కార్మికులకు జరిగిన అన్యాయాలను 12వ వేజ్‌బోర్డులో సవరించాలి..
టీబీజీకేఎస్ ఉపాధ్యక్షులు ఆయిలి శ్రీనివాస్
TBGKS:పదకొండవ వేజ్ బోర్డు కాలపరిమితి ముగిసే టైం దగ్గర పడుతున్నా… జాతీయ కార్మిక సంఘాలు 12వ వేజ్ బోర్డు నియమించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరకపోవడం సిగ్గుచేటని టీబీజీకేఎస్ ఉపాధ్యక్షులు ఆయిలి శ్రీనివాస్ ఎద్దేవా చేశారు. ఆయన వకీల్ పల్లి గని సందర్శించి కార్మికులను ఉద్దేశించి మాట్లాడారు. గత రెండు వేజ్ బోర్డులలో కార్మికులకు తీవ్ర నష్టం కలిగిందన్నారు. దీనికి జాతీయ కార్మిక సంఘాలు బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.
అండర్ గ్రౌండ్ అలవెన్స్ 12.5% శాతం నుండి 9 శాతానికి తగ్గించుకొని వేజ్‌బోర్డు ప్రారంభం అయిన రోజుకే ఫ్రీజ్ చేసుకోవడం.. ఇతర అలవెన్స్ లను కూడా ఫ్రీజ్ చేయడం వల్ల కార్మికులకు అన్యాయం జరిగిందన్నారు. అంతేకాకుండా, మూడు సంవత్సరాలకు ఒకసారి పెన్షన్ సమీక్షించుకొని పెంచుకునే అవకాశం ఉన్నప్పటికీ 28 సంవత్సరాలుగా ఒకసారి కూడా పెన్షన్ పెంచలేదన్నారు. 3.84% అదనపు పెన్షన్ రికవరీకి ఒప్పుకోవడం.. పెన్షన్ లో ఎస్ డిఏ మినహాయించడం వల్ల పెన్షన్ తగ్గిపోయిందన్నారు. 30 సంవత్సరాల తర్వాత దిగిపోయే కార్మికునికి కూడా సీపీఆర్ఎంఎస్ పేరు మీద 40,000 రికవరికి ఆమోదించడం సిగ్గు చేటన్నారు.
ఇలాంటి చర్యల ద్వారా ప్రతి కార్మికునికి రూ. 4,000 నుండి 8,000 వరకు ప్రతి నెల నష్టం చేకూరే విధంగా గత వేజ్ బోర్డుల లో ఒప్పందం చేసుకున్నాయని దుయ్యబట్టారు. ప్రమోషన్లకు సంబంధించిన క్యాడర్ విషయాల్లో, సంక్షేమం విషయాల్లో, జేసీసీల్లో ఎటువంటి నిర్ణయాలు తీసుకోకపోవడం వల్ల కార్మికుల ప్రమోషన్, ఇతర ఆర్థిక ప్రయోజనాలు దెబ్బ తిన్నాయన్నారు. ఇకనైనా 12వ వేజ్ బోర్డులో కార్మికులకు ఆర్థిక నష్టం జరగకుండా 35% ఫిట్మెంట్ బెనిఫిట్ తో అలవెన్స్లు ఫ్రీజ్ కాకుండా ఉండే విధంగా జాతీయ కార్మిక సంఘాలు అన్ని కలిసికట్టుగా కామన్ మినిమం ముసాయిదా పత్రాన్ని కోల్ ఇండియా యాజమాన్యానికి సమర్పించాలని డిమాండ్ చేశారు.
అదే విధంగా ప్రమోషన్ పాలసీలు వెల్ఫేర్ అమ్యూనిటీస్, సొంత ఇంటి పథకం కూడా వేజ్ బోర్డులో ప్రస్తావించాలని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం బొగ్గు గని కార్మికుల పక్షాన జాతీయ కార్మిక సంఘాలను డిమాండ్ చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు హరి ప్రసాద్, వెంకటేష్ ,రవితేజ ,నరేష్, రాజు అరవింద్, రామ్ చరణ్ ,శ్రీనివాస్, గంగాధర్, రంజిత్ , రమేష్, జీవన్, వినోద్ ,సంజీవ్, చాణక్య ,శ్రీధర్, అనిల్ ,అజయ్ పాల్గొన్నారు