బ్యాటరీ స్టోరేజీ.. సింగరేణికి సరికొత్త ఎనర్జీ!
-సింగరేణిలో సత్ఫలితాలిస్తున్న 'బ్యాటరీ స్టోరేజీ సిస్టమ్'
-నాలుగు నెలల్లో రూ.25 లక్షల ఆదా
-బీఈఎస్ఎస్‌తో సంస్థకు భారీ ఆర్థిక లాభం
-సోలార్ విద్యుత్తు నిల్వతో సింగరేణి సక్సెస్
-రాష్ట్రంలోనే తొలి బీఈఎస్ఎస్‌కు అద్భుత ఫలితాలు
-మిగులు విద్యుత్తే ఇప్పుడు ఆ సంస్థకు సంపద
-బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్‌తో సింగరేణి కొత్త రికార్డు
Singareni:రాష్ట్రంలోనే తొలిసారిగా సింగరేణిలో ఏర్పాటు చేసిన బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ సిస్టమ్ సత్ఫలితాన్ని ఇస్తోంది. సోలార్ విద్యుత్‌లో మిగిలిన విద్యుత్‌ను నిల్వ చేసుకుని వాడుకునే బ్యాటరీలో నిల్వ చేసుకుని అవసరమైనప్పుడు వాడుకునే అవకాశం కలిగించే ఈ వ్యవస్థ సింగరేణికి ఆర్థిక లబ్ధి చేకూర్చుతోంది. నాలుగు నెలల కిందట మందమర్రి ఏరియాలో 28 మెగావాట్ల సింగరేణి సోలార్ ప్లాంట్ కు అనుబంధంగా ఒక మెగావాట్ బ్యాటరీ ఎనర్జీ సిస్టమ్ నెలకొల్పారు. దాని కోసం సింగరేణి యాజమాన్యం రూ.2.5 కోట్లను వెచ్చించింది.
బీఈఎస్ఎస్ ఉపయోగం ఏమిటి?
సింగరేణితో సహా పలు సంస్థలు సోలార్ విద్యుత్ ను ఉత్పత్తి చేస్తున్నాయి. సింగరేణి సంస్థ ఇప్పటికే 8 చోట్ల 245.5 మెగావాట్ల సామర్థ్యం గల సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేసింది. వీటిలో 147 మెగావాట్ల సామర్థ్యం గల ప్లాంట్లను ఓపెన్ యాక్సెస్ ప్లాంట్లుగా, మిగిలిన 98.50 మెగావాట్ల సామర్థ్యం గల ప్లాంట్లను ఇన్ హౌజ్ ప్లాంట్లుగా గుర్తించి తెలంగాణ విద్యుత్తు గ్రిడ్డులకు అనుసంధానం చేసింది. ఈ ఇన్ హౌజ్ ప్లాంట్ల విద్యుత్తును కూడా తెలంగాణ విద్యుత్ శాఖ గ్రిడ్లకు అనుసంధానం చేశారు. విద్యుత్ ఒప్పందం ప్రకారం ఇక్కడ అవసరాలకు వాడుకుని మిగిలిన విద్యుత్తుకు తెలంగాణ డిస్కంలకు అందించాలి. కానీ, అదనపు విద్యుత్‌కు డిస్కం ఎలాంటి డబ్బులు ఇవ్వదు… మిగులు విద్యుత్తు ఉచితంగానే గ్రిడ్‌కు సరఫరా చేయాల్సి ఉంటుంది.
మిగులు విద్యుత్తే ఇప్పుడు సంపద..
ఈ విధంగా ఇన్ హౌస్ ప్లాంట్ల నుండి రోజుకు వేలాది యూనిట్ల మిగులు విద్యుత్తును ఎటువంటి ఆర్థిక ప్రయోజనం లేకుండా గ్రిడ్ కు సరఫరా చేస్తున్నారు. మందమర్రి లో 28 మెగావాట్ల సోలార్ ప్లాంట్ సమర్థంగా పనిచేస్తూ మందమర్రి, శ్రీరాంపూర్ ఏరియా లలోని గనులకు, కాలనీలకు అవసరమైన విద్యుత్తును అందిస్తోంది. స్థానిక విద్యుత్తు అవసరాలకు సరిపోగా ఇంకా కొంత విద్యుత్తు మిగిలిపోతుంది. ఈ నేపథ్యంలో మందమర్రి ప్లాంటు లో జనవరి నెలలో బ్యాటరీ ఎనర్జీ స్టోరీ సిస్టం ను సింగరేణి ఏర్పాటు చేసింది. అప్పటి నుండి ఇప్పటి వరకు బిఈఎస్ఎస్ యూనిట్ స్థానిక అవసరాలకు వినియోగించగా ఇంకా మిగిలిన 3,35,485 యూనిట్ల విద్యుత్తును నిల్వ చేసుకొని అవసరమైన సందర్భంలో వినియోగించుకుంది. తద్వారా సింగరేణి సంస్థకు రూ. 25,66,460 ఆర్థిక లబ్ధి చేకూరింది.
భవిష్యత్తులో మరిన్ని ప్రాజెక్టులు..
ఒక మెగావాటు సామర్థ్యం గల బీఈఎస్ఎస్ యూనిట్ ఇంత పెద్ద మొత్తంలో విద్యుత్తును ఆదా చేయడం విశేషం. ఇక్కడ ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేసిన బీఈఎస్ఎస్ విజయవంతం అవడంపై సింగరేణి యాజమాన్యం హర్షం వ్యక్తం చేసింది. పునరుత్పాదక ఇంధన వనరులను ప్రోత్సహించాలనే ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా మరిన్ని ప్రాజెక్టులను చేపట్టేందుకు సంసిద్ధంగా ఉన్నట్లు యాజమాన్యం ప్రకటించింది. సింగరేణి సంస్థ ఇప్పటికే 8 చోట్ల ఏర్పాటు చేసిన సోలార్ పవర్ ప్లాంట్లలో వీటిని ఏర్పాటు చేస్తే మిగులు విద్యుత్‌తో ఎంతో లబ్ధి చేకూరనుంది.