ఆలింగనాలు.. ఆనందభాష్పాలు.. ఆడబిడ్డల అపూర్వ కలయిక
మన సంస్కృతిలో ఆడబిడ్డది పెద్దపీటనే.. ఇంట్లో ఆడబిడ్డ లేకుండా ఎలాంటి కార్యక్రమం ముందుకు సాగదు. ఆడబిడ్డలంటే అంతగా ప్రేమ ఉంటుంది… ఒక ప్రాంతానికి చెందిన దాదాపు 300 మంది ఆడబిడ్డలు ఒకే చోట కలిస్తే వారంతా తమ వారిని ఆశీర్వదిస్తే ఎంత బాగుంటుంది… ఇక్కడ అదే జరిగింది.. ఆడబిడ్డలంతా కలిసి వేడుక చేసుకున్నారు. ఆలింగనాలు, ఆనందభాష్పాల మధ్య అద్భుతంగా కార్యక్రమాలు నిర్వహించారు.
ఆడబిడ్డలంటే ఇంటికి దేవతలే… మార్వాడీ సమాజంలో వారికి ఇంకా ప్రాధాన్యత ఉంటుంది.. ప్రతి పండుగలో కూడా వారికే పెద్ద పీట. మూడు, నాలుగు ఏండ్లకు ఒకసారి వచ్చే అధిక మాసంలో వారిని ఇంటికి పిలిచి వారి ఆశీర్వాదం తీసుకోవడం ఆనవాయితీ. సువాగత్ లాడేసర్ ఆంగనియా పేరుతో ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో ఈ కార్యక్రమం నిర్వహించారు. రాజస్థానీ మహిళా మండలి ఆధ్వర్యంలో నిర్వహించిన “సువాగత్ లాడేసర్ ఆంగనియా” కార్యక్రమం ఆనందోత్సాహాల మధ్య నిర్వహించారు. బెల్లంపల్లి పట్టణంలోని ఆడబిడ్డలందరినీ కార్యక్రమానికి ఆహ్వానించారు.
దేశంలోని వివిధ రాష్ట్రాలు, నగరాల నుంచి పెద్ద ఎత్తున మహిళలు తరలివచ్చారు. వచ్చిన వారిలో 60, 70 ఏండ్ల వయసు వాళ్లు కూడా ఉండటం గమనార్హం. బెల్లంపల్లి పట్టణంలోని శ్రీకృష్ణ మందిరం నుండి శోభాయాత్రతో ప్రారంభమైన ఈ శోభాయాత్ర మహేశ్వరి భవన్‌కు వరకు సాగింది. అక్కడ అతిథులకు ఘన స్వాగతం పలికారు. అనంతరం వైదిక్ ఫంక్షన్ హాల్‌లో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, వినోదాత్మక కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమం ముగింపులో మహిళలు, కుమార్తెలను సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.
కార్యక్రమంలో రాజస్థానీ మహిళా మండలి అధ్యక్షురాలు అనురాధా చితలాంగి, కార్యదర్శి సుష్మా లాహోటి, ఖజాంచీ రాఖీ శర్మ, ఉపాధ్యక్షులు సులోచనా లోయా, పింకీ అగ్రవాల్, ఉప కార్యదర్శులు తారా లోయా, ప్రియాంకా సోమాని, అలాగే సభ్యులు లీలా జీ బంగ్, ఉర్మిళా ఝంవర్, సునీతా ఝంవర్, సంగీతా జైన్, నిషా లోయా, కుసుమ్ సోనీ, జ్యోతి అగ్రవాల్, అనురాధా పారక్ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం విజయవంతానికి కృషి చేసిన మహిళలు, సమస్త సమాజ సభ్యుల సహకారం, మార్గదర్శకం, భాగస్వామ్యం పట్ల వారు కృతజ్ఞతలు తెలిపారు.