పోలీస్ స్టేషన్‌లో మహిళ ఆత్మహత్యాయత్నం..

-సివిల్ వివాదంలో పోలీసుల జోక్యంపై తీవ్ర ఆరోపణలు
-ఎస్సై వేధింపులతోనే ఘటన జరిగిందంటున్న బాధిత కుటుంబం

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి తాళ్లగురిజాల పోలీస్ స్టేషన్‌లో మంగళవారం చోటుచేసుకున్న ఘటన కలకలం రేపింది. ప్రజలను రక్షించాల్సిన పోలీసులే వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ ఓ మహిళ పోలీస్ స్టేషన్‌లోనే క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. బాధిత కుటుంబం తెలిపిన వివ‌రాల ప్రకారం… బెల్లంపల్లి మండలం భూదా కుర్దు గ్రామానికి చెందిన గుంపుల లక్ష్మణ్‌కు చెందిన ట్రాక్టర్‌ను కొందరు ఇంట్లో ఎవరూ లేని సమయంలో గేటు తాళాలు పగులగొట్టి తీసుకెళ్లారు. ఈ ఘటనపై ఏప్రిల్ 15న తాళ్లగురిజాల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అయినా ఎస్సై రామకృష్ణ సరైన చర్యలు తీసుకోలేదని బాధితులు ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

అదే సమయంలో “బియ్యాల పోశం” అనే వ్యక్తికి నువ్వు మధ్యవర్తిగా జామీను ఉన్నావు కాబట్టి ముందుగా ఆ డబ్బులు చెల్లించాలని… ఆ తర్వాతే ట్రాక్టర్ ఇస్తాం అంటూ ఎస్సై ఒత్తిడి తెస్తున్నారని లక్ష్మణ్ ఆరోపిస్తున్నాడు. సివిల్ వివాదంలో పోలీసులు జోక్యం చేసుకుని సెటిల్మెంట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారని కుటుంబ సభ్యులు మండిపడుతున్నారు. మంగళవారం దంపతులు పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించి తమకు న్యాయం చేయాలని ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో మనస్తాపానికి గురైన భాగ్యలక్ష్మి వెంట తెచ్చుకున్న క్రిమిసంహారక మందు సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఇంత జ‌రుగుతున్నా ఎస్సై రామకృష్ణ స్పందించలేదని… 108కు కూడా సమాచారం ఇవ్వలేదని కుటుంబ సభ్యులు ఆవేద‌న వ్య‌క్తం చేశారు. వర్షం కురుస్తుండటంతో ఆటో కూడా అందుబాటులో లేకపోవడంతో బంధువులు స్వంత కారులో ఆమెను మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ట్రాక్టర్‌ను పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చి కూడా తమకు అప్పగించకుండా… అప్పు వివాదాన్ని తమపై మోపుతూ వేధింపులకు గురి చేస్తున్నారని బాధిత కుటుంబం ఆరోపిస్తోంది. ఫిర్యాదు చేసిన వారినే మానసికంగా ఇబ్బందులకు గురి చేస్తున్న తాళ్లగురిజాల ఎస్సై రామకృష్ణపై ఉన్నతాధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు, గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like