల‌ను మ‌భ్య‌పెట్టేందుకే హ‌డావిడి చేస్తున్నారంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తోంది. కేంద్ర జలవనరుల శాఖ సంస్థలు తుమ్మిడిహెట్టి వద్ద తగినంత నీటి లభ్యత లేదన్నాయని, ఆ అంశాలను దాచిపెట్టి కాంగ్రెస్ పాత లెటర్లను వక్రీకరించి చూపిస్తోందని హ‌రీష్ రావు ఆరోపించారు. తుమ్మిడిహెట్టి ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వ వైఖరి గందరగోళంగా ఉందని, మంత్రులు ఒకలా, సీఎం రేవంత్ రెడ్డి మరోలా మాట్లాడుతున్నారని అన్నారు. 150 మీటర్ల ఎత్తుతో ప్రాజెక్టు నిర్మాణానికి ఇప్పటివరకు ఎలాంటి స్పష్టమైన ఒప్పందం కుదరలేదని పేర్కొన్నారు.

నిర్మాణం పూర్త‌య్యేనా..?
అయితే, ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఎన్నో అంశాలు తెరపైకి వ‌స్తున్నాయి. వాస్త‌వానికి కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఏర్ప‌డ్డ‌ప్ప‌టి నుంచి తుమ్మ‌డిహెట్టి నిర్మించి తీరుతామ‌ని చెబుతున్నా ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క అడుగు కూడా ముందుకు ప‌డ‌లేదు. మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వంతో తెలంగాణ చ‌ర్చ‌లు కొన‌సాగించాల్సి ఉంది. ఆ ప్ర‌భుత్వం అంగీక‌రిస్తేనే ప్రాజెక్టు అడుగులు ముందుకు ప‌డ‌తాయి. లేక‌పోతే లేదు. ఇక‌, ప్ర‌భుత్వం ఇప్ప‌టికే ఆర్థికంగా ఇబ్బందిక‌ర ప‌రిస్థితుల్లో ఉంది. ఆ విష‌యాన్ని స్వ‌యంగా ముఖ్య‌మంత్రే అంగీక‌రించారు. మ‌రి, ఈ ప్రాజెక్టు హుటాహుటిన పూర్తి చేయ‌డం అంటే దాదాపు అసాధ్య‌మే. ఈ గండాల‌న్నింటిని దాటుకుని ప్ర‌భుత్వం ప్రాజెక్టు పూర్తి చేస్తుందా..? ప్ర‌తిప‌క్షాల నోళ్లు మూయిస్తుందా..? లేక ఎన్నిక‌ల స‌మ‌యం ద‌గ్గ‌ర‌ప‌డుతుంద‌ని హ‌డావిడి చేసి వ‌దిలేస్తుందా..? వేచి చూడాలి మ‌రి..

Get real time updates directly on you device, subscribe now.

You might also like