నకిలీ పత్తి విత్తనాల గుట్టురట్టు..
– 5.45 క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలు స్వాధీనం
– ఇద్దరు నిందితులపై కేసు నమోదు
నకిలీ పత్తి విత్తనాల ముఠా గుట్టు రట్టు చేశారు కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా పోలీసులు… నకిలీ పత్తి విత్తనాలపై ప్రత్యేక దృష్టి పెట్టిన పోలీసులు సిర్పూర్ (యు) పోలీస్ స్టేషన్ సమీపంలో నిర్వహించిన వాహన తనిఖీల్లో 5.45 క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించిన వివరాలను జిల్లా ఎస్పీ నితిక పంత్ తెలిపారు.
సిర్పూర్ (యు) పోలీస్ స్టేషన్ సమీపంలో సిర్పూర్ (యు) ఎస్ఐ విక్రమ్ తన సిబ్బందితో కలిసి వాహన తనిఖీలు నిర్వహిస్తున్నారు. అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించారు. వారి వద్ద నుంచి మొత్తం 68 కిలోల (152 ప్యాకెట్ల) పత్తి విత్తనాలు లభించాయి. ఒక్కో ప్యాకెట్‌లో సుమారు 450 గ్రాముల చొప్పున విత్తనాలు ఉన్నాయి. అయితే, వాటిపై ప్రభుత్వ ఆమోదిత వివరాలు, క్యూ ఆర్ కోడ్, హలోగ్రామ్, లాట్ నెంబర్ వంటి గుర్తింపులు లేకపోవడంతో వెంటనే వ్యవసాయ శాఖ అధికారి ఆనందరావుకు సమాచారం అందించారు. ఆయనవాటిని నకిలీ పత్తి విత్తనాలుగా నిర్ధారించారు.
ఈ కేసుపై ఆసిఫాబాద్ సబ్ డివిజన్ డీఎస్పీ అశోక్ ఆధ్వర్యంలో దర్యాప్తు చేపట్టారు. రెండు నెలలుగా సిర్పూర్ మండల పరిధిలో సుమారు 6.75 క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలను రైతులకు సరఫరా చేయాలని తీసుకువచ్చినట్లు తేలింది. మధ్యప్రదేశ్‌కు చెందిన మంగునాథ్ అనే వ్యక్తి ప్రస్తుతం ఇంద్రవెల్లిలో నివాసం ఉంటున్నారు. ఆయనతో పాటు నైతం జంగు ఇంటి వద్ద మరో (1100 ప్యాకెట్స్) 4.90 క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకోగా, మొత్తం 5.45 క్వింటాళ్ళ నకిలీ పత్తి విత్తనాలు స్వాధీనం చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఎస్పీ వెల్లడించారు.
ఈ నకిలీ విత్తనాలు పట్టుకోవడంలో కృషి చేసిన డీఎస్పీ అశోక్ , ఎస్సై విక్రమ్ , కానిస్టేబుల్స్ నాగేంద్రబాబు, నాగేంద్ర లను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. రైతులు నకిలీ విత్తనాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ప్రభుత్వ అనుమతులు ఉన్న విక్రయ కేంద్రాల నుంచే విత్తనాలు కొనుగోలు చేయాలని ఎస్పీ సూచించారు. నకిలీ విత్తనాల సమాచారం ఉంటే వెంటనే సమీప పోలీస్ స్టేషన్ లో గాని, డయల్ 100కి తెలపాలని కోరారు.