పుల్వామా దాడి సూత్ర‌ధారి హమ్జా బుర్హాన్ హ‌తం

భారత జవాన్ల ప్రాణాలను బలిగొన్న పుల్వామా దాడి ప్రధాన సూత్రధారులలో ఒకడైన హమ్జా బుర్హాన్‌ అలియాస్ డాక్టర్ ను గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు లేపేశారు. పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌(పీవోకే)లో అతడిని గుర్తు తెలియని వ్యక్తులు కాల్చిచంపారు. ముజఫరాబాద్‌లో ఈ ఘటన జరిగింది. ముజఫరాబాద్‌లోని తన కార్యాలయంలో కూర్చుని ఉండగా, గుర్తుతెలియని వ్యక్తులు అత్యంత సమీపం నుంచి అత‌డిని కాల్చారు.

విద్యార్థి నుంచి ఉగ్రవాదిగా..
బుర్హాన్‌ , 2017లో ఉన్నత విద్య కోసం పాకిస్థాన్ వెళ్లాడు. అక్కడ నిషేధిత ఉగ్రవాద సంస్థ అల్-బదర్ లో చేరాడు. అతి తక్కువ కాలంలోనే ఆ సంస్థలో కమాండర్‌గా ఎదిగి, భారత్‌పై దాడులకు ప్లాన్ చేయడం మొదలుపెట్టాడు. ముఖ్యంగా 2019 పుల్వామా దాడిలో ఇతడి పాత్ర అత్యంత కీలకమని భారత నిఘా సంస్థలు గుర్తించాయి. దీనిపై విచారణ జరిపిన కేంద్ర హోం మంత్రిత్వ శాఖ 2022లో ఇతడిని ఉగ్రవాదిగా ప్రకటించి UAPA చట్టం కింద నోటిఫికేషన్ విడుదల చేసింది.

టీచర్‌గా నకిలీ వేషం.. ఐఎస్‌ఐ అండ
పాకిస్థాన్‌లో తన ఉగ్రవాద మూలాలను దాచుకోవడానికి బుర్హాన్‌ ఒక పాఠశాలలో టీచర్‌గా, ప్రిన్సిపాల్‌గా నకిలీ వేషం వేసుకున్నాడు. అయితే తెరవెనుక మాత్రం ఉగ్రవాదులకు శిక్షణ ఇవ్వడం, సరిహద్దుల గుండా వారిని భారత్‌లోకి చొప్పించడం వంటి పనులను పర్యవేక్షించేవాడు. పాక్ గూఢచారి సంస్థ ISI అతడికి కార్యాలయంతో పాటు AK-47 తుపాకులు ధరించిన సాయుధ గార్డులతో రక్షణ కల్పించింది. ఇంతటి కట్టుదిట్టమైన భద్రత మధ్య కూడా అతడిని మట్టుబెట్టారు.

ఉగ్ర నెట్‌వర్క్‌కు భారీ దెబ్బ
హమ్జా బుర్హాన్‌ మరణం ‘అల్-బదర్’ సంస్థకు , కాశ్మీర్‌లో ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తున్న శక్తులకు భారీ దెబ్బ. కేవలం దాడులకే పరిమితం కాకుండా, సోషల్ మీడియా ద్వారా లోకల్ యువతను ఉగ్రవాదం వైపు ఆకర్షించడం లో ఇతడు సిద్ధహస్తుడు. ఇతడి మరణంతో జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాద నియామకాలు, ప్రచార కార్యక్రమాలు కుంటుపడే అవకాశం ఉందని భద్రతా నిపుణులు విశ్లేషిస్తున్నారు.

You might also like